తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ, ఆసక్తి కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 5న) సాయంత్రమే ముఖ్యమంత్రి ఎవరు అనే పేరును వెల్లడించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ముఖ్యమంత్రి పేరును ఫైనల్ చేసింది. ఇటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మరోవైపు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ సమావేశం ముగిసింది. ఇవాళ సాయంత్రం డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కతో డీకే శివకుమార్ విడివిడిగా మాట్లాడారు. ఖర్గేతో డీకే శివకుమార్, ఏఐసీసీ అబ్జర్వర్లు సమావేశం అయ్యారు.
అంతకుముందు.. తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీకి రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ వంటి నాయకులు హాజరయ్యారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్‌గాంధీ వెళ్లిపోయారు.
తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కర్ణాటక డిప్యూటీ సీఎం, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్ స్పందించారు. సీఎల్పీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడం వరకే తన బాధ్యత అని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు సీఎల్పీ నేత ఎంపిక ఉంటుందని సోమవారం (డిసెంబర్ 4న) నిర్వహించిన సమావేశంలో తీర్మానించారని తెలిపారు. సీఎల్పీ అభిప్రాయంపై నివేదిక ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం అభ్యర్థి, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.