ఈశాన రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్లో బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అటు మేఘాలయలో గతంలో కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని తెలిపాయి. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరగా సోమవారం నాగాలాండ్ లో పోలింగ్ ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
త్రిపుర బీజేపీదే..
60 స్థానాలు ఉన్న త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి 32 స్థానాలు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. వామపక్షాలకు 15 స్థానాలు, త్రిపురలో మోథా పార్టీ సహా ఇతర పార్టీలు 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి. త్రిపురలో ఈనెల 16న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 28.14 లక్షల మంది ఓటర్లలో 24.66 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 79.5 శాతం ఓటింగ్ నమోదైంది.
నాగాలాండ్లోనూ బీజేపీదే అధికారం..
అటు నాగాలాండ్‌లో మొత్తం 60 సీట్లు ఉండగా.. NDPP బీజేపీ కూటమి 42 స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. NPF 6 సీట్లలో.. కాంగ్రెస్ 1 స్థానం, ఇతరులు 5-నుంచి 15 నియోజకరవర్గాల్లో గెలవొచ్చని పేర్కొన్నాయి. నాగాలాండ్ లో మొత్తం 60 సీట్లకు ఎన్నికలు జరగ్గా..అధికారం చేపట్టాలంటే 31 సీట్లు అవసరం అవుతాయి. అటు నాగాలాండ్ ఎన్నికల్లో 58.8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సీట్లు పెరుగుతాయి
మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా NPP 20 సీట్లలో, టీఎంసీ11 సీట్లలో, బీజేపీ 6 చోట్ల విజయం సాధింస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇతరులు 4నుంచి -8 నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చునని సర్వే సంస్థలు తెలిపాయి. ఇక ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.