తెలంగాణంతా రుతుపవనాల విస్తరణ.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలంగాణంతా రుతుపవనాల విస్తరణ.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఆదివారం ఆ జిల్లాకు కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ నెల 10 నాటికి రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయగా, అంతకంటే ముందే రాష్ట్రంలోకి వచ్చాయి. రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో టెంపరేచర్లు పడిపోయాయి. పలు చోట్ల సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 41.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 41.1, నిర్మల్‌లో 40.9, మంచిర్యాలలో 40.8, నిజామాబాద్‌లో 40.6, రాజన్న సిరిసిల్లలో 40.5, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. అత్యల్పంగా మహబూబ్‌ నగర్‌ టౌన్‌‌లో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వికారాబాద్‌లో 35.5, వనపర్తిలో 35.9, నాగర్‌‌కర్నూల్, నారాయణపేటలలో 36.4 డిగ్రీల చొప్పున, జోగుళాంబ గద్వాల జిల్లాలో 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చంపాపేటలో 38.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. 

మరో రెండు రోజులు వర్షాలు..

రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శనివారం ఆదిలాబాద్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కాశీంపూర్‌‌లో 8.5 సెంటీమీటర్ల వాన పడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సింగపూర్ టౌన్‌షిప్‌లో 6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా కల్లూరులో 5.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నంలో 4.6, ఖమ్మం జిల్లా కొణిజెర్లలో 3.9, నాగర్ కర్నూల్ జిల్లా వట్వర్లపల్లి, యాదాద్రి జిల్లా ఎల్లంకిలలో 3.9, సూర్యాపేట ఫణిగిరిలో 3.6, వనపర్తి జిల్లా కేతేపల్లిలో 3.3, గద్వాల జిల్లా అలంపూర్‌‌లో 3.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.