ఏ తీరానికి ఈ సంధి కాలం ?

ఏ తీరానికి ఈ సంధి కాలం ?

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నయి. లోక్​సభ ఎన్నికలను వేదికగా చేసుకుని ఆ పార్టీలు పాగా వేసే ప్రయత్నం ఒకటైతే, ఇంకో పార్టీని బొంద పెట్టాలని, రాజకీయ ఉనికిని పశ్నార్థకం చేయాలన్నది మరో యత్నం. రెండు జాతీయ పార్టీలు విడివిడిగా వడివడిగా బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీ ఉండకూడదని  కోరుకుంటున్న తరుణంలో ఆ పార్టీ ఎలా బతికి బట్ట కడుతుంది? మళ్లీ కేసీఆర్ నిలదొక్కుకోగలరా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మళ్లీ పాత కేసీఆర్​ను అంగీకరిస్తుందా..? ఆ కోణంలో  ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.  14 ఏండ్ల ఉద్యమ పార్టీ, పదేండ్ల అధికార పార్టీ ఇపుడు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. 

స్వయం కృతాపరాధం అని కొందరు, కర్మఫలమని ఇంకొందరన్నా వెరసి బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకార బంధురమని ఆ పార్టీలోనే  కొంత సందిగ్ధత నెలకొంటున్నది. ఏ పార్టీకైనా కష్టాలు కొత్త కాకపోవచ్చుగాక, బీఆర్ఎస్ లాంటి పార్టీ ఆటుపోట్లనెదుర్కొని రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి అధికారం చలాయించవచ్చుగాక.. కానీ, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవ్వరూ ఊహించని దెబ్బ తగులుతున్నది నిజం. కేసీఆర్ కూతురు, 
ఎమ్మెల్సీ  కవిత అరెస్ట్ తో  కుటుంబ పార్టీ  మానసిక  స్థితి దెబ్బతినడం, వరుసగా ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు చెప్పాపెట్టకుండా రాజీనామా చేసి వెళ్లిపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏకంగా కాంగ్రెస్ వైపు వెళ్తుండడం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సీనియర్లు ఇక ఈ పార్టీలో ఉండలేమని ఒక్కరొక్కరుగా గుడ్ బై చెబుతుండడం, రాబోయే రోజుల్లో అసలా పార్టీయే ఉనికిలో ఉండదనే  ప్రచారం జరగడం, వెరసి  గులాబీ  శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నది.  అసలీ పార్టీ తుఫాన్  సదృశ్య భీతావహ వాతావరణనాన్ని తలపిస్తున్నది. పైపెచ్చు అసలుబీఆర్ఎస్ పార్టీ  త్వరలోనే  కాంగ్రెస్​ పార్టీలో విలీనం అవుతుందన్న  వార్తలు భూకంప ప్రచారంతో గులాబీ నేతల కాళ్ల కింద నేలను  కకావికలం చేస్తున్నది.

తిరిగి నిలదొక్కుకోవడం అసాధ్యమేనా?

కేసీఆర్​కు ఈ ఎన్నికలు ప్రాణ సదృశ్యమైనవి. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి కల్లోలాలు ఇప్పుడే మొదలయినయా...? మునుపెన్నడూ జరగలేదా..?  ఈ సందర్భంగా ఇద్దర్ని ఉదాహరించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభానంతరం కేసీఆర్ కు అత్యంత అనుంగులుగా ఉన్న ఇద్దరు లీడర్లలో ఒకరు మాజీ ఎంఎల్సీ కపిలవాయి దిలీప్ కుమార్​ మాట్లాడుతూ కేసీఆర్ తన వెంట నడిచేలా కంపల్షన్ (అనివార్యతను) సృష్టిస్తాడు. ఓ ఫినిక్స్ లాగా మళ్లీ లేస్తడు అని కుండబద్దలు కొడతాడు. ఆ మాటకొస్తే ఇంకో నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి కూడా వంద మంది చాణక్యులతో కేసీఆర్ ఒక్కడు సమానం అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం కేసీఆర్ శత్రు శిబిరంలో ఉన్నవాళ్లే.  అయితే ఉద్యమకాలంలో తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంట ఉన్నది. అదే కేసీఆర్ బలం. కానీ, కేసీఆర్ పదేండ్ల పాలన ఒక బలహీనతగా పరిణమించనుందని చెప్పాలి. పాలకుడిగా విఫలమైన కేసీఆర్​ ఎంత చాణక్యుడైనా ప్రజల గతానుభవా
లను కాదని తిరిగి నిలదొక్కుకోవడం కష్టం. అందునా రెండు జాతీయ పార్టీలు నిలదొక్కుకుంటే, కేసీఆర్​ నిలదొక్కుకోవడం మరింత కష్టమైన పనే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.

వెంటాడుతున్న ఫిరాయింపుల పాపాలు

ఉద్యమకాలంలో  కేసీఆర్ వెంటే నడిచి పార్టీ మారిన వారిని జనం  ద్రోహులుగా చూశారు. కానీ, తెలంగాణ జనం రెండుసార్లు అధికారమిస్తే ఆ పార్టీ ఫిరాయింపులను రెట్టింపు చేశారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో కోవర్ట్ ఆపరేషన్ పేరిట ఓ ప్రాంతీయ పార్టీని బొంద పెట్టి, మరో రెండు జాతీయ పార్టీల మనుగడ లేకుండా చేయడంతో పాటు ఏకంగా బీఆర్ఎస్​లోకి  కాంగ్రెస్ ఎల్పీ  విలీనం చేసుకుని బరితెగించి మంత్రి పదవులు కట్టబెట్టిన ఘట్టాలు సామాన్య జనం నోళ్లలో నానుతున్నది. అందుకే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా, ఆ పార్టీ ఎల్పీ విలీనం అవుతుందని వార్తలొస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు.  ఇదే సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలను పదేండ్లు రాజకీయంగా కేసీఆర్ ఎలా చెడుగుడు ఆడారో, ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తున్నది.

ఇక ఏలిన పదేండ్ల కాలంనాటి కుటుంబ పాలనలోని అవినీతి, అక్రమాలు, కుంభకోణాల ఆరోపణలకు తోడు అనేక కేసులు చివరకు ఫోన్​ట్యాపింగ్​ దర్యాప్తుతో అనేక విషయాలు బయటకొస్తుంటే కేసీఆర్ హయాంలో ఇన్ని అక్రమాలు జరిగాయా..? అని జనం విస్తుపోతున్నారు. పదేండ్లలో వందేండ్ల విధ్వంసం అనే విపక్షాల ప్రచారాలు జనంలోకి త్వరగా చొచ్చుకెళ్తున్నాయి. మరో పక్క అధికారం కోల్పోయిన వంద రోజుల్లోపే ఆ పార్టీ ఖాళీ అవుతుండడం, కనీసం లోక్​సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు దొరక్కపోవడం, కేసీఆర్ కొంతమందిని పిలిచి మాట్లాడినా వినకపోవడం వంటివి చూస్తే గులాబీ పార్టీకి గతంలో కన్నా ఇప్పటి ఆటుపోట్లే చాలా ఎక్కువన్న చర్చ జరుగుతున్నది. గతంలో తెలంగాణ కోసం కేసీఆర్​ను జనం పుట్టించారు. కానీ, ఆయన పాలన, కుటుంబ వ్యవహారాలు, ఆత్మగౌరవ భంగం కలిగేలా అన్ని వర్గాలు నొచ్చుకున్నంక మళ్లీ కేసీఆర్ అవసరం ఏముంటుందని తెలంగాణ సమాజం భావించడం సహజం.

ఓటమితోనే రాజకీయ పతనం

సహజంగా గొప్ప గొప్ప రాజకీయ నేతల రాజకీయ పతనాలు ఓటమితో ముగుస్తాయని చరిత్ర చెబుతున్నది. ఈ  దేశానికి అద్భుత పాలనలు అందించి అనేక సంస్కరణల విప్లవాలు తీసుకొచ్చిన  మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వాజ్ పేయి, పీవీ నర్సింహారావు, దేవెగౌడ సహా పలువురు కీలక నేతల రాజకీయ ప్రస్థానం ఓటమితోనే ముగిసింది. ఎన్టీఆర్ , ఎంజీఆర్ సహా కీలక నేతలు తమ ఓటమికి కారణాలు, తమ తప్పులను తెలుసుకుని  పార్టీని బతికించారు. మోదీ, నవీన్ పట్నాయక్, నితిశ్ కుమార్ లాంటి వారు నిత్యం జనాల్లో ఉంటూ ప్రతి ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. కానీ, 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రాజకీయాలు, ఓటమి, గెలుపుల అంశాలను ఎందుకు అవలోకనం చేసుకోలేదో అర్థం కావడం లేదు.  

అధికారంలో ఉన్నప్పుడు అహో ఒహో  అని పొగడ్తల్లో ముంచెత్తిన వారిలో సగం కూడా ఇప్పుడు కేసీఆర్ దరి చేరడం లేదు.  ఈ టైంలోనే  కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉండి లీడర్, క్యాడర్​కు మనో దైర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ, లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఇంత జరుగుతున్నా  కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రం నుంచే రాజకీయాలు నెరపుతుండడం ఆయనలోని మారని మనిషిని సూచిస్తున్నది.

మౌనం పైనా సందేహాలే !

ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే వార్త.. మౌనం పాటిస్తే వార్త. కానీ, ఇప్పుడు పరిస్థితి తలకిందులైందన్నది నిజం. ఎన్నికల ఓటమి తర్వాత ఓటమిపైన మౌనం. ఓటమి కారణాలపై రివ్యూ లేదు. దాన్ని ప్రజల ముందు ఉంచి, ప్రతిపక్ష పాత్ర  ఇచ్చినందుకు  థ్యాంక్స్ చెప్పలేదు. కొత్తగా ఎట్లాంటి పాత్ర పోషిస్తారన్న మెసేజ్ ప్రజలకు ఇవ్వలేదు. అసలు ఓటమినే ఒప్పుకున్నట్లు మాట్లాడలేదు.  పైగా ప్రజలే తప్పుచేసినట్లుగా మాట్లాడుతూ, ఓటమి అన్యాయం అన్నట్లుగా, ఇంకా మాదే అధికారం అన్నట్లుగా ప్రవర్తన తీరు విమర్శలకు తావిస్తున్నది. అప్పట్లో ఎవడొస్తారో రండి అంటూ సవాళ్లు చేశారు.  ఇప్పుడు  సొంత బిడ్డ జైలు పాలైనా మౌనమే. దేశానికి అగ్గిపెడతాను, దేశాన్ని కదిలిస్తాను అనే డైలాగులు తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారన్న చర్చ నడుస్తున్నది.

అన్నిటికీ మౌనమే పార్టీని మరింత బలహీనం చేస్తోంది. ఉంటే ఉంటారు పోతే పోతారు అనే తీరుతో నిజంగానే పోయేవాళ్లు పెరిగిపోతున్నారు. పార్టీ ముఖ్య నేతలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతున్నా అది నిజంకాదని డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. కవిత అరెస్టు టైంలోగానీ, తర్వాత నిరసనకు పిలుపునిచ్చినా పెద్దగా స్పందనలేదు. అంతకుముందు ఎల్ఆర్ఎస్ పేరుతో, మరికొన్నిసార్లు నిరసనలకు పిలుపునిచ్చినా జనం పట్టించుకోలేదు. మొత్తంగా జనం స్పందనగానీ,  కేసీఆర్ ఏదో ఇబ్బందిలో ఉన్నారన్న సింపతీగానీ తెచ్చుకోలేకపోతున్నారు. మౌనంతోనే పార్టీని చివరి దశకు తీసుకెళుతున్నారా అన్న సందేహాలు లేకపోలేదు.

- వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

  • Beta
Beta feature
  • Beta
Beta feature