- స్కూళ్ల ప్రారంభంలోగా పూర్తయ్యేలా ప్రణాళిక
- ఎప్పటికప్పుడు పనులపై కలెక్టర్ ఆరా
ఆదిలాబాద్, వెలుగు : సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ద్వారా పాఠశాలల్లో ఆయా పనులు నిర్వహణకు నిధులు మంజూరు చేయగా ఆ పనులు చకచకా సాగుతున్నాయి. బడులు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. జరుగుతున్న పనులపై కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండటంతో పనుల్లో వేగం పెరిగింది.
గతంలో మన ఊరు మన బడి కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే సౌకర్యాలు కల్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న 648 పాఠశాలల్లో కనీస సదుపాయాలు క్పలించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న పాఠశాల యాజమాన్య కమిటీలను రద్దుచేసి వారి స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలను నియమించింది. ఈ కమిటీల ద్వారా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. జూన్ 10లోగా పనులు పూర్తిచేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రూ.30.52 కోట్లతో పనులు
జిల్లా వ్యాప్తంగా 648 పాఠశాలల్లో దాదాపు 55 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న పాఠశాలలు పునప్రారంభం కానున్నాయి. ఈలోగా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేసి అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలల్లో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్ సంబంధిత మరమ్మతులు, పెయింటింగ్ పనులు, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, తరగతి గదుల తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర వాటికి రిపేర్లు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ పనులకు సంబంధించి రూ.30.52 కోట్ల నిధులు మంజూరు కాగా, అడ్వాన్స్ కింద రూ.5 కోట్లు విడుదల చేశారు. గతంలో మన ఊరు మన బడి కింద కేవలం 10 శాతం మాత్రమే అడ్వాన్స్‌గా ఇచ్చారు. కానీ ఇప్పుడు 25 శాతం నిధులు అడ్వాన్స్ ఇచ్చి పనులు కొనసాగిస్తున్నారు. కలెక్టర్ ద్వారానే ఈ నిధులు మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, స్కూల్ హెచ్ఎంల బ్యాంక్ ఖాతాలు తెరింపించారు. ఈ పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కలెక్టర్.. ఏ ఒక్క పాఠశాలలో కూడా పనులు పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశాలు జారీ చేశారు.
పనులు చేపట్టకముందు, చేపట్టిన తర్వాత వాటి ఫొటోలు తీసి పంపించాలని సూచించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షలు చేస్తున్నారు. నాణ్యత లోపించకుండా పర్యవేక్షిస్తుండటంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 245 స్కూళ్లలో వంద శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
బడుల ప్రారంభం నాటికి పూర్తిచేస్తం
పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. బడుల ప్రారంభం నాటికి వంద శాతం పనులు పూర్తి చేస్తాం.
టి.ప్రణిత, డీఈవో