జైళ్లలో మగ్గుతున్న ‘అగ్నివీరులు’

జైళ్లలో మగ్గుతున్న ‘అగ్నివీరులు’

సైన్యం ఆధునికీకరణలో భాగంగా దేశంలో  కేంద్ర ప్రభుత్వం 14 జూన్​2022న డిఫెన్స్ ఫోర్సెస్,  త్రివిధ  దళాలు ( ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ )లో సైనికులను భర్తీ చేయడానికి అప్పటివరకు ఉన్న సెలక్షన్​కు భిన్నంగా ‘అగ్నిపథ్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. సైన్యంలో  నాలుగు సంవత్సరాల పదవీకాలంతో నియమితులయ్యేవారిని ‘అగ్నివీర్’ లుగా పిలుస్తారు.

ఈ పథకంలో  భాగంగా  ట్రైనింగ్​లో  ఉత్తమ ప్రతిభ  కనబరిచిన 25% అగ్నివీరులను పర్మినెంట్​గా నియమిస్తారు. మిగతా 75%  మందికి సేవానిధి ఆర్థిక ప్యాకేజీతో పాటు అగ్నివీర్  సర్టిఫికేట్,  దేశంలో పారా మిలిటరీ,  కొన్ని స్టేట్ పోలీసు రిక్రూట్​మెంట్లలో 10% పోస్టులు  రిజర్వేషన్  ద్వారా  ఉద్యోగాలు  పొందే అవకాశం ఉంటుంది.

కేంద్రం నాలుగు సంవత్సరాల సర్వీస్ నిబంధనతో ఈ పథకం ప్రవేశపెట్టగానే దేశవ్యాప్తంగా ఆర్మీలో చేరడం తమ జీవిత లక్ష్యంగా శిక్షణ కేంద్రాలలో ఫిజికల్ ట్రైనింగ్ పొందుతున్నవారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఈ పథకం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో  అభ్యర్థుల వ్యతిరేకతకు తోడు అగ్నికి ఆజ్యం పోసేలా కోచింగ్ సెంటర్ల యజమానులు,  రాజకీయ పార్టీ నాయకుల వ్యాఖ్యలు దేశంలో పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీశాయి. 

అవే వారి భవిష్యత్ పాలిట శాపంగా మారాయి. అప్పటికే  ముగించిన  ఫిజికల్, రాత పరీక్షలు  రద్దు చేసి మళ్లీ అగ్నిపథ్​ పథకంలో అప్లై చేయాలి అనేసరికి వారి నిరాశ, నిస్పృహ,  అక్రోశం వ్యతిరేకత ఒక్కసారి అగ్నిపర్వతంలా బద్దలైంది. దీంతో  నిరసనలు,  రాస్తా రోకోలు, బంద్​లలో భాగంగా రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవరకు ఉద్రిక్తతలు దారితీశాయి.  

తెలంగాణలో 60 మందిపై కేసులు

తెలంగాణలో  కూడా  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం కార్యక్రమంలో సుమారు 60 మందిపై కేసులు నమోదు అయ్యాయి.  నిందితులు జైలుకు కూడా వెళ్ళారు. అప్పటి టీపీసీసీ  ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సుమారు 15 మందికి హైకోర్టు ద్వారా బెయిలు ఇప్పించారు. సుమారు 50 మంది అగ్నివీరులు ఇంకా జైలులో ఉన్నట్టు సమాచారం.

ఈ సంఖ్య దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో సుమారు 500 వరకు ఉంటుంది.  క్షణికావేశంలో చేసిన తప్పులకు జీవితం మొత్తం ఇలా జైలులో గడపాల్సివస్తోంది.  అగ్నివీరుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవీయ కోణంలో వారిపై ఉన్న కేసులను తొలగించి దేశానికి సేవ చేసే అవకాశం ఇస్తే బాగుంటుంది.

అగ్నివీరుల భవిష్యత్తుపై నీలి నీడలు
కేంద్ర ప్రభుత్వం కూడా అగ్నిపథ్​ సంఖ్యను 25% అని ఆ తర్వాత 50% అని ప్రకటనలు చేసినా కార్యరూపం దాల్చలేదు.  ఆఫీసర్ల  భర్తీకి ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఐదేళ్లు,  పదేళ్లు, ఆ తర్వాత  ప్రతిభ కనబరిచి పరీక్ష పాస్ అయితే పర్మినెంట్ కమిషన్ లాగా అగ్నివీరులకు అవకాశం ఉంటే అభ్యర్థులు అటువైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు.  దేశ భద్రతకు సంబంధించిన అగ్నివీరుల భర్తీ కూడా ఎన్నికలలో రాజకీయ ప్రచార అస్త్రంగా మారడం దురదృష్టకరం.

అగ్నివీరులకు  కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ ఉద్యోగాలలో,  కొన్ని రాష్ట్రాలు మాత్రమే రిజర్వేషన్ ప్రకటించాయి తప్ప దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఇప్పటివరకు అగ్నివీరులకు రిజర్వేషన్లు ప్రకటించలేదు.  రాష్ట్రాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి  పదవీ విరమణ  పొందిన మాజీ  సైనికులు ఇంకోవైపు బీఎస్ఎఫ్,  సీఆర్పీఎఫ్, ఇతర పారా మిలిటరీ దళాలకు అమలుచేసే రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలలో  కోర్టు వివాదాలు నడుస్తున్నాయి.  ఆ పైన అగ్నివీరుల భవిష్యత్తుపై కూడా రాష్ట్రాలలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాలపై  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా చర్చలు జరిపి సరైన నిర్ణయాలు తీసుకుంటే  బాగుంటుంది.

బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు