బుర్రలో ఐరన్ చేరితే బుద్ధి మందగిస్తది!

ఏది, ఎక్కడ, ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనిషి బతికినంత కాలం హాయిగా గడిపేస్తాడు. కానీ మన శరీరంలో పోషకాలు, మినరల్స్, ప్రొటీన్స్, విటమిన్స్‌‌ ఏవి తేడా వచ్చినా రోగాల బారినపడుతాం. మినరల్స్‌‌ లాంటి వాటి అవసరం ఎక్కడ ఉందో అక్కడ కాకుండా, మరో చోట పేరుకుపోతే జీవితమే తలకిందులైపోతుంది. శరీరంలో చాలా వ్యవస్థలు చక్కగా పని చేయడంలో కీలక పాత్ర పోషించే ఐరన్, కాపర్‌‌‌‌ లాంటి మినరల్స్‌‌ బ్రెయిన్‌‌లో ఎక్కువగా చేరితే బుద్ధి మందగించి, క్రమంగా అల్జీమర్స్‌‌కు దారి తీస్తుంది. దీంతో ఏదీ గుర్తుండదు, రోజు వారీ పనులు కూడా సొంతంగా చేసుకోలేరు. మరొకరిపై ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఈ స్థితికి కారణంపై యూకే శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో అల్జీమర్స్‌‌ పేషెంట్స్‌‌ బ్రెయిన్‌‌ సెల్స్‌‌లో కాపర్‌‌‌‌, ఐరన్‌‌ ఎక్కువగా పేరుకుపోయి ఉన్నట్లు గుర్తించారు.

రక్త కణాల ఉత్పత్తిలో కీలకం

మనిషి శరీరంలో సక్రమమైన ఎదుగుదలకు, అన్ని జీవ క్రియలు సరిగా జరగడానికి ఐరన్, కాపర్‌‌‌‌ లాంటి మినరల్స్‌‌ తప్పనిసరి. రక్తం ఉత్పత్తి అవ్వాలంటే ఐరన్‌‌ అవసరం. మన శరీరంలో ఉండే మొత్తం ఐరన్‌‌లో 70 శాతం పైగా ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. బ్లడ్‌‌లో ఉండే ఐరన్‌‌ హిమోగ్లోబిన్‌‌లో భాగంగా అన్ని శరీర భాగాలకూ అందుతుంది. కండరాలు బలంగా ఉండడానికీ ఐరన్‌‌ అవసరం. మజిల్స్‌‌లో ఉండే ఈ ఐరన్‌‌ను మయోగ్లోబిన్‌‌ అంటారు. ఇక కాపర్‌‌‌‌.. నరాలు, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడంలో దీనిది మేజర్‌‌‌‌ రోల్‌‌. లివర్, హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, బోన్‌‌ మజిల్‌‌లోనూ కాపర్ ఉండి, అవి బలంగా ఉండడంలో సాయపడుతుంది. ఈ మినరల్స్ శరీరానికి సరిపడే స్థాయిలో అందకపోతే శరీర క్రియలు దెబ్బతింటాయి. అనేక రకాల జబ్బులు ముప్పేట దాడి చేస్తాయి.

ఎంత ఉంటాయి?

శరీరంలో మొత్తంగా ఉండే కాపర్‌‌‌‌, ఐరన్‌‌ మోతాదు చాలా తక్కువే. సగటున ఒక మనిషి శరీరంలో సుమారు 50–120 మిల్లీ గ్రాముల కాపర్, 3 – 4 గ్రాముల ఐరన్ ఉంటాయి అంతే. ఇంకోలా చెప్పాలంటే ఒక చిన్న మేకు అంత ఐరన్, సన్నటి చెవి పోగు అంతటి కాపర్ ఉంటే మన శరీరం మొత్తం అవసరాలను తీరుస్తాయి. కానీ ఇవి లోపిస్తే రక్త హీనత మొదలు, కీలకమైన అవయవాలు, కండరాలు బలహీనం కావడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి.

ఎలా పేరుకుపోతోంది?

బ్రెయిన్‌‌కు ఆక్సిజన్‌‌ అందించాలంటే రక్తంలో ఐరన్‌‌ ఉండాల్సిందే. ఇలా రక్తకణాల్లో ఉండే ఐరన్‌‌ వల్లే అన్ని అవయవాలు వాటి పనులు చేస్తున్నాయి. అయితే హిమోగ్లోబిన్‌‌ ద్వారా బ్రెయిన్‌‌కు చేరే ఐరన్‌‌.. కొన్నిసార్లు అక్కడ దాని రూపాన్ని మార్చుకుని బయోకెమికల్స్‌‌తో కలిసి రియాక్షన్స్‌‌కు కారణమవుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు. దీని వల్లే బ్రెయిన్‌‌ సెల్స్‌‌ నాశనమవుతాయన్నారు. అలా ఎక్కువ స్థాయిలో ఐరన్‌‌ దాని రూపాన్ని మార్చుకుని రియాక్షన్స్‌‌ జరిగితే న్యూరో డీజనరేటివ్‌‌ డిజార్డర్స్‌‌ వస్తాయని తెలిపారు. అలాగే కాపర్‌‌‌‌ కూడా దాని రూపాన్ని బ్రెయిన్‌‌లో ఆల్టర్‌‌‌‌ చేసుకోవడం వల్ల సెల్స్‌‌ దెబ్బతింటాయని చెప్పారు. ఇలా బ్రెయిన్‌‌లో ఐరన్, కాపర్‌‌‌‌ ఎక్కువ మోతాదులో చేరి, పేరుకునిపోతే మొదట్లో మతిమరపు, ఏకాగ్రత తగ్గడం లాంటి మొదలై, తీవ్ర స్థాయి చేరితే అల్జీమర్స్‌‌ బారినపడతారని అన్నారు. ఎక్స్‌‌రే మైక్రోస్కోపీ స్టడీలో కొందరి బ్రెయిన్‌‌లో గుబురుగా ఐరన్‌‌, కాపర్ చేరి ఉండడాన్ని గుర్తించామని తెలిపారు. ఎలిమెంట్‌‌ ఫామ్‌‌లో ఉండే ఈ మినరల్స్‌‌ బయోకెమికల్ రియాక్షన్స్‌‌ వల్ల చిన్న చిన్న గుబ్బలుగా బ్రెయిన్‌‌లో చేరాయన్నారు. అయితే బ్రెయిన్ సెల్స్‌‌ను నాశనం చేసి, ఈ మినరల్స్‌‌ పేరుకున్న సైజు మిల్లీమీటర్‌‌‌‌లో వందో వంతు మాత్రమేనని, మన ఆలోచనా శక్తిని తినేయడానికి ఇది చాలని చెప్పారు. ఈ ఐరన్‌‌ మ్యాగ్నెటిక్‌‌ మినరల్ రూపంలో చేరుతుందన్నారు. ఈ స్టడీకి సంబంధించిన వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్‌‌’లో పబ్లిష్‌‌ చేశారు.

అల్జీమర్స్‌‌ పేషెంట్ల బ్రెయిన్ ఎక్స్‌‌రే మైక్రోస్కోపీ

అల్జీమర్స్ పేషెంట్ల బ్రెయిన్‌‌లో జరిగే మార్పులపై యూకేలోని కీలే యూనివర్సిటీ పరిశోధకులు రీసెర్చ్‌‌ చేశారు. వారి బ్రెయిన్‌‌లోని భాగాలను ఎక్స్‌‌రే మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించారు. అల్జీమర్స్‌‌ బారినపడి మరణించిన వారి బ్రెయిన్‌‌ను డిసెక్ట్‌‌ చేసి కూడా స్టడీ చేశారు. మెదడులోని టిష్యూలో ఐరన్, కాపర్‌‌‌‌ చేరి, డెండ్రైట్ కణాలను బ్రేక్‌‌ చేసినట్లు గుర్తించారు. దీని వల్ల బ్రెయిన్‌‌ సెల్స్‌‌ మరణించాయని, అది డెమెన్షియా, అల్జీమర్స్‌‌కు దారి తీయడానికి ప్రధాన కారణంగా సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఎటువంటి థెరపీలతో దీనికి చెక్‌‌ పెట్టొచ్చన్న దానిపై తమ పరిశోధనలు కొనసాగుతాయని సైంటిస్టులు తెలిపారు.