మితి మీరిన ఉచితాలతో ముప్పు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ.. ప్రభుత్వ భూములు అమ్ముతూ జ‌‌నాకర్షక ప‌‌థ‌‌కాలు, ఉచితాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక ప‌‌రిస్థితి బాగున్నప్పుడు సంక్షేమ ప‌‌థ‌‌కాలు ప్రవేశ‌‌పెట్టడంలో తప్పు లేదు. కానీ అప్పులు చేసి, భూముల‌‌నమ్మి  సంక్షేమ ప‌‌థ‌‌కాల పేరిట డ‌‌బ్బులు పంచ‌‌డం అంటే రాష్ట్రాన్ని ఇంకింత అప్పుల ఊబిలోకి తీసుకుపోవడమే అవుతుంది. మితిమీరిన అప్పులు భవిష్యత్​త‌‌రాల వారికి గుదిబండ‌‌గా త‌‌యార‌‌య్యే ప్రమాద‌‌ముంది. ఇప్పటికైనా ప్రజాప్రాతినిధ్య చ‌‌ట్టాన్ని స‌‌వ‌‌రించి, ఆయా ప్రభుత్వాలు ఎన్నిక‌‌ల్లో ల‌‌బ్ధి పొందేందుకు ప్రవేశపెట్టే ఉచితాల‌‌కు క‌‌ళ్లెం వేయాల్సిన అవ‌‌స‌‌రం ఉంది. 

దివాళ తీసిన దేశాలు..

సంక్షేమ ప‌‌థ‌‌కాలు రెండు రకాలు. మొద‌‌టి దాంట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటిని అభివృద్ధి చేస్తుంది. దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేద‌‌లు చ‌‌దువు అంది అభివృద్ధి చెందుతారు. ఉచిత వైద్యం పొంది ఆరోగ్యంగా ఉంటారు. ఇక రెండవ దాంట్లో వ్యక్తి(ఓటరు)ను దృష్టిలో పెట్టుకొని అమలు చేసే సంక్షేమ ప‌‌థ‌‌కాలు. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్నట్లు క‌‌ల్యాణ‌‌ల‌‌క్ష్మి, డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు, గొర్రెల పంపిణీ, బ‌‌తుక‌‌మ్మ చీరెలు, రైతు బంధు, పింఛన్లు తదితరాలు. రెండవ రకంలో స‌‌మాజంతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా లాభం చేకూరుతోంది. కొన్ని దేశాలు మితిమీరిన సంక్షేమ ప‌‌థ‌‌కాలు, ఉచితాలు ప్రవేశపెట్టి కొద్దికాలంలోనే దివాలా తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  ప్రపంచంలో అత్యధికంగా చ‌‌మురు నిల్వలు ఉన్న వెనిజులా దేశం సంక్షేమ ప‌‌థ‌‌కాల పేరిట లెక్కకు మించి ఖ‌‌ర్చు చేసింది. అదే స‌‌మ‌‌యంలో అంత‌‌ర్జాతీయ మార్కెట్‌‌లో చ‌‌మురు ధ‌‌ర‌‌లు ప‌‌డిపోవ‌‌డంతో దివాల తీసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో ప్రభుత్వాలు ప‌‌డిపోయి దేశంలో అస్థిర‌‌త‌‌, అరాచ‌‌కం చోటు చేసుకున్నాయి. గ్రీసు దేశం ప్రపంచానికి ప్రజాస్వామ్య జీవ‌‌న విధానం, తత్వశాస్త్రం,  రంగ‌‌స్థలం, ఒలింపిక్ క్రీడ‌‌లు వంటివి అందించిన ఒక అభివృద్ధి చెందిన రాజ్యం. మితిమీరిన సంక్షేమ ప‌‌థ‌‌కాలు అమలు చేసి ఈ దేశం కూడా దివాలా తీసింది. శాంతి భ‌‌ద్రత‌‌ల స‌‌మ‌‌స్యల‌‌తో కొట్టుమిట్టాడుతోంది.  మ‌‌న పొరుగు దేశమైన శ్రీ‌‌లంక ప‌‌రిస్థితి వేరుగా చెప్పన‌‌క్కర్లేదు. 

రెండు రకాల అప్పులు

తెలంగాణ రాష్ట్రం రెండు రకాలుగా అప్పులు చేస్తోంది. ఒకటి నేరుగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటోంది. ఇలా తీసుకున్న అప్పు రాష్ట్ర బ‌‌డ్జెట్ ప‌‌ద్దుల్లో చూపిస్తోంది. ఎఫ్‌‌ఆర్‌‌బీఎమ్(ద్రవ్య వినిమ‌‌య చ‌‌ట్టం) ప్రకారం రాష్ట్రాలు అప్పులు చేయ‌‌డానికి కొన్ని ప‌‌రిమితులు ఉన్నాయి.  అలాగే కేంద్రం అనుమ‌‌తి కూడా అవ‌‌స‌‌రం. ఇక రెండ‌‌వ ర‌‌కం ప్రభుత్వ కార్పొరేష‌‌న్లు ద్వారా. వీటి ద్వారా తీసుకుంటున్న అప్పులకు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉండ‌‌దు. పూచిక‌‌త్తు మాత్రమే ఇస్తుంది. కార్పొరేష‌‌న్లు పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నా అవి ప్రభుత్వ లెక్కలోకి రావు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పు ఎంతా అన్నది ప్రజలకు తెలియడం లేదు. పాల‌‌న‌‌లో వివిధ కార్యక్రమాల‌‌కు అప్పులు తీసుకోవ‌‌డంలో త‌‌ప్పు లేదు. అయితే అటువంటి అప్పు పెట్టుబ‌‌డుల కింద ఖ‌‌ర్చు చేస్తే ఆదాయం వ‌‌స్తుంది. తిరిగి క‌‌ట్టే ప‌‌రిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రజాక‌‌ర్షణ ప‌‌థ‌‌కాలకు అప్పులు చేస్తే ఆర్థిక స‌‌మస్యలు వ‌‌స్తాయి.  ప్రభుత్వాలు ప‌‌థ‌‌కాల పేరిట ఖ‌‌ర్చులు త‌‌గ్గించి నాణ్యమైన విద్య, ఆరోగ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్పాద‌‌క రంగం పైన ఖర్చు చేస్తే.. ఉపాధి అవకాశాలు పెరిగి పేద‌‌ల‌‌కు మేలు జ‌‌రుగుతుంది. ఎన్నిక‌‌ల్లో గెలుపు కోసం  విచ‌‌క్షణార‌‌హితంగా ఉచితాలు ప్రకటించడం, ఉద్యోగ‌‌స్తుల జీత‌‌భ‌‌త్యాలు పెద్ద ఎత్తున పెంచ‌‌టం, మ‌‌ద్యం అమ్మకాల‌‌తో ఆదాయాన్ని స‌‌మ‌‌కూర్చుకోవ‌‌డం ఎన్నటికైనా ముప్పే.