బీజేపీకే మొగ్గు..మళ్లీ మోదీ సర్కారే.. ఎగ్జిట్​ పోల్స్ అంచనా

బీజేపీకే మొగ్గు..మళ్లీ మోదీ సర్కారే.. ఎగ్జిట్​ పోల్స్ అంచనా
  • ఎన్డీయేకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం
  • ​సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా మరోసారి కమలం పార్టీ
  • ఇండియా కూటమికి 118 నుంచి 160 లోపే 
  • బెంగాల్​, కర్నాటక, ఏపీ, ఒడిశాలో ఎన్డీయేకు భారీగా సీట్లు
  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్​ ఫైట్​.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ చాన్స్

న్యూఢిల్లీ : కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కార్​ రావడం ఖాయమని ఎగ్జిట్​ పోల్స్​లో తేలింది. సింగిల్​గానే కమలం పార్టీ మ్యాజిక్​ ఫిగర్​ (272)ను దాటుతుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 352 సీట్లు సాధించింది. ‘అబ్​ కీ బార్​ చార్​సౌ పార్​’ అనే నినాదంతో ఈ సారి లోక్​సభ ఎన్నికలకు బీజేపీ వెళ్లింది.  అయితే.. గతంలో వచ్చిన దాని కన్నా ఇరవై ముప్ఫై సీట్లు ఎన్డీయేకు పెరిగే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి. కనిష్టంగా 281.. గరిష్టంగా 400 వరకు సీట్లను ఎన్డీయే సాధిస్తుందని లెక్కగట్టాయి. 

మొత్తంగా మూడోసారి మోదీ ప్రభుత్వమే కేంద్రంలో కొలువుదీరుతుందని అన్ని సంస్థలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్​ నేతృత్వంలోని ఇండియా కూటమికి గతంలో కన్నా సీట్లు పెరుగుతాయని, అయితే మ్యాజిక్​ ఫిగర్​ను మాత్రం బీట్​ చేసే అవకాశం లేదని అంచనా వేశాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్​కు 52 సీట్లు రాగా.. ఆ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ కూటమికి మొత్తంగా 91 సీట్లు వచ్చాయి. అయితే.. ఈసారి కాంగ్రెస్​ సారథ్యంలో ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు బరిలో నిలిచాయి. ఇండియా కూటమికి తక్కువలో తక్కువ 118 సీట్లు.. ఎక్కువలో ఎక్కువ 160 సీట్లు రావొచ్చని సర్వే సంస్థలు లెక్కగట్టాయి. వాస్తవ ఫలితాలు ఈ నెల 4న బయటకు రానున్నాయి. 

నెలన్నర రోజుల తర్వాత ఉత్కంఠకు తెర

దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు ఏడు దశల్లో దాదాపు నెలన్నర రోజులు ఈసీ ఎన్నికలు నిర్వహించింది. చివరి దశ ఏడో ఫేజ్​ శనివారం ముగిసింది. ఆ వెంటనే సాయంత్రం మీడియా, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్​ పోల్స్​ను రిలీజ్​ చేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 353 నుంచి 368 సీట్లు రావొచ్చని.. కాంగ్రెస్​ నేతృత్వంలోని ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు రావొచ్చని రిపబ్లిక్​ భారత్​–మాట్రిజ్​ సర్వేలో తేలింది. ఇతరులకు 43 నుంచి 48 సీట్లు రావొచ్చని ఆ సంస్థ అంచనా వేసింది.  జన్​కీ బాత్​ సర్వేలో ఎన్డీయే కూటమికి 362 నుంచి 392 సీట్లు రావొచ్చని.. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు రావొచ్చని వెల్లడైంది. 

ఎన్డీయేకు 371.. ‘ఇండియా’కు 125 సీట్లు వస్తాయని ఇండియా న్యూస్​ డైనమిక్స్​ సంస్థ అంచనా వేసింది. సీఎన్​ఎక్స్​ సంస్థ ఎన్డీయేకు 371 నుంచి 401 సీట్లు వస్తాయని.. ఇండియా కూటమికి 109 నుంచి 139 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇండియా టుడే– యాక్సిస్​ మై ఇండియా సంస్థ మాత్రం ఎన్డీయే కూటమికి 361 నుంచి 401 సీట్లు వస్తాయని.. ఇండియా కూటమికి 131 నుంచి 166 సీట్లు వస్తాయని.. ఇతరులకు 8 నుంచి 20 సీట్లు వస్తాయని లెక్క గట్టింది. అన్నీ సర్వేల అంచనాలను పరిగణనలోకి తీసుకొని ఎన్​డీటీవీ ‘పోల్​ ఆఫ్​ పోల్స్’ చేపట్టగా..  ఎన్డీయేకు 365, ఇండియా కూటమికి 146, ఇతరులకు 32 సీట్లు వస్తాయని తేలింది. 

ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోనూ..!

బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ భారీగా సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్​ పోల్స్​లో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్​లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ కన్నా ప్రతిపక్ష బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని.. టీఎంసీకి 11 నుంచి 14, బీజేపీకి 26 నుంచి 31 సీట్లు రావొచ్చని ఇండియా టుడ్​–యాక్సిస్​ మై ఇండియా సర్వేలో తేలింది. ఒడిశాలో నవీన్​ పట్నాయక్​ నేతృత్వంలోని అధికార బీజేడీ కన్నా బీజేపీకే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి. 

అక్కడ ఆప్​ అధికారంలో ఉన్నప్పటికీ ఏడు ఎంపీ సీట్లకు గాను బీజేపీ క్లీన్​స్వీప్​ చేయొచ్చని పలు సంస్థలు అంచనా వేశాయి. కాగా, అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్​లో గతంలో కన్నా కొన్ని సీట్లు బీజేపీకి పెరుగుతాయని పేర్కొన్నాయి. ఇక్కడ 80 ఎంపీ సీట్లు ఉండగా..  2019 ఎన్నికల్లో బీజేపీకి 62 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 68 నుంచి 71 సీట్లు రావొచ్చని న్యూస్​ 18 సంస్థ అంచనా వేసింది.

ఏపీలో టఫ్​ ఫైట్​

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి, ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొందని పలు సర్వే సంస్థలు తేల్చాయి. కొన్ని సంస్థలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. ఎక్కువ సంస్థలు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వైపే మొగ్గుచూపాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్​ ఫిగర్​ 88. పీపుల్స్​సంస్థ సర్వేలో ఎన్డీయే కూటమికి 111 నుంచి 135 సీట్లు వస్తాయని, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు వస్తాయని తేలింది. చాణక్య స్ట్రాటజీ సర్వేలో కూడా ఎన్డీయే కూటమికి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇక.. ఆరా సంస్థ మాత్రం వైసీపీకి 94 నుంచి 104.. ఎన్డీయేకు 71 నుంచి 81 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

సౌత్​లో ఎన్డీయే, ఇండియా  ఢీ అంటే ఢీ

సౌత్​ స్టేట్స్​లోని తమిళనాడు, కేరళలో ఇండియా కూటమికి భారీగా సీట్లు వస్తాయని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. కర్నాటకలో, ఏపీలో మాత్రం ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చాయి. కర్నాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగా.. లోక్​సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపే జనం మొగ్గు చూపినట్లు పలు సంస్థలు అభిప్రాయ పడ్డాయి. ఈసారి కేరళలోనూ బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని.. తమిళనాడులోనూ ఆ పార్టీకి సీట్లు, ఓట్ల శాతం పెరగవచ్చొని పలు సంస్థలు లెక్కగట్టాయి. 

ఎగ్జిట్​ పోల్స్ మొత్తం సీట్లు: 543  మ్యాజిక్​ ఫిగర్​:272

                          సంస్థ    ఎన్డీయే    ఇండియా

ఏబీపీ న్యూస్​- సీ ఓటర్​    353 - 383    152 - 182
ఇండియా టుడే - యాక్సిస్​ మై ఇండియా    361 - 401    131 - 166
ఇండియా టీవీ - సీఎన్​ఎక్స్​    371 - 401    109 - 139
జన్​ కీ బాత్​    362 - 392    141 - 161
న్యూస్​ 24 - టుడేస్​ చాణక్య    400    107
దైనిక్​ భాస్కర్​    281 - 350     145 - 201
ఇండియా న్యూస్​- డీ డైనమిక్​    371    125
న్యూస్​ నేషన్​    342 - 378    153 - 169
రిపబ్లిక్​ భారత్​ - మ్యాట్రిజ్​    353 - 368    118 - 133
టైమ్స్​ నౌ- ఈటీజీ    358    152
న్యూస్18    355 - 370    125 - 140

(ఆంధ్రప్రదేశ్​.. అసెంబ్లీ సీట్లు: 175)

సంస్థ     టీడీపీ, జనసేన,    వైసీపీ 
    బీజేపీ కూటమి

పీపుల్స్​ పల్స్​     111 - 135    45 - 60
ఆరా    71 - 81    94 - 104
రైజ్​    113 - 122    48 - 60
చాణక్య స్ట్రాటజీస్​    114 - 125    39 - 49
జన్​మత్​ పోల్స్​    67 - 75     95 - 103