
- స్పెషల్ డ్రైవ్లో 8,718 లీటర్ల .. నాటుసారా సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాటుసారా స్పెషల్ డ్రైవ్ లో 1,771 కేసులు నమోదు చేసి.. 1,720 మంది నిందితులను అరెస్టు చేశామని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల 23 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జనవరి16 నుంచి ఈ నెల 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 8,718 లీటర్ల నాటుసారా, 21,148 కిలోల బెల్లం, 2,612 కిలోల అల్లం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 1,10,660 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని, 295 వాహనాలను స్వాధీనం చేసుకొని రూ.14.99 లక్షల జరిమానా విధించామని చెప్పారు.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి.. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, తెలకపల్లి, కల్వకుర్తి.. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట్, వర్ధన్నపేట.. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్, గూడేరు.. భూపాల పల్లి జిల్లాలోని ములుగు, కాటారం, భూపాల పల్లి.. నల్గొండ జిల్లాలోని దేవరకొండ.. కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, మహబూబ్‌నగర్.. పెద్దపల్లిలో జిల్లాలోని సుల్తానాబాద్.. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, నిర్మల్‌ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా దాడులు నిర్వహించామని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు.