- శనివారంతో ముగిసిన లైసెన్స్ గడువు
- గతంలో లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న టానిక్ నిర్వాహకులు
- నిబంధనలు పాటించకపోవడంతో తిరస్కరణ
- రూ.1.70 కోట్ల 10,291 మద్యం బాటిల్స్ సీజ్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని టానిక్ ఎలైట్ వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. రోడ్ నంబర్ 36లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుండడమే కాకుండా లైసెన్స్‌లు కూడా రెన్యువల్ చేసుకోకపోవడంతో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ మాల్‌లో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు వాటాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సిటీలో 11 బ్రాంచీలను ఏర్పాటు చేశారు. ఓ వైపు మద్యం పాలసీకి విరుద్ధంగా అమ్మకాలు చేయడంతో పాటు మరోవైపు కమర్షియల్ ట్యాక్స్ ఎగవేశారు.
ఈ ఏడాది మార్చిలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. రాష్ట్రంలోని లిక్కర్ పాలసీ నిబంధలను పాటించకుండా విదేశీ మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెన్యువల్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయితే, ఆగస్టు 31నాటికి టానిక్ ఎలైట్ షాపుకు అనుమతి ఉంది. సెప్టెంబర్ 1 నుంచి దుకాణం నడపడం చట్టరీత్యా నేరం కావడంతో ఆదివారం సీజ్ చేశారు.
హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ సీఐ వాసుదేవరావు , ఇతర ఎక్సైజ్ పోలీసులు కలిసి నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. టానిక్ ఎలైట్ మాల్‌లో నిల్వ ఉన్న రూ.1.70 కోట్లు విలువ చేసే10,291 మద్యం బాటిళ్లను కూడా మాల్‌నే ఉంచి సీజ్ చేశారు. సంబంధిత ఆర్డర్ కాపీని నిర్వాహకులకు అందించారు.