- భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
- 18 మంది ఉన్నా.. కాంగ్రెస్‌లో అనుమానాలే
- మా ఓట్లు మాకే అంటున్న బీజేపీ
- ఇంకా ఆశలోనే బీఆర్ఎస్ అసమ్మతి వర్గం
- బీజేపీ, కాంగ్రెస్ ఇంటర్నల్పొత్తంటూ ప్రచారం
యాదాద్రి, వెలుగు: భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. మరికొన్ని గంటల్లో చైర్మన్, వైస్చైర్మన్ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. వెంట ఉన్నవారు అనుకూలంగా ఉంటారో..? చివరి నిమిషంలో మారిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు మీటింగ్‌కు కావాల్సిన కోరం సమకూరుతుందా..? లేదా..? అని ఆయా పార్టీ సభ్యులే అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
మొత్తం 35 వార్డులు
భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నికకు కావాల్సిన సంఖ్య బలం ఏ పార్టీకి సమకూరని సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. సొంత కౌన్సిలర్ల అవిశ్వాసం కారణంగా బీఆర్ఎస్ పదవులు కోల్పోవడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది.
బలాబలాలు తారు మారు
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ అసమ్మతి, కాంగ్రెస్ బలబలాలు తారుమారయ్యాయి. అవిశ్వాసం జరిగే నాటికి బీఆర్‌ఎస్ అసమ్మతి వర్గానికి 16 మంది, కాంగ్రెస్‌కు 9 మంది, బీజేపీ 6, బీఆర్ఎస్ అనుకూల వర్గానికి నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు.
ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన వెలువడగానే బీఆర్ఎస్ అసమ్మతి శిబిరం నుంచి 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపారు. దీంతో బీఆర్ఎస్ అసమ్మతి శిబిరంలో 8 మంది మిగలగా.. కాంగ్రెస్ వైపు 17 మంది ఉన్నట్లు లెక్క తేలింది. దీంతో బీఆర్ఎస్ అసమ్మతి శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అజీమ్ తన తరఫున ఉన్న వారిని క్యాంపునకు తరలించారు. కాంగ్రెస్ కూడా తన శిబిరంలోని కౌన్సిలర్లను క్యాంపునకు తీసుకెళ్లింది. బీజేపీకి ఆరు, బీఆర్ఎస్కు నలుగురు కౌన్సిలర్లు అలాగే ఉన్నారు.
18 మంది ఉన్నా అనుమానాలే
ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ శిబిరంలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డితో కలిపి 18 మంది ఉన్నారు. అయితే క్యాంపులో కౌన్సిలర్లు ఉన్నా.. ఎన్నిక సమయానికి పరిస్థితులు తలకిందులు అవుతాయేమోనన్న అనుమానంతో కాంగ్రెస్ మరికొందరితో చర్చలు జరుపున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు తటస్థంగా ఉంటూ బీఆర్ఎస్ అసమ్మతి వర్గంతో చర్చలు జరిపిన బీజేపీ వాటిని మధ్యలోనే ఆపేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అసమ్మతి వర్గాలకు బలం లేదని గమనించిన పార్టీ తాము కూడా చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల కోసం పోటీ పడుతున్నట్టు లీకులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎవరు మద్దతిచ్చినా.. ఇవ్వకున్నా.. తమ ఆరుగురి కౌన్సిలర్ల ఓట్లు తామే వేసుకుంటామని చెప్పుకొస్తోంది.
18 మంది ఉంటేనే మీటింగ్
భువనగిరిలో 35 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఉన్నందున 36 మంది ఓటర్లు ఉన్నట్టు లెక్క. రూల్స్ ప్రకారం 18 మంది కౌన్సిలర్లు హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను చేతులు ఎత్తే పద్ధతిలో నిర్వహిస్తారు. కోరం సమకూరని పక్షంలో సమావేశాన్ని 29వ తేదీకి వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం సమకూరకుంటే నిరవధికంగా వాయిదా వేస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇంటర్నల్ పొత్తు..?
స్థానికంగా కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్‌కు బీజేపీ, వైస్ చైర్మన్ఎన్నికలో బీజేపీకి కాంగ్రెస్ పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రెండు పార్టీలు ధ్రువీకరించడం లేదు. బీఆర్ఎస్అసమ్మతి శిబిరం లీడరైన అజీమ్ మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. అవసరమైతే వైస్ చైర్మన్‌తో సరిపెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా, బీఆర్ఎస్ సమ్మతి వర్గం తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్లు, మీటింగ్‌కు హాజరుకావాలా..? వద్దా..? అనే విషయంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదని కొందరు నేతలు చెప్పారు.