ట్రిపుల్ ​ఆర్ వరకూ హెచ్ఎండీఏ..భూముల ధరలు భారీగా పెరిగే చాన్స్

ట్రిపుల్ ​ఆర్ వరకూ హెచ్ఎండీఏ..భూముల ధరలు భారీగా పెరిగే చాన్స్
  • పరిధిని పెంచుతూసర్కారు ఉత్తర్వులు
  • హెచ్ఎండీఏలోకి మరో4 జిల్లాల్లోని 16 మండలాలు 
  • మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు,
  • 1,355 గ్రామాలకు విస్తరించిన పరిధి

 హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లోని16 మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో కొత్తగా 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేరనుంది. కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి.. హెచ్‌ఎండీఏ పరిధి మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలకు పెరిగింది. 

ఇప్పటి వరకూ 7 జిల్లాల వరకు ఉన్న ఈ పరిధిలో తాజాగా 4 జిల్లాలు చేర్చడంతో మొత్తం11 జిల్లాలకు పెరిగింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏను విస్తరించారు.హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది. దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు అమల్లో ఉండగా, దీనిని మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ విస్తరణ పెరగడంతో భూముల రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనుంది. గత పదేళ్లుగా హైదరాబాద్ సిటీ విస్తరిస్తూ వచ్చింది. దీంతో శివారుల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగర శివారుల్లోని భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి.