
- పక్క రాష్ట్రం నుంచి తెలంగాణలోకి రాకుండా చర్యలు
- శాఖ డైరెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖి ఆదేశాలతో ముమ్మర తనిఖీలు
- నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ముందస్తు చర్యలు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో అక్కడి మద్యం ఇటు రాకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపడుతోంది. ఆ శాఖ డైరెక్టర్ ముషారఫ్ఆలీ ఫారూఖి నిర్మల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. సదరు ఆఫీసర్ ఇక్కడ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం, ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. జిల్లాలోకి వచ్చే ప్రతి వెహికిల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గతంలో దేశీదారు ఏరులై పారగా.. ఎక్సైజ్ శాఖ తీసుకుంటున్న చర్యలతో కొద్ది నెలలుగా అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. అయితే, తెలంగాణలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో కొందరు ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. దేశీదారు కాకుండా లిక్కర్ బాటిళ్లను తీసుకొచ్చి అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఫలితంగా నిర్మల్‌జిల్లాలో మద్యం విక్రయాలు తగ్గిపోతుండడాన్ని గుర్తించిన ఆ శాఖ రంగంలోకి దిగింది.
నిత్యం తనిఖీలు
జిల్లాలోని బాసర, ముథోల్, తానూర్, కుభీర్, కుంటాల, సారంగపూర్ మండలాలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు సరిహద్దులో ఉన్నాయి. కాగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టి నిత్యంతనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే తానూర్ మండలం బెల్తరోడ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు, కుభీర్ మండలం సిర్పెల్లి వద్ద, సారంగపూర్ మండలం స్వర్ణ వద్ద చెక్‌పోస్టులు పెట్టి పోలీసు శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు కొద్ది రోజులుగా ఈ తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 14 రూట్లుగా విభజించి ఒక్కో టీంలో ఇద్దరు, ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఆ రాష్ట్రంలోని వైన్సుల్లో నుంచి మద్యం తీసుకువచ్చేవారిపై నిఘా పెట్టి తెలంగాణలోకి ఎంట్రీ కాగానే పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎలక్షన్ ముగిసేంతవరకు..
రాష్ట్రంలో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పలు రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం పంపిణీ చేస్తుంటారు. అయితే, ఎన్నికల కోడ్ టైంలో సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చే వీలుండదు. దీంతో అక్రమార్కులు ఇప్పటి నుంచే మద్యాన్ని డంప్ చేసుకునే అవకాశముందని గుర్తించిన ఎక్సైజ్‌శాఖ ముందస్తుగానే తనిఖీలు చేపట్టిన్నట్లు తెలుస్తోంది. సరిహద్దు చెక్‌పోస్టులే కాకుండా గ్రామాల్లోనూ అధికారులు నిఘా పెట్టారు. కొన్ని చోట్ల అకస్మాతుగా తనిఖీలు చేస్తున్నారు. ఫలితంగా ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే పలువురిపై కేసులు నమోదయ్యాయి. డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారుల నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉండటంతో కింది స్థాయి అధికారులు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
క్రిమినల్ కేసులే
మహారాష్ట్ర నుంచి మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాం. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వెహికల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నాం. అక్రమంగా మద్యాన్ని తరలిస్తే క్రిమినల్కేసులు నమోదు చేస్తాం.
శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్‌కమిషనర్, నిర్మల్ ఫొటోరైటప్