ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీకి షాక్.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం. ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు అయ్యింది. 2024, ఏప్రిల్ 2వ తేదీ ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆప్ ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ ను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు నెలలుగా ఆయన జైల్లో ఉన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ దగ్గర.. లిక్కర్ స్కాంకు సంబంధించి ఒక్క పైసా కూడా లభించనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారని.. ఎందుకు జైల్లో పెట్టారని ఈడీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

సంజయ్ సింగ్ బెయిల్ పిటీషన్ పై విచారణ చేసిన జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ పీబీ పరేల్ ధర్మాసనం.. ఈడీని ప్రశ్నించింది. ఆయన దగ్గర ఒక్క పైసా దొరకనప్పుడు ఆరు నెలలుగా జైల్లో ఎలా ఉంచారని ఈడీని ప్రశ్నించింది కోర్టు. ఈ క్రమంలోనే బెయిల్ ఇవ్వటానికి అభ్యంతరం లేదని వెల్లడించింది ఈడీ. దీంతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నారు.

ఓ వైపు ఇదే లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లిన 24 గంటల్లోనే ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ కు బెయిల్ రావటం ఆసక్తిగా మారింది. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం తీహార్ జైలులోనే ఉన్నారు. ఓ వైపు అరెస్టు జరుగుతున్న సమయంలోనే.. మరో వైపు ఆప్ లీడర్ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం విశేషం.