ఆ గ్రామాలు కార్పొరేషన్ లోకలిసేనా ?

ఆ గ్రామాలు   కార్పొరేషన్ లోకలిసేనా ?
  • గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కరీంనగర్ గా అప్ గ్రేడేషన్ పై ఉత్కంఠ
  • సిటీలో కలిసిపోయినా జీపీలుగానే బొమ్మకల్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలు
  •  దూరంలో ఉన్న సదాశివపల్లిని కలిపినా.. ఈ గ్రామాలను కలపని గత పాలకులు

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆనుకుని ఉన్న గ్రామపంచాయతీలను కార్పొరేషన్ లో కలపాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. బొమ్మకల్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలు కరీంనగర్ సిటీలో పూర్తిగా కలిసిపోయినప్పటికీ.. ప్రస్తుతం గ్రామపంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆయా పంచాయతీపాలకవర్గాల పదవీకాలంకూడా ముగియడంతో స్పెషలాఫీసర్ల పాలన నడుస్తోంది.

త్వరలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారనే ప్రచారం నేపథ్యంలో.. మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ఉన్న గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా ? లేదంటే కార్పొరేషన్ లో కలిపేస్తారా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

దగ్గర ఉన్నవి వదిలి.. దూరం ఉన్నవి కలిపి..

కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికయ్యాక 2019 జూన్ లో పక్కనే ఉన్న పద్మానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రేకుర్తి, సీతారాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అల్గునూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సదాశివపల్లి గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. 2020 జనవరిలో విలీన గ్రామాలను కలిపి 50 వార్డులను 60 డివిజన్లుగా విభజించి ఎన్నికలు నిర్వహించారు. దూరంగా ఉన్న సదాశివపల్లి, వల్లంపహాడ్, అలుగనూరును విలీనం చేసినప్పటికీ..

 అప్పటికే సిటీలో పూర్తిగా కలిసిపోయిన బొమ్మకల్ ను కలపకపోవడంపై అప్పట్లో విమర్శలు వినిపించాయి. అలాగే చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను కలపలేదు. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ గ్రామాలను విలీనం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఈ గ్రామపంచాయతీల స్వరూపం పూర్తిగా మారిపోయింది. అర్బనైజేషన్ పెరిగి ఈ గ్రామాలు పూర్తిగా సిటీలో కలిసిపోయాయి. దీంతో వీటిని కూడా కార్పొరేషన్ లో కలపాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

గ్రేటర్ దిశగా అడుగులు.. 

కరీంనగర్ పట్టణం మున్సిపాలిటీ 1958లో ఆవిర్భవించగా.. 1987లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ఆ తర్వాత పట్టణం విస్తరించడం, జనాభా పెరగడంతో 2005లో మున్సిపల్ కార్పొరేషన్ గా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. గత రెండు దశాబ్దాల్లో అనూహ్యంగా మరింతగా విస్తరించింది. ఈ విస్తరణలో భాగంగా చుట్టూ ఉన్న సుమారు 12 గ్రామాలు ఇందులో కలిపిపోయాయి. ఈ క్రమంలోనే 8 గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేసినప్పటికీ మరో నాలుగు గ్రామాలను కలపలేదు. అయితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అప్పట్లో కొంత కసరత్తు జరిగినా మళ్లీ అంశం తెరమరుగైంది. 

గ్రేటర్ హోదా దక్కాలంటే జనాభా 5 లక్షలు దాటాలనే నిబంధన ఉంది. 8 గ్రామాల విలీనం, కరీంనగర్ లో ప్రసుత జనాభాను కలిపితే 4 లక్షలు దాటిందని అంచనా. మరో నాలుగు గ్రామాలను కలిపితే జనాభా మరికొంత పెరగనుంది. ప్రభుత్వం కొంత నిబంధనలు సడలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రేటర్ కార్పొరేషన్లుగా ఉన్న హైదరాబాద్, వరంగల్ నగరాల సరసన కరీంనగర్ చేరనుంది. 

నాలుగు గ్రామాలను విలీనం చేయాలి.. 

కరీంనగర్ లో కలిసిపోయిన బొమ్మకల్ తో పాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలి. కార్పొరేషన్ లో చేర్చితే నిధులు ఎక్కువగా వచ్చి అభివృద్ధి అయ్యే అవకాశముంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం మెరుగుపడుతుంది. 

వాజిద్ అలీఖాన్, బొమ్మకల్