- ఐదు పబ్బులపై రైడ్స్
- మైనర్‌తో పాటు, మరో ముగ్గురు డ్రగ్స్ వాడినట్టు గుర్తింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎక్సైజ్, టీజీ న్యాబ్, స్టేట్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐదు పబ్బులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన నలుగురిని గుర్తించారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ మహమ్మద్ ఖురేషి పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని నికోస్, బేబిలాన్, ఇల్యూజన్పబ్, మాదాపూర్ లోని విస్కీ పబ్, నాలెడ్జ్ సిటీలోని కోరంక్లబ్లతో ఏకకాలంలో దాడులు నిర్వహించగా, బేబీలాన్ పబ్‌లో ఇద్దరికి, కోరమ్పబ్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన ఒకరు, శ్రీకాకుళానికి చెందిన మరొకరు ఉండగా, మూసాపేట, చార్మినార్ కు చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇదే పబ్బులో డీజే నిర్వాహకుడు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. తనిఖీల్లో జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్, అనిల్ కుమార్ రెడ్డిలతో అడిషనల్ ఎస్పీ భాస్కర్ , డీఎస్పీ తిరుపతి యాదవ్ తో పాటు టీజీ న్యాబ్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.