- యథేచ్ఛగా కల్లు దుకాణాలు
- గుడులకు చందాలిచ్చి గ్రామాలు గుత్తకు
- పట్టించుకోని ఎక్సైజ్ ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటు సారాను నియంత్రించేందుకు ఎక్సైజ్ ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కర్నాటక, ఏపీల నుంచి తెలంగాణలోకి వస్తున్న ముడి సరుకును అంతర్రాష్ట్ర బార్డర్ల వద్ద నిఘా ఉంచి ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. కానీ, ఏండ్లుగా ప్రజలను పీడిస్తున్న కల్తీ కల్లును కంట్రోల్ చేయడం లేదు. యథేచ్ఛగా మందు కల్లు విక్రయిస్తున్నా.. సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు.
డ్రగ్స్ కన్నా దారుణం..
ఉమ్మడి జిల్లాలోని వనపర్తిలో 225, నారాయణపేటలో 275, గద్వాలలో 143, మహబూబ్‌నగర్‌లో 239, నాగర్‌కర్నూల్‌లో 200కు పైగానే కల్లు కాంపౌండ్లు ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారింగా 500కు పైగానే షాపులు ఉన్నాయి. అయితే ఈదులు లేకున్నా, తాళ్లు గీయకున్నా.. కల్తీకల్లు ఏరులై పారుతోంది. కల్లు చుక్క లేకుండా కెమికల్‌తో కలిపిన కల్తీ కల్లు తయారు చేసి జోరుగా అమ్ముతున్నారు. ఈ కల్లుకు అలవాటు పడిన వారి ఆరోగ్యం క్షీణిస్తుండగా.. డ్రగ్స్ కన్నా దారుణంగా వారిని పట్టిపీడిస్తోంది.
ఒక్క రోజు మందు కల్లు తాగకుంటే పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తున్నారు. గత నెల జడ్చర్లలో ఓ మహిళ ఫుల్లుగా కల్లు తాగి.. ఆ మైకంలో నెలల శిశువునే చంపబోయింది. కల్లు తాగాలనే పిచ్చిలో కొందరు డబ్బుల కోసం సొంత కుటుంబసభ్యులపైనే దాడులకు దిగుతున్నారు. అంతలా కల్తీకల్లు వారిపై ప్రభావం చూపుతోంది.
మొదట్లో దాడులు చేసి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే నెలలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) కల్తీ కల్లును అరికట్టడానికి రంగంలోకి దిగింది. కల్తీ కల్లు ఇష్యూస్ ఉన్న జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. కల్తీ కల్లు ఘటనలు, తాగి చనిపోయిన వారి డేటా సేకరించి కల్తీ కల్లు తయారీకి వాడే అల్ర్ఫాజోలం లింక్ చైన్‌ను ట్రేస్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. తర్వాత కొద్ది రోజులకే దాడులు ఆగిపోయాయి.
ఎక్సైజ్ ఆఫీసర్లు లైసెన్స్ లేకుండా దుకాణాలు నడిపిస్తున్న వారిలో కొందరిపై గత డిసెంబర్లో కేసులు పెట్టారు. ఆ తర్వాత ఊరుకున్నారు. అప్పటి నుంచి ఎక్కడా దాడులు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అన్ని మండలాల్లో వ్యాపారులు ఊళ్లను గుత్తకు పట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో ఉండే ఆలయాలకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు చెల్లించి, ఆ ఊళ్లల్లో కల్తీ కల్లును విక్రయిస్తున్నారు.
కృత్రిమ కల్లు తయారీ ఇలా..
కృత్రిమ కల్లు తయారు చేయడానికి వ్యాపారులు హానికర కెమికల్స్‌ను వాడుతున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కొద్దిపాటి కల్లును పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పోసి బోర్ వాటర్‌ను నింపి.. పులుపు కోసం నిమ్మ ఉప్పు, వైట్ కలర్ కోసం సిల్వర్(వైట్), స్వీట్నెస్ కోసం శాక్రిన్, నురుగు కోసం డ్రైఈస్ట్, కుంకుడుకాయల పేస్ట్‌ను కలుపుతున్నారు. నిషా కోసం ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్లలో ఏదో ఒకటి వాడుతున్నారు.
కర్నాటక నుంచి దిగుమతి..
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి మీడియేటర్లద్వారా మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు కల్లు వ్యాపారులు పెద్ద మొత్తంలో ఆల్ప్రాజోలం, క్రోరల్ హైడ్రేట్ (సీహెచ్)ను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. రాయచూర్ ప్రాంతం నుంచి ఇది రవాణా అవుతుందని సమాచారం. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ ఉన్నా.. అక్కడ నామమాత్రంగా తనిఖీలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. దీంతో కల్తీ కల్లు కోసం వినియోగించే పదార్థాలు పాలమూరుకు చేరుకున్నాక.. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఏరియాలకు ఏజెంట్ల ద్వారా సప్లై జరుగుతుందని సమాచారం.