- ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇస్తారా?
- 15 రోజులుగా రాజ్‌భవన్‌లోనే ఫైల్ పెండింగ్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతి ఇస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణాలతో త్వరలో ఏం జరగబోతున్నదనేది హాట్ టాపిక్‌గా మారింది. ఫార్ములా ఈ రేస్ కోసం ఓ విదేశీ కంపెనీకి కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అర్వింద్‌కుమార్ ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్లు చెల్లించారు.
ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు పీసీ యాక్ట్ 17ఏ కింద అనుమతించాలంటూ గత నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. ఇదే విషయమై సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల గవర్నర్‌ను కలిసి ఈ కేసు ప్రాధాన్యాన్ని వివరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై గవర్నర్ ఏజీఐకి లేఖ రాశారని చెప్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి రాలేదు.
అదే సమయంలో కేటీఆర్, గవర్నర్, సీఎంల ఢిల్లీ పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. కేటీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత ఆయన మహారాష్ట్ర ఎన్నికలపై చేసిన కామెంట్లతో పాటు సీఎం సహా మంత్రులు కేటీఆర్‌పై మాటలదాడి మొదలుపెట్టారు. దీంతో కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విచారణకు అనుమతించకపోతే రేవంత్ ప్రభుత్వం ఏ మార్గాల్లో ముందుకెళ్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఏం జరిగినా.. బీఆర్ఎస్కే ఎఫెక్ట్
ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందుకు పోతోంది. ఏపీలో చంద్రబాబునాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు ఇదే సమస్య వచ్చింది. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును నేరుగా అరెస్టు చేయడంతో టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. ఇక్కడ అలాంటి సమస్య రాకుండా ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. కాగా.. ఫైల్ ఇంకా ఆయన దగ్గరే పెండింగ్‌లో ఉంది.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మలేషియా పర్యటన రద్దు చేసుకుని.. ఈ నెల 11న ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్లపైనా కంప్లయింట్ ఇచ్చినట్లు బయటకు చెప్పినా.. తన కేసు గురించే మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇందుకు తగ్గట్లే కేంద్ర పెద్దలను కలిసిన తరువాత మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కేటీఆర్ మాట్లాడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. కాగా.. కేటీఆర్ అరెస్టుపై గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి బంధం బయటపడుతుందనే చర్చ మొదలైంది.
అయితే.. ఇప్పుడే అనుమతి ఇవ్వకపోవచ్చని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారంలో గవర్నర్ అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా బీఆర్ఎస్కే మైనస్అవుతుందని, ఒకవేళ అనుమతిస్తే.. విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ ఘటనలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయినందున రాష్ట్ర ప్రభుత్వంఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.