1900 సంవత్సరాల ప్రాంతంలో తెలుగు గ్రామీణ ప్రాంతాలలో జానపద గ్రామీణ వృత్తి కళారూపాల ప్రదర్శనలు జరుగుతున్న కాలంలోనే నాటకం ప్రజల అందరి మన్ననలు పొందింది. సురభి నాటకాలు, పద్యనాటకాలు, పౌరాణిక నాటకాలు అన్నీ తెలుగు లోగిళ్ల లో, తెలుగు గ్రామాలలో తనదైన ప్రత్యేకతని సాధించి, నాటకాల్లోని పద్యాలు ప్రజలకు సైతం కంఠోపాఠం గా వచ్చేలా జనంలోకి చొచ్చుకుపోయాయి. అలా నాటక రంగంలో ఉండే నటులూ, రచయితలూ ఇప్పుడు మనం అనుకుంటున్న ‘సెలబ్రిటీల’ స్థాయిని ఒకప్పుడు పొందిన స్థితి ఉంది.
కానీ, తర్వాత క్రమంలో సినిమా, టీవీలు లాంటి ఆధునిక సాంకేతిక వినోద సాధనాలు ప్రజల ముందుకు వచ్చిన తర్వాత నాటకం పాత్ర, ప్రాధాన్యత ఒకింత వెనుకంజ వేసింది. 1960 దశకంలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ అనే వ్యవస్థ ప్రపంచ రంగస్థల దినంగా ప్రతి సంవత్సరం‘ మార్చి 27 న జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఐక్యరాజ్యసమితి గుర్తించిన 202 దేశాల్లోని అన్ని ప్రభుత్వాలు, నాటకరంగ సంస్థలు, కళాకారులు అందరూ మార్చి 27న నాటకరంగ దినోత్సవం గా జరుపుకుంటూ నాటక రంగం అభ్యున్నతికి నిరంతరం ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
తెలంగాణలో నాటక రంగానికి సంబంధించిన ఆనవాళ్ళు ఆదిలాబాద్ ప్రాంతంలో తొలి మానవుడి కాలంలోనే ఆంఫి థియేటర్ లాంటి ఒక నిర్దిష్టమైన ప్రదర్శన కేంద్రంలో జరిగినట్టుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ ప్రదర్శనలు నాటకరంగం యొక్క తొలి రూపాలుగా చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా పద్య నాటకాలు, సురభి నాటకాలు తెలంగాణ ప్రాంతం లోని గ్రామీణ ప్రాంతాలలో కూడా చొచ్చుకుపోయాయి.
బలోపేతమైన తెలంగాణ నాటక రంగం
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి 2015 సంవత్సరం నుంచి అమలు చేస్తూ వస్తోంది.
1.సంప్రదాయ పద్య, పౌరాణిక, సురభి నాటకాలను ప్రోత్సహించడం, కొనసాగించడం.
2. ఆధునిక, ప్రయోగాత్మక, సాంఘిక నాటకాలను ప్రోత్సహించడం
3.జాతీయ, అంతర్జాతీయ భాషల నాటకాలను తెలుగులో నాటకీకరించి ప్రదర్శించడం.
4. హైదరాబాద్‌కే ప్రత్యేకం అనదగిన దక్కనీ నాటకాన్ని, ఉర్దూ నాటకాన్ని ఆదరించి ప్రోత్సహించడం.
5. ప్రముఖ తెలంగాణ కథకులు, సాహితీవేత్తలు రాసిన కథలను నాటకీకరించి ప్రదర్శించడం
6. జాతీయ, అంతర్జాతీయ నాటక బృందాలను తెలంగాణకు, హైదరాబాద్కు ఆహ్వానించి రాష్ట్ర కళాకారులకు, నాటకాభిమానులకు జాతీయ, అంతర్జాతీయ నాటకాన్ని పరిచయం చేయడం, సాంస్కృతిక మార్పిడికి దారులు వేయడం.
7. జిల్లాస్థాయిలో వివిధ రకాల నాటక సప్తాహాలు నిర్వహించడం ద్వారా నాటకాన్ని ప్రజలకు చేరువ చేయడం.
ఈ విధంగా ఒక ఏడంచెల వ్యూహాన్ని రూపొందించి దాన్ని పద్ధతిగా అమలు చేస్తూ రావడం వల్ల ఇప్పుడు తెలంగాణ నాటకం ఏ అంతర్జాతీయ స్థాయి నాటకానికి తీసిపోని స్థాయిలో ముందుకు వెళుతోంది.
జవజీవాలు అందించిన సాంస్కృతిక శాఖ
తాజా అంశాలనే పరిగణనలోకి తీసుకుంటే ఈ మార్చి 2024 లోనే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 28 నాటకాలని భాషా సాంస్కృతిక శాఖ ప్రదర్శిస్తోంది. ఇక ఇదే మాసంలో రాష్ట్రవ్యాప్తంగా వికారాబాద్ నుంచి తొర్రూర్ వరకు మిర్యాలగూడ నుంచి మణుగూరు వరకు వేర్వేరు వేదికల మీద నాటకోత్సవాలు, నాటక సప్తాహాలు కూడా నిర్వహిస్తూ ఈ ఒక్క మాసంలో దాదాపు 150కి పైగా నాటక ప్రదర్శనలు ప్రభుత్వం ద్వారా, భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తోంది.
భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం ‘యువ నాటక ఉత్సవాల’ని నిర్వహించడమే కాకుండా యువ రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటుల్ని నాటకరంగం వైపు ఆకర్షించడానికి కావలసిన శిక్షణ కార్యక్రమాలను, నిర్వహిస్తూ నాటకరంగానికి జవజీవాలను అందించే ప్రయత్నాన్ని చిత్తశుద్ధిగా చేస్తోంది. దీనివల్ల ఇప్పుడు తెలంగాణ నాటకరంగం కొత్త రక్తంతో. కొత్త ఆలోచనలతో సమకాలీన పోకడలను ప్రాపంచిక గమనంలోకి తీసుకుని ముందుకెళ్తూ ఉండటం గర్వకారణం!
- డాక్టర్ మామిడి హరికృష్ణ
డైరెక్టర్, ల్యాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ