
మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో న్యాయమూర్తి వర్మ ఢిల్లీలో లేరు. ఆయన, ఆయన భార్య మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఆయన సిబ్బంది పోలీసులకి తెలియజేశారు. మంటలు ఆర్పుతున్నప్పుడు ఇంటి బయట ఉన్న ఓ గదిలో లెక్క చూపని భారీ మొత్తంలో డబ్బుని అగ్నిమాపక అధికారులు గుర్తించారు. వీడియో కూడా తీశారు. సుప్రీం కోర్టు విడుదల చేసిన వీడియోలో మరో వ్యక్తి కూడా వీడియో తీస్తున్న దృశ్యం కనిపించింది. ఎంతమంది వీడియో తీశారో తెలియదు. అన్నింటినీ క్రోడీకరించి పోలీసులు సుప్రీంకోర్టుకు అందించినట్టు లేదు.
ఆ వార్తని, ఆ వీడియోని చూసిన దేశం విస్తుపోయింది. హైకోర్టు న్యాయమూర్తి ఇంటిలో అంతపెద్ద మొత్తంలో కాలుతున్న నగదు కనిపించడంతో న్యాయవ్యవస్థకి సంబంధించిన వ్యక్తులందరూ విస్మయానికి గురయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి నివేదికను తెప్పించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు. ఈ కమిటీ తన దర్యాప్తు మొదలుపెట్టింది.
సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై జస్టిస్ వర్మను ఆయన మాతృ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. అంతవరకు ఆయనకు జ్యుడీషియల్ పనిని అప్పగించకూడదని ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఈ బదిలీ ప్రతిపాదనను అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకునేంతవరకు కోర్టుని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో జస్టిస్ వర్మని అలహాబాద్హైకోర్టుకి బదిలీ చేయాలన్న ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. న్యాయమూర్తి వర్మని అభిశంసన చేయాలని కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. నేర నిరూపణ కాకముందే న్యాయవాదుల సంఘం ఇలాంటి డిమాండ్ చేయడం సమంజసం అనిపించడం లేదు.
ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?
కాలిన నోట్ల కట్టలు కట్టలుగా న్యాయమూర్తి ఇంట్లో దొరికినాయని దేశంలోని గ్రామ గ్రామాన తెలిసిపోయింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరు తీసుకుని వచ్చారన్న విషయం అంతర్గత విచారణలో తెలియవచ్చు. డబ్బుని జప్తు చేశారన్న విషయం, ఎంతడబ్బు దొరికిందన్న విషయం, ఎంత డబ్బు కాలిపోయిందన్న విషయం సుప్రీంకోర్టు నివేదికలో చెప్పలేదు. అసలు ఆ నోట్లు నకిలీవా, మంచివా అన్న విషయం కూడా తెలియదు.
మంచి వెలుతురులో వీడియో రికార్డింగ్ చేయలేదో కూడా తెలియదు. తనని బదనాం చేయడానికి ఈ కేసులో ఇరికించినారని జస్టిస్ యశ్వంత్ వర్మ అంటున్నారు. ఈ విషయం గురించి మూడు ప్రశ్నలని జస్టిస్ వర్మని అడగాలని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ఖన్నా ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ్‌ను కోరారు. ఆ ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. తన ఇంటి ప్రాంగణంలో ఆ డబ్బు ఎలా ఉంది? ఆ గదిలోకి ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?15 మార్చి 2025 ఉదయం ఆ గది నుంచి కాలిపోయిన డబ్బును తొలగించిన వ్యక్తి ఎవరు?
ఎన్నో సందేహాలు
కరెన్సీ నోట్లు ఎవరుతెచ్చి పెట్టి ఉంటారు? ముఖ్యంగా ఆ కరెన్సీ నోట్లు ఎవరివి కావొచ్చు? అది అగ్ని ప్రమాదం వల్ల జరిగిందా? లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా?.. అనేది తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 326 (ఎఫ్) ప్రకారం ఎఫ్ఐఆర్ను ఎందుకు నమోదు చేయలేదు?. ఢిల్లీ పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని ఎందుకు రక్షించలేదు? 15 మార్చి 2025 ఉదయం శిథిలాలను, కాలిన కరెన్సీ నోట్లను (ఏవైనా ఉంటే) ఎవరు తొలగించారు? జస్టిస్ వర్మ చెప్పినట్టుగా స్టోర్ రూంలో దొరికిన కరెన్సీ నోట్లను ఆయన కుటుంబ సభ్యులకు ఎందుకు చూపించలేదు?
ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తికి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ పంపిన వీడియోలో కనిపించిన కాలిపోయిన కరెన్సీ నోట్ల అవశేషాలు ఎక్కడ ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారా? చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు? కాలిపోయిన కరెన్సీ నోట్లను ఎవరు చూశారు. అవశేషాలను పడవేశారా? అలా అయితే ఎందుకు? వీడియోను ఎవరు రికార్డు చేశారు? జస్టిస్ వర్మ బంగ్లా ప్రాంగణంలోకి, అదేవిధంగా స్టోర్‌హౌస్‌లోకి ప్రవేశించే, నిష్ర్కమించే సీసీటీవీ ఫుటేజీలు ఎక్కడ ఉన్నాయి? అంతర్గత విచారణ కమిటీకి సాక్ష్యాలని ప్రమాణ పూర్వకంగా నమోదు చేసే అధికారం ఉందా? క్రాస్ ఎగ్జామినేషన్ తీసుకోవచ్చా? ఇవి లేకపోతే విచారణ ఎలా ఖచ్చితమైన ముగింపుకి దారి తీస్తుంది?.. ఇవీ ప్రశ్నలు.
కొలీజియం వ్యవస్థపై విమర్శలు
అంతర్గత కమిటీ ఈ ప్రశ్నలను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు పూర్వ న్యాయ మూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఈ మొత్తం సంఘటన మీద ఆయన సందేహాలను వ్యక్తం చేశారు. దీన్ని కుట్రగా అభివర్ణించారు. ఆ డబ్బు నిజమైన లంచం కాదనీ, ఆయనను ఇరికించడానికి పెట్టారని, వర్మ సిబ్బందిలో ఎవరో ఒకరు ప్రమేయం ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్ కట్జూ ప్రకటన ఓ భిన్నమైన కోణాన్ని ఈ వివాదంలో సూచిస్తుంది. అంతర్గత విచారణ జరుగుతున్న దశలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తపరచకపోవడం సమంజసం. మన దేశంలోని న్యాయసూత్రాల ప్రకారం నేర నిరూపణ జరిగేవరకు ఎవరినైనా అమాయకుడిగానే పరిగణించాలి.
అయితే, ఇలాంటి విచారణల్లో అనుమానానికి అతీతంగా ఆరోపణలను రుజువు చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్ కేసులకి ఈ న్యాయసూత్రం వర్తిస్తుంది. కేసులోని ప్రబలతను బట్టి నిర్ణయాలకు వస్తుంటారు. ఈ విషయాలను అలా పక్కనపెట్టి చూస్తే రాజకీయ పక్షాల ప్రతిస్పందన ఈ విషయంమీద మరో విధంగా ఉంది. దాదాపు ప్రధాన రాజకీయ పక్షాలు కొలీజియం వ్యవస్థని తీవ్రస్థాయిలో విమర్శించడం మొదలుపెట్టారు. ఈ కొలీజియం వ్యవస్థ గొప్పదని ఎవరూ అనడం లేదు. ఇందులో ఇష్టాయిష్టాలు, వ్యతిరేక భావనలు ఉన్నాయి. అయినా కూడా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా రాజకీయ (అధికార) పక్షం చేతిలో పెడితే ఎలక్షన్ కమిషన్ మాదిరిగా మారిపోతుందని విజ్ఞుల భయం. పెనం నుంచి పొయ్యిలోకి పోవద్దని చాలామంది న్యాయకోవిదులు కోరుకుంటున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక్కడొక విషయం మనం గమనించాలి. గతంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొలీజియం గురించి రాజకీయ పక్షాలు ఇంత తీవ్రంగా చర్చించలేదు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్ గత మార్చి నెలలో తన పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఎంపీగా నిలబడి గెలిచారు. న్యాయక్రమశిక్షణని ఆయన ఎన్నోసార్లు ఉల్లంఘించారు. ఏప్రిల్ 2023లో జస్టిస్ గంగోపాధ్యాయ్ ‘స్కూల్ ఉద్యోగాల్లో స్కామ్’ బ్యాచ్ కేసులని విచారిస్తూ ఓ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ స్కామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చాలా ఇబ్బంది పాలయ్యారు. అప్పుడు కొలీజియం చర్చ జరగలేదు. ఆ తీర్పులను తిరగతోడాలని ఎవరూ అనలేదు.
ఒరిస్సా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చిత్తరంజన్‌దాస్ 2023 చివరలో యువతులు తమ లైంగిక కోరికలను అదుపులో ఉంచుకోవాలని ఓ తీర్పుని ప్రకటించి వార్తల్లో నిలిచారు. తన వీడ్కోలు సమావేశంలో ఆయన తాను ఆర్ఎస్ఎస్ సభ్యుడిని అని కానీ, నిష్పాక్షికంగా కేసులను పరిష్కరించాను అన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది హైకోర్టు న్యాయమూర్తులు మనకు కనిపిస్తారు. అందరూ సిట్టింగ్ న్యాయమూర్తులే.
న్యాయమూర్తులు అవినీతికి దూరంగా ఉండాలి
పంజాబ్ అండ్ హర్యానా న్యాయమూర్తి రజిబీర్ సెహ్రావత్ సుప్రీంకోర్టు మీద ధర్మరహిత వ్యాఖ్యలు చేశారు. గత సెప్టెంబర్ నెలలో కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీశానంద మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌గా అభివర్ణించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ విశ్వహిందూ పరిషత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ మెజారిటీనిజమ్ సూత్రాన్ని సమర్థించాడు.
ఇక సుప్రీంకోర్టు విషయానికొస్తే రామ జన్మభూమి కేసు పరిష్కరించిన రంజన్గొగోయ్కి రాజ్యసభ సభ్యత్వం, మరో న్యాయమూర్తికి గవర్నర్ పదవులు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి ఇంటిలో గణపతి పూజకు ప్రధాన మంత్రి వచ్చినా కొలీజియం గురించి రాజకీయ పక్షాలు ఏకం కాలేదు. కానీ, ఇప్పుడు ఏకమవుతున్నట్టుగా అనిపిస్తుంది. చివరిగా.. కనీసం న్యాయమూర్తులు అవినీతికి దూరంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే నోట్ల మంటలు దేశమంతా మండుతున్నాయి. కొలీజియం వల్ల ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్దే చర్చలు జరగాలి. పారదర్శకతకి ప్రాధాన్యత ఏర్పడాలి.
జస్టిస్ వర్మ దోషిగా కథనాలు
ఆరు నెలలుగా జస్టిస్ వర్మ ఇంటిలో ఉన్న హైకోర్టు సిబ్బంది, వ్యక్తిగత భద్రతాధికారుల వివరాలు కూడా నిర్ధారించనున్నారు. గత ఆరు నెలలుగా జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక లేదా ఇతర మొబైల్ ఫోన్ నంబర్ల కాల్ రికార్డు వివరాలను సేకరించారు. నేనుగానీ నా కుటుంబ సభ్యులుగానీ స్టోర్ రూంలో డబ్బులు పెట్టలేదని వర్మ తన జవాబులో చెప్పారు. ఆ స్టోర్ తన ఇంటిలోని భాగం కాదని తన ఇంటికి ఆ స్టోర్‌కి మధ్యన ఓ గోడ ఉందని కూడా ఆయన తన జవాబులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జస్టిస్ వర్మ దోషిగా పేర్కొంటూ మీడియా కథనాలు, ఇంటర్వ్యూలు విరివిగా వచ్చాయి. వస్తున్నాయి. న్యాయమూర్తి మీద కేసు పెట్టాలంటే సుప్రీంకోర్టు / హైకోర్టు అనుమతి కావాలి. కానీ, దహనం జరిగిన కేసును పోలీసులు ఎందుకు నమోదు చేయలేదన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ నేతృత్వంలో వస్తున్న లీఫ్లెట్ వెబ్ జర్నల్‌లో కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. అందులో ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి.
డా. మంగారి రాజేందర్
పూర్వ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ