నల్గొండలో కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికపై ఎడతె గని ఉత్కంఠ

  • ఢిల్లీలోనే మకాం పెట్టిన మాజీ మంత్రి దామన్న 
  • తుంగతుర్తికి షిఫ్ట్​అయ్యే ఆలోచనలో కొండేటి మల్లయ్య 
  • మిర్యాలగూడ బీసీలకు కేటాయించే ఛాన్స్​
  • మునుగోడు, సూర్యాపేట టికెట్ల కోసం రేవంత్ ​టీమ్ ​పట్టు

నల్గొండ, వెలుగు ఉమ్మడి జిల్లాలోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికపై ఎడతె గని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్​ సీనియర్లు, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరావడం లేదు. ముఖ్యంగా సూర్యాపేట, తుంగతుర్తి, మునుగోడు, మిర్యాలగూడ సీట్ల విషయం ఎటూ తేలడం లేదు.  సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్​ రెడ్డి, పటేల్​రమేశ్​ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టిన దామన్న హైకమాండ్​ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. పటేల్​ రమేశ్​ రెడ్డి పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డిపై ఒత్తిడి పెంచారు. దామోదర్​రెడ్డి పేరును ఉత్తమ్​ కుమార్​రెడ్డి, జానారెడ్డి ప్రతిపాది స్తుండగా...ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శుక్రవారం నకిరేకల్​లో జరిగిన మాజీ ఎమ్మెల్యే వీరేశం సభలో సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌  రెడ్డి సంగతి రమేశ్‌ రెడ్డి చూసుకుంటాడని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తోంది. రేవంత్​ వర్గానికి చెందిన మరోనేత చల్లమల్ల కృష్ణారెడ్డి మునుగోడు టికెట్​ ఆశిస్తున్నారు. సూర్యాపేట, మునుగోడు స్థానాలను రేవంత్​ వర్గానికి ఇచ్చేందుకు సీనియర్లు ఒప్పుకోవడం లేదని తెలిసింది. అంతేకాదు  దామోదర్​ రెడ్డికి టికెట్​ రాకపోతే దాని పరిణామాలు ఎన్నికల్లో తీవ్రంగానే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

తుంగతుర్తి పోటీలో కొండేటి...

నకిరేకల్‌లో మిస్సైన ఛాన్స్​ను కొండేటి మల్లయ్య తుంగతుర్తిలో ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు సీనియర్ల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. మాదిగ ఓటర్లు బలంగా ఉన్న తుంగతుర్తిలో మల్లయ్య పోటీకి దిగితే ఆయనకు ఎంపీ వెంకటరెడ్డి, దామోదర్​ రెడ్డి, వేముల వీరేశం సపోర్ట్​ కూడా ఉంటుందని తెలుస్తోంది.  శుక్రవారం వీరేశం సభకు రావాలని ఎంపీ కోమటిరెడ్డి మల్లయ్యకు ఫోన్​ చేసి ఆహ్వానించారు. పార్టీ ఆదేశాల మేరకే నకిరేకల్​విషయంలో తన అభిప్రాయా న్ని మార్చుకోవాల్సి వచ్చిందని మల్లయ్యకు వివరించారు. అందుకు బదులుగా తుంగతుర్తి నుంచి పోటీ చేస్తే పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చినట్టు సమాచారం. సూర్యాపేటలో దామన్న టికెట్​ కన్ఫార్మ్‌ అయితే అప్పుడు మల్లయ్యకు తిరుగుండదు. శాలిగౌరారం తన సొంత మండలం కాబట్టి తనవంతు సహకారం అందిస్తానని వీరేశం కూడా చె ప్పినట్టు తెలిసింది. ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, జానారెడ్డి సైతం మల్లయ్య అభ్యర్థిత్వానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. అయితే రేవంత్​ రెడ్డి మాత్రం అద్దంకి దయాకర్​ కోసం పట్టుబడుతున్నట్టు తెలిసింది. కానీ పార్టీ సీనియర్లు దయాకర్​ అభ్యర్థిత్వాన్ని ససేమిరా అంగీకరించట్లేదు.  

మిర్యాలగూడలో తెరపైకి చల్లా తేజ్​..

జానారెడ్డి రెండో కొడుకు జైవీర్​ రెడ్డి నాగార్జునసాగర్​ నుంచి పోటీ చేయడం దాదాపు కన్ఫార్మ్‌ అయినట్టే. పెద్ద కొడుకు రఘువీర్​ మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలనుకున్నప్పటికీ సామాజిక సమీకరణాలు కుదరడం లేదు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో ఆలేరు బీసీలకు కేటాయించినందున నల్గొండ సెగ్మెంట్​లో మిర్యాలగూడ తప్ప మరో ఆప్షన్​ పార్టీకి కనిపించడం లేదు. పైగా బత్తాల లక్ష్మారెడ్డి పట్ల జానారెడ్డి అంత సుముఖంగా లేరని టాక్ నడుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య క్యాండేట్​ ఎంపిక వద్దే వస్తోంది. మిర్యాలగూడలో పార్టీకి బలమైన బీసీ క్యాండేట్​ లేకపోవడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్సీ నేతి వి ద్యాసాగర్​ను బరిలో దింపే ఆలోచన జరుగుతోంది.  ఎమ్మెల్యే టికెట్​ ఇస్తేనే పార్టీలో చేరాలని విద్యాసాగర్​ భావిస్తున్నారు. ఇంకోవైపు పార్టీ హైకమాండ్ కొత్త పేరు తెరపైకి తెచ్చింది. మున్నూరు కాపు సామాజికవర్గాని చెందిన చల్లా తేజ వీర వెంకట సత్యనారాయణ (తేజ్​ నాయుడు) పేరు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్​ తేజ్​ నాయుడు పేరును సిఫార్సు చేసినట్టు సమాచారం.

 నేడు ఢిల్లీలో స్ర్కీనింగ్ కమిటీ భేటీ..

అభ్యర్థులను డిసైడ్ చేసేందుకు ఎన్నికల స్ర్కీనింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలో భేటీ కానుంది. జిల్లా నుంచి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే దామోదర్ రెడ్డి అక్కడ మకాం పెట్టగా, తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్న ప్రీతం కూడా శుక్రవారం వెళ్లినట్టు తెలిసింది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, కొం డేటి మల్లయ్య హైదరాబాద్ కేంద్రంగానే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాలూనాయక్‌కు వ్యతిరేకంగా దేవరకొండలో పేర్లు వినిపిస్తుండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. జానారెడ్డి శిష్యుడైన బాలూ నాయక్ టికెట్ ఢోకా ఉండదని, కొత్తగా వస్తున్న పేర్లు గాంధీ భవన్ నుంచి కావాలనే లీక్ లు ఇస్తున్నారని బాలూ వర్గం ఆరోపిస్తోంది.