ప్రైవసీ ఇస్తున్నామనే భారత్‌‌లో సిగ్నల్‌‌‌‌ యాప్‌‌కు ఆదరణ

ప్రైవసీ ఇస్తున్నామనే భారత్‌‌లో సిగ్నల్‌‌‌‌ యాప్‌‌కు ఆదరణ
భారత యూజర్లు ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రముఖ ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ సిగ్నల్ కో-ఫౌండర్ బ్రియాన్ యాక్టన్ అన్నారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై చాలా మంది యూజర్లు గుర్రుగా ఉన్నారు. సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికన్ కార్ల కంపెనీ టెస్లా అధినేత టెస్లా లాంటి ప్రముఖులు కూడా సిగ్నల్ యాప్‌‌కు మారాలని యూజర్లకు సూచిస్తున్నారు. దీంతో గత కొన్ని రోజుల్లో సిగ్నల్‌కు డౌన్‌‌లోడ్స్ విపరీతంగా పెరిగాయి. ఈ విషయంపై సిగ్నల్ యాప్ కో-ఫౌండర్ బ్రియాన్ యాక్టన్ స్పందించారు. తమ యాప్‌‌కు భారత్ వ్యాప్తంగా మంచి మద్దతు లభిస్తోందన్నారు. ‘మంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా సిగ్నల్‌కు వస్తున్న ఆదరణతో అది మరోమారు నిరూపితమైంది. డేటా ప్రైవసీ విషయంలో ఇక్కడి యూజర్లు చూపిస్తున్న ఆసక్తి ప్రశంసనీయం. ఇక్కడ మాకు మంచి గ్రోత్ కనిపిస్తోంది. ఇండియాకు డిజిటల్ ప్రైవసీ కావాలని మాకు దక్కిన ఆదరణతో ప్రూవ్ అయ్యింది. మాది సేఫ్ యాప్ అని యూజర్లు నమ్ముతున్నారు. మేం ఎలాంటి యూజర్ డేటాను సేకరించం. మేం కల్పిస్తున్న ఎండ్ టూ ఎండ్ ఎన్‌‌క్రిప్షన్‌‌లో యూజర్ల డేటా, ఫొటోలు, కాల్స్, వీడియోలు, ప్రొఫైల్ ఫొటోను సేకరించం. స్థానికతపై మేం దృష్టి పెడుతున్నాం. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ్, తెలుగుతోపాటు ఉర్దూ లాంటి భారతీయ భాషల్లో మా సేవలను వినియోగంలోకి తీసుకురావడంపై పని చేస్తున్నాం. యూజర్ల డేటాకు భద్రత కల్పించడంపై మరింతగా కష్టపడాలని నిర్ణయించాం’ అని బ్రియాన్ యాక్టన్ పేర్కొన్నారు.