నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో కల్తీ కల్లు తాగి ఇద్దరు చనిపోయిన ఘటనపై ఎక్సైజ్ ఆఫీసర్లు స్పందించారు. వరంగల్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్‌రావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ప్రవీణ్, తొర్రూరు సీఐ సంజీవ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. పార్టీకి హాజరై కల్లు తాగిన వారిపై ముగ్గురు అస్వస్థతకు గురికావడం, అందులో ఇందులో ఇద్దరు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే యువకులకు కల్లు ఎవరు పోశారు ? వారి వద్ద ఇంకా ఎవరెవరు తాగారు ? అందులో కెమికల్స్ ఏమైనా కలిశాయా ? పార్టీ అయిపోయిన తర్వాత ముగ్గురు యువకులు ఇంకా ఎక్కడైనా కల్లు తాగారా ? అని ఆరా తీశారు.
అలాగే పార్టీలో తీసుకున్న ఆహార పదార్థాల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను కలిసి యువకుల వివరాలు తెలుసుకున్నారు. తర్వాత యువకులు కల్లు తాగిన ప్రదేశానికి అక్కడ ఉన్న గీత కార్మికులతో మాట్లాడారు. అలాగే గ్రామంలోని గీత కార్మికులందరి వద్ద కల్లు శాంపిల్స్ సేకరించాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. వారి వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నాగయ్య, ఎస్సై రజిత, ఎక్సైజ్ ఎస్సై తిరుపతి, స్థానిక ఎస్సై సతీశ్ ఉన్నారు.