ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ పోలీసులతో స్పెషల్ ఫోర్స్
రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్లు గుర్తింపు
మెరుపుదాడులతో గ్రామాలను జల్లెడపడుతున్న టీమ్స్
గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఆగస్టు 31 డెడ్‌లైన్
నల్గొండ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా ఆనవాళ్లు లేకుండా నిర్మూలించేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ‘ఆపరేషన్ గుడుంబా’ కార్యక్రమాన్ని చేపట్టింది. 90 రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా నాటుసారా జాడలు కనిపించకుండా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 26 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జోరుగా నాటుసారా తయారీ జరుగుతున్నట్టు ఎక్సైజ్ ఆఫీసర్లు గుర్తించారు. గుడుంబాతో ప్ర జల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, లిక్కర్ సేల్స్ పైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో, గిరిజన తండాల్లో కుటీర పరిశ్రమగా మారిన గుడుంబా తయారీ మళ్లీ ఊపిరి పోసుకుంది.
రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, భద్రా ద్రి కొత్తగూడెం నుంచి మొదలైతే నిర్మల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా వరకు గుడుంబా తయారీ విస్తరించింది. గతంలో ఏపీలోని చిత్తూరు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి నల్లబెల్లం వచ్చేది. ప్రస్తుతం దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు తెలంగా ణ సరిహద్దు ప్రాంతం బీదర్ నుంచి నల్లబెల్లం అక్రమంగా రవాణా జరుగుతోంది. ఇప్పటికీ నల్లబెల్లం మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలోనే ఉండడంతో బెల్లం పైన కేసులు పెట్టినా కోర్టుల్లో నెగ్గడం లేదు.
ఎక్సైజ్ ఆఫీసర్లు వేల లీటర్లలో బెల్లం పానకాన్ని ధ్వంసం చేస్తున్నప్పటికీ కేసుల్లో బెల్లం అక్రమ రవాణా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో బెల్లం రా ష్ట్రంలోకి ప్రవేశించకుండా బోర్డర్ చెక్‌పోస్టుల వద్దే పట్టుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు చెక్‌పోస్టులు ఎత్తేయడంతో బెల్లం రవాణా సులువుగా మారింది. మొన్నటి వరకు మార్కెట్లో దొరికే తెల్ల బెల్లాన్ని వినియోగించిన వాళ్లు ఇప్పుడు మళ్లీ పాత పద్ధతుల్లో నల్లబెల్లాన్ని వాడడం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సవాల్‌గా మారింది.
గ్రామాలను జల్లెడపడుతున్న స్పెషల్ టీమ్స్..
ఆగస్టు 31 నాటికి గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చేందుకు డిపార్ట్మెంట్లోని అన్ని విభాగాలు కలిసికట్టుగా రంగంలోకి దిగాయి. ఈఎస్ టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ ఆఫీసర్లు కలిసి మూడు టీమ్స్‌గా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 700 గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ మెరుపుదాడులు చేస్తున్నాయి. ఈ నెల 1 నుంచి మొదలైన ఆపరేషన్ ఆగస్టు 31 నాటికి ముగుస్తుంది.
ప్రతి రోజు ఉదయం నుంచి సాయం త్రం వరకు స్పెషల్ టీమ్స్ గ్రామాలు, తండాలు, ఆవాస ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. అనుమానితులను బైండోవర్ చేస్తున్నారు. నాటుసారా తయారీపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సారా తయారీదారులపైన కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.లక్ష జరిమానా, ప్రత్యేక కేసుల్లో పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నారు. గతంలో నల్లబెల్లం, సారా తయారీలో ఆరితేరిన వాళ్లపై నిఘా పెట్టారు. రాత్రి వేళల్లో గుట్టుగా గ్రామాల నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు కోవర్ట్ టీమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో సివిల్ పోలీసులు సైతం కీ రోల్ పోషిస్తున్నారు.
అక్రమంగా సారా రవాణా..
గత ఐదు నెలల్లో నమోదైన కేసులతో పోలిస్తే ఈ 12 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా కేసులు భారీగా నమోదయ్యాయి. ఒక్క నల్గొండ జిల్లా దేవరకొం డలోనే 64 కేసులు పెట్టడం గమనార్హం. అయితే మెరుపు దాడులతో అప్రమత్తమైన సారా తయారీదారులు అక్రమ రవాణా ఆపేశారు. గతంలో బైక్‌లు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో వేర్వేరు ప్రాంతాలకు అక్రమంగా సారా రవాణా జరిగేది. కా నీ ఇప్పుడు అక్రమ రవాణా తగ్గింది. దాడులు, బెల్లం పానకం, సారా ధ్వంసం చేస్తున్న ఘటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో పదుల సంఖ్యలో వెహికల్స్ పట్టుబడగా, ఇప్పుడు ఒకటి, రెండుకు మించి దొరకడం లేదు. దీన్నిబట్టి చూస్తే అక్రమ రవాణా తగ్గుముఖం పట్టిందని ఆఫీసర్లు చెబుతున్నారు.
బ్లాక్ స్పాట్‌గా గుర్తింపు..
విచ్చలవిడిగా గుడుంబా తయారీ జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌గా గు ర్తించారు. 26 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని 700 గ్రామాల్లో ప్రస్తుతం ఆపరేషన్ నడుస్తోంది. మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూర్, నిర్మల్, ములుగు, కాగజ్ నగర్, భద్రాచలం, సుల్తానాబాద్, కాటారం, గూడూరు, చెన్నూరు, వర్ధన్నపేట, భూపాలపల్లి, హుజూర్నగర్, దేవరకొండ, వనపర్తి, లక్షెటిపేట్, ధర్మపురి, మహబూబ్‌నగర్, బెల్లంపల్లి, కొత్తకోట, కల్వకుర్తి, పరకాల, జడ్చర్లలోని గ్రామాల్లో ఆగస్టు 31 నాటికి గుడుంబా రహితంగా మార్చాలన్నదే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటున్నం..
గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నం. బెల్లం సరఫరా చేస్తే కేసులు నమోదు చేస్తున్నం. అనుమానితులను బైండోవర్ చేస్తున్నం. రూ. లక్ష జరిమానాతో పాటు మళ్లీ అదే పొరపాటు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మూడు స్పెషల్ టీమ్స్‌తో గ్రామాలను జల్లెడపడుతున్నాం. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, మునుగోడు నియోజకవర్గాల్లో దాడులు చేస్తున్నాం.
-బి సంతోష్,
ఎక్సైజ్ సూపరింటెండెంట్, నల్గొండ