సింగపూర్: డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన ఇండియన్ ఆరిజిన్ మలేసియన్కు సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరికొన్ని గంటల్లోనే ఆ శిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే అతనికి కరోనా సోకడంతో కోర్టు మానవతా దృక్పథంతో ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. నాగేంద్రన్ కె ధర్మలింగం(33) ఇండియన్ ఆరిజిన్ మలేసియన్. అతడు 2009లో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయ్యాడు. సింగపూర్ లోకి 42.72 గ్రాముల హెరాయిన్ తీసుకొచ్చాడని నేరం రుజువైంది. దీంతో కోర్టు 2010లో అతనికి ఉరి శిక్ష విధించింది. దీనిపై ధర్మలింగం పై కోర్టులలో అప్పీల్ చేసుకున్నప్పటికీ, చివరికి ప్రెసిడెంట్ కు క్షమాభిక్ష పెట్టుకున్నప్పటికీ ఊరట లభించలేదు.
చివరి క్షణంలో...
11 ఏండ్ల నుంచి సింగపూర్ లోని చాంగీ జైలులో శిక్ష అనుభవిస్తున్న ధర్మలింగానికి ఈ నెల 10న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే అతని మానసిక స్థితి సరిగా లేదని, ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని లాయర్ ఎం.రవి సోమవారం పిటిషన్ ఫైల్ చేశారు. దీన్ని కొట్టేసిన కోర్టు.. అప్పీల్ కు అనుమతి ఇచ్చింది. అప్పీల్ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అదే టైమ్ లో ధర్మలింగానికి కరోనా సోకిందని జైలు అధికారులు కోర్టుకు తెలియజేశారు. ‘‘అతనికి రేపు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఇంతలో ఊహించనిది జరిగింది. కరోనా సోకిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరిశిక్ష అమలు చేయలేం. మానవతా దృక్పథంతో ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తున్నాం. విచారణ పూర్తయ్యేంత వరకూ ఉరిశిక్షను నిలిపివేస్తున్నాం” అని జస్టిస్ ఆండ్రూ పాంగ్ చెప్పారు. విచారణను వాయిదా వేశారు. ధర్మలింగానికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఇంతకుముందు 70 వేల మంది ఆన్ లైన్ లో సంతకాలు చేశారు. దీనిపై మలేసియా ప్రధాని కూడా సింగపూర్ ప్రధానికి లెటర్ రాశారు.