పూడ్చిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం

  • మూగ వ్యక్తి మృతిపై సోదరుడు అనుమానాలు  
  • పోలీసులకు కంప్లయింట్ చేయడంతో కేసు నమోదు
  • డెడ్ బాడీని తీసి పంచనామా చేసిన ఆఫీసర్లు

కారేపల్లి, వెలుగు:  మూగ వ్యక్తి మృతిపై సోదరుడు అనుమానాలు వ్యక్తం చేస్తూ కంప్లయింట్ చేయడంతో పోలీసులు పూడ్చిన డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  కారేపల్లి మండలం రూప్లా తండాకు చెందిన భూక్య హరిదాసు(38) మానసిక అనారోగ్యం సరిగా లేకపోవడంతో పాటు పుట్టుకతో మూగ. అతను బీడుపోయిన పత్తి చేలల్లోకి వెళ్లి పత్తిని ఏరుకుని అమ్ముకుని బతుకుతుంటాడు. 

ఈనెల 6న హరిదాసు తండా చెరువు సమీపంలో అనుమానాస్పదంగా శవమై కనిపించాడు. అనారోగ్యంతో చనిపోయి ఉంటాడని తొలుత భావించిన కుటుంబీకులు అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు. మరుసటి రోజు నుంచి అతని మృతిపై గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో హరిదాసు సోదరుడు సక్రు కుటుంబీకులు నిందితులుగా అనుమానిస్తూ నునావత్ బావు సింగ్, అతని భార్యపై దాడి చేశారు. 

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా హరిదాసు మృతిపై కేసు నమోదు చేశారు. సోమవారం పూడ్చిన శవాన్ని బయటకు తీసి తహసీల్దార్ సంపత్ కుమార్ సమక్షంలో పంచనామా చేసి డాక్టర్ రాథోడ్ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించినట్టు కారేపల్లి ఎస్ఐ రాజారామ్ తెలిపారు.