- ఈసీ చర్యలతో రంగంలోకి ఎక్సైజ్ ఆఫీసర్లు
- ఊరూరా బెల్టుషాపులపై ఉక్కుపాదం
- కేసుల నమోదుతో 90 శాతం బెల్టుషాపులు, సిట్టింగులు బంద్
- సేల్స్ టార్గెట్‌ను కూడా 30 శాతం తగ్గించిన ఆబ్కారీ శాఖ
- పదిరోజుల్లో పడిపోయిన సేల్స్
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యానికి ఈసీ చర్యలతో అడ్డుకట్ట పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూలింగ్పార్టీకి తెరవెనుక సహరిస్తున్నారనే అనుమానమున్న 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల పై ఈ నెల 10న ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే! దీనికితోడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా మారుతుండడంతో అలర్టయిన ఆఫీసర్లు ఈసారి ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా పెద్దమొత్తంలో నగదు పట్టుకుంటుండగా, జిల్లాల్లో ఆబ్కారీ ఆఫీసర్లు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ బెల్టుషాపు కనపడితే అక్కడ సీజ్ చేసి, కేసులు రాస్తున్నారు. గతంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక గానీ లిక్కర్జోలికి వచ్చేవారు కాదు. కానీ, ఈసారి ఈసీ సీరియస్‌గా నెల రోజుల ముందుగానే రాష్ట్రంలో లిక్కర్అమ్మకాలపై ఆంక్షలు విధిస్తుండడంతో సేల్స్ పడిపోతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్తున్న బెల్టుషాపులు..
ఈనెల 10 నుంచి రాష్ట్రంలో లిక్కర్ సేల్స్‌పై ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో గల్లీ గల్లీ తిరుగుతూ బెల్టుషాపులు మూయిస్తున్నారు. తిరిగి తెరిస్తే కేసులు బుక్ చేస్తున్నారు. ఆఫీసర్ల దాడులు, హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా 90శాతం దాకా బెల్టుషాపులు, అక్రమ సిట్టింగ్‌లు బందయినట్లు ఆబ్కారోళ్లు చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల నిబంధనల మేరకు డిపోల్లో లిక్కర్ సేల్స్‌ను కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో సాధారణంగా ప్రతినెలా గతేడాది కన్నా 50 శాతం ఎక్కువ స్టాక్ అమ్ముకునేందుకు ఆబ్కారోళ్లు పర్మిషన్ ఇస్తారు. ఎన్నికల టైంలో రాజకీయ పలుకుబడితో కొన్ని చోట్ల కోటాను మించి 70,80 శాతం దాకా సేల్స్ జరిగినా ఎక్సైజ్ వాళ్లు చూసీచూడనట్లు ఉండేవారు. కానీ, ఈసారి ఈసీ ఆదేశాలతో నెల రోజుల ముందు నుంచే డిపోలపై నిఘా పెట్టారు. 50 శాతం అదనపు కోటాను 30 శాతానికి తగ్గించారు. అంతకుమించి అదనంగా ఒక్క చుక్క మద్యానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. అదీగాక డిపోల్లో స్టాక్గురించి, సేల్స్ గురించి ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్‌కు రిపోర్ట్ పంపుతున్నారు. రూల్స్ ప్రకారం ఎవరూ ఆరు ఫుల్ బాటిల్స్, ఒక కాటన్ బీర్లుకు మించి వెంట తీసుకెళ్లకూడదు. మోతాదుకు మించి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేస్తే చెక్‌పోస్టుల వద్ద సీజ్ చేస్తున్నారు. వైన్సుల్లో కస్టమర్లకు బిల్లులు ఇవ్వకపోడంతో సీజ్ చేసిన లిక్కర్‌ను విడిపించుకోవడం కష్టమవుతోంది. దీని వల్ల కూడా లిక్కర్సేల్స్పై ఎఫెక్ట్పడుతోంది.
భారీగా పడిపోయిన సేల్స్..
ఈసీ, ఆబ్కారీ శాఖ చర్యలతో లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయి. గతేడాది అక్టోబర్ 9 నుంచి 19 తేదీ వరకు 19.40 లక్షల పెట్టెల లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి. ఈసారి 50 శాతం ఎక్సెస్ సేల్స్ కలుపుకొని వ్యాపారులకు 29.10 లక్షల కాటన్ల వరకు టార్గెట్ పెట్టారు. ఈసీ చర్యలతో ఆఫీసర్లే టార్గెట్ ను 30 శాతానికి తగ్గించారు. దీంతో ఈ పదిరోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో సేల్స్ 26 లక్షల కాటన్ల వద్దే ఆగిపోయాయి. బెల్ట్‌షాపులు మూతపడడంతో రోజుకు రూ.5లక్షల అమ్మకాలు జరిగే షాపుల్లో రూ. 2 లక్షలకు మించి సేల్స్ జరగట్లేదని ఆఫీసర్లు చెపుతున్నారు.