కేటీఆర్ బామ్మర్దుల ఇండ్లలో ఎక్సైజ్​ఎన్​ఫోర్స్మెంట్ సోదాలు

కేటీఆర్ బామ్మర్దుల ఇండ్లలో ఎక్సైజ్​ఎన్​ఫోర్స్మెంట్ సోదాలు
  • లీగల్​సెల్ అడ్వకేట్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రాజ్​పాకాల, శైలేంద్ర నివాసాల్లో సెర్చ్​
  • దాదాపు 49 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం!
  • అధికారులను, పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నాయకులు 
  • రాయదుర్గం ఓరియన్​ విల్లాస్​ వద్ద ఉద్రిక్తత
  • అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పీఎస్​కు తరలింపు

గచ్చిబౌలి, వెలుగు:రాయదుర్గం దివ్యశ్రీ ఓరియన్​విల్లాలోని రాజ్​పాకాల ఇంట్లో ఎక్సైజ్​ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు, సైబరాబాద్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేశారు.  రాజ్​పాకాల విల్లా నంబర్​40లో ఉంటుండగా, ఇతడి సోదరుడు శైలేంద్ర విల్లా నెంబర్​5లో ఉంటున్నారు. కాగా, రాజ్​పాకాల ఇంటికి తాళం వేసి ఉండడంతో మొదట బీఆర్ఎస్​ లీగల్​సెల్​అడ్వకేట్లు, న్యాయవాదుల సమక్షంలో శైలేంద్రకు చెందిన విల్లా నంబర్​5లో ఎక్సైజ్​ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు సోదాలు నిర్వహించారు.

అనంతరం  విల్లా నెంబర్​40 వద్దకు చేరుకున్న అధికారులు.. రాజ్​పాకాల అందుబాటులోకి రాకపోవడంతో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి, సోదాలు చేశారు. ఎక్సైజ్​జాయింట్​కమిషనర్​ ఖురేషి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో విల్లా నెంబర్​ 5,40,43 నుంచి భారీగా విదేశీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

అనుమతికి మించి విదేశీ మద్యం: ఎక్సైజ్ ​డిప్యూటీ కమిషనర్ 

సోదాల సందర్భంగా ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ దశరథ్​ మీడియాతో మట్లాడారు. రాజ్​ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర, మరో బంధువుకు చెందిన విల్లాల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. ఈ సోదాల్లో అనుమతికి మించి విదేశీ మద్యం, బాటిళ్లను గుర్తించినట్టు తెలిపారు. రాజ్​ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర విల్లాస్​లో, విల్లా నెంబర్​ 43లో రాజ్​ పాకాల బంధువు ఇంట్లో ఇంకా సోదాలు ముగిశాయని పేర్కొన్నారు.  ఎక్సైజ్​ శాఖ అధికారుల సోదాల్లో మూడు విల్లాల నుంచి దాదాపు 49 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది.  స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను అధికారులు పోలీస్​ వాహనాల్లో తరలించారు.  

ఓరియన్​ విల్లాస్ వద్ద ఉద్రిక్తత 

కేటీఆర్​బామ్మర్దికి చెందిన విల్లాలో అధికారులు సోదా లు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు  సంజయ్, కేపీ వివేకానంద, గోపీనాథ్, ఎమ్మెల్సీ  రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్​ లీడర్లు,  కార్యకర్తలు ఓరియన్​ విల్లాస్​కు చేరుకున్నారు. ఎలాంటి వారెంట్​ లేకుండా సోదాలు చేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం  కక్ష సాధిస్తున్నదని అందోళన చేపట్టారు. వాహనాలకు అడ్డం కూర్చున్నారు.

దీంతో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు  వివేకానంద, గోపీ నాథ్​, సంజయ్​, ఎమ్మెల్సీ  రాజు, మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లను సైబరాబాద్​పోలీసులు  అరెస్ట్​ చేసి,   గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అరెస్ట్​ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్​రెడ్డి, ముఠా గోపాల్​ ఓరియన్​ విల్లాస్​వద్దకు చేరుకొని, లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వీరిని సైతం అరెస్ట్​ చేసి అక్కడి నుంచి తరలించారు.  

అనంతరం బీఆర్ఎస్​లీడర్​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ కూడా​ఓరియన్​ విల్లాస్​వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పాలన నడుస్తున్నదని, జన్వాడ ఫామ్​హౌజ్​లో కుటుంబసభ్యులతో పార్టీ చేసుకుంటే ‘రేవ్​ పార్టీ’ అంటూ ప్రచారం చేస్తారా?  అని మండిపడ్డారు.