
‘నా మాతృభాష తెలుగు’ అని తెలంగాణ శాసనసభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ , స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి డా. అనసూయ సీతక్క చేసిన దీటైన ప్రకటన తెలుగువారందరికీ గర్వకారణం. తెలుగును తమ భాషగా చెప్పుకోలేని తెలుగువారు, తెలుగు రాకపోవడం తమ విజయంగా చెప్పుకోగల తెలుగేతరులు నివసించే తెలుగు రాష్ట్రాలలో, తను పుట్టి పెరిగిన మట్టిపై నిష్కల్మషమైన ప్రేమకు సూచిక ఈ వ్యాఖ్య.
తెలుగును అధికార భాషగా గుర్తించడానికి సుమారు రెండు దశాబ్దాలు (1966) పట్టింది. అదేవిధంగా అధికార భాషా సంఘం ఏర్పాటుకు మరో ఎనిమిదేళ్లు (1974 ) పట్టింది. అధికార భాషా చట్టం, 1966 ప్రకారం తప్పనిసరిగా అధికార భాషా సంఘం అధికారిక కార్యకలాపాలలో ఆంగ్లం తగ్గించి, తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ప్రభుత్వానికి సూచనలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ 2018లో ‘తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏర్పాటు) నియమాలు’ జారీ చేసింది. అంగళ్ల పేర్లు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో రాయకపోయినా, పాఠశాలలో తెలుగు బోధించకపోయినా - రూ.50,000 వరకు జరిమానాతోపాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారాలు ప్రాధికార సంస్థకు ఉన్నాయి. తెలంగాణ కూడా ఈ నియమాలను పరిశీలించాలి.
నిర్జీవంగా అధికార భాషా సంఘాలు
అధ్యక్షులు, అధికారుల నియామకం జరగక నిర్జీవంగా మారిన ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార భాషా సంఘాలకు చైతన్యం కల్పించి తెలుగు భాషను రక్షించాలి. సమాచార హక్కు చట్టం, 2005 సెక్షన్ 4(4) ప్రకారం, సమాచారం తెలుగు భాషలో అందాలని నిర్దేశిస్తుంది. అయినప్పటికీ, ప్రభుత్వ ఉత్తర్వులు, దస్త్రాలు ఆంగ్లంలోనే తయారవుతున్నాయి. ఇది సమయం, డబ్బు వృథాతో పాటు పారదర్శకతను దెబ్బతీస్తోంది. ఒక సంక్లిష్ట ఆంగ్ల పత్రాన్ని 4-5 సార్లు సవరించాల్సి వస్తే, తెలుగులో రాస్తే 1-2 సవరణలతో పని పూర్తవుతుంది.
ఇలా కార్యాలయాలలో వృథా అయ్యే సమయం విలువ ఏటా రూ. కోట్లలో ఉంటుందని అంచనా. కృత్రిమ మేధస్సు సాంకేతికతతో ‘చాట్ జీపీటీ’, గ్రోక్, ‘గూగుల్ ట్రాన్స్లేట్’, ‘మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్’, ‘భాషిణి’ వంటి సాధనాలు తెలుగులో రాయడం, అనువాదం చేయడం, మాట్లాడడం సులభతరం చేశాయి. ‘జెమిని 2.5 ప్రొ.’ అనువాద ప్రక్రియను దాదాపు 80 శాతం దోషరహితంగా పూర్తి చేయగలుగుతోంది.
తెలుగులో తీర్పుల రచన జరగాలి
చిన్నపాటి సివిల్, క్రిమినల్ కేసులు గ్రామస్థాయిలోనే పరిష్కారం కావడం వల్ల గ్రామీణులకు ప్రభుత్వం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల మరింత నమ్మకం కలుగుతుంది. అంతేగాక, సెక్షన్ 29 ప్రకారం, ఈ న్యాయాలయాల్లో విచారణ, తీర్పుల రచన తెలుగులో జరగాలి. ఇది న్యాయ వ్యవస్థలో తెలుగు వినియోగానికి తొలి అడుగుగా ఉపయోగపడుతుంది. బాలలకు పర భాష మాత్రమే వారసత్వంగా లభిస్తున్నట్లయితే ఆ భాష ప్రమాదంలో ఉన్నట్లేనని ‘ఎథ్నోలాగ్’ హెచ్చరిస్తోంది. భూమిపై ప్రజలు మాట్లాడే 8,324 భాషలలో 351 భాషల్లో మాత్రమే పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతోంది. భాష లేకపోతే జాతి స్వతంత్రత కోల్పోతుంది. ‘హవాయి’ భాష ఉదాహరణ మనకు గుణపాఠం.
19వ శతాబ్దంలో ఇంగ్లీష్ ఆధిపత్యం వల్ల హవాయి భాష కనుమరుగై, ఆ జాతి తన స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. మరో పక్క, ఇంగ్లీష్ భాషను రక్షించుకోవడానికి ఇంగ్లీష్ ప్రజలు 400 ఏళ్ల పోరాటం చేసి, దాన్ని ప్రపంచ భాషగా స్థాపించారు. పరిపాలనా వ్యవహారాల్లో, న్యాయ వ్యవస్థలో, విద్యా రంగంలో తెలుగు భాషను మరింత బలోపేతం చేయాలి. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో ఉత్తర్వులు తెలుగులో కూడా జారీ చేస్తామనే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రకటన హర్షణీయం. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డు బడుల్లో తొమ్మిది, పది తరగతులలో తెలుగును తప్పనిసరిగా బోధించాలనే తెలంగాణ విద్యాశాఖ ఆదేశం వంటి మరిన్ని అడుగులు ముందుకుపడాలి.
ప్రజల భాషలో పాలనా వ్యవహారాలు
పరిపాలన వ్యవహారాలన్నీ ప్రజల భాషలో జరగనప్పుడు గోప్యత పెరిగి, అవినీతికి అవకాశం ఏర్పడుతుంది. ఇది సామర్థ్యం, నిబద్ధత ఉన్న గ్రామీణ ప్రజలు, నేతలు, ముఖ్యంగా మహిళలు, స్థానిక సంస్థలను దాటి ఉన్నత స్థాయికి ఎదగకపోవడానికి ఒకరకమైన అవరోధంగా మారుతోంది. ఉదాహరణకు, ఇరు రాష్ట్రాలలో 13,000 కంటే పైగా మహిళా సర్పంచులు ఉన్నప్పటికీ, వీరిలో చాలా మంది ఒకటి, రెండు సార్లు సర్పంచుగా పనిచేసి అనంతరం రాజకీయంగా కనుమరుగవు తున్నారు. స్థానిక నేతలకు శాసనసభ లేదా పార్లమెంటు సభ్యులుగా ఎదిగే సామర్థ్యం, పట్టుదల ఉన్నప్పటికీ, చట్టాలు, ఉత్తర్వులు, దస్త్రాలు అన్నీ ఆంగ్లంలోనే ఉండటంతో వారు పరిపాలనలో పూర్తి స్థాయిలో పాల్గొనలేక పోతున్నారు.
న్యాయ వ్యవస్థలో కూడా తెలుగును క్రమంగా ప్రవేశపెట్టేందుకు ‘గ్రామ న్యాయాలయాల చట్టం, 2008’ మంచి అవకాశం. ఈ చట్టం ప్రకారం కొన్ని గ్రామ పంచాయతీలకు కలిపి ఒక గ్రామ న్యాయాలయం ఏర్పాటు చేయాలి. సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్య విచారణ సందర్భంగా (సివిల్ రిట్ పిటిషన్ 1067/2019) రాష్ట్రాలన్నీ గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయవలసిందేనని ప్రకటిస్తూ రాష్ట్రాలపై జరిమానా కూడా విధిస్తోంది.
శ్రీనివాస్ మాధవ్, రచయిత, సమాచార హక్కు పరిశోధకుడు