హైదరాబాద్, వెలుగు: బల్దియా – రైల్వే శాఖల మధ్య నిర్లక్ష్యం ట్రాఫిక్ జామ్‌లకు కారణంగా తయారైంది. ఆ రెండు విభాగాల అధికారుల సమన్వయంతో కొనసాగాల్సిన అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు. దీంతో రైల్వే అండర్, ఓవర్బ్రిడ్జిల విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామని కొన్నేండ్లుగా అధికారులు చెబుతుండగా, ఇంకా మొదలే పెట్టట్లేదు. దశాబ్దాల కిందట నిర్మించిన బ్రిడ్జిలు కావడం, ఇరుకుగా ఉండడం, రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతుండగా సిటీలో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రమవుతోంది. పనులపై బల్దియా అధికారులను అడిగితే త్వరలో ప్రారంభిస్తామని, ముందుగా రైల్వే అధికారులు మొదలు పెట్టాల్సి ఉందని అంటుండగా, రెండు విభాగాలు ఎప్పుడు ప్రారంభిస్తయనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు.
ఈ ప్రాంతాల్లో విస్తరించాలనుకోగా..
రాణిగంజ్, సనత్ నగర్, బాలానగర్, ఫతేనగర్, మల్కాజిగిరి, చిలకలగూడ, గౌతమ్ నగర్, మాణికేశ్వరనగర్, ఓల్డ్ అల్వాల్, బొల్లారం, ఎన్ఎఫ్ సీ మల్లాపూర్ తదితర ఏరియాల్లో రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిలను విస్తరించాలని ప్రభుత్వం రెండేండ్ల కిందట నిర్ణయించింది. కొన్నిచోట్ల శంకుస్థాపనలు కూడా చేయగా పనులైతే చేయడంలేదు. అప్పట్లో కరోనా ఉండగా, ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని, రైళ్లు కూడా పెద్దగా రాకపోగా ఇబ్బందులు రావని త్వరగా పూర్తి చేయొచ్చని అనుకోగా, పనులు మాత్రం పెండింగ్ లోనే పడ్డాయి. ఇప్పటికి ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆయా విభాగాలు ఒకదానిపై ఒకటి నెట్లేసుకుంటున్నాయే తప్ప పనులపైన దృష్టి పెట్టడంలేదు. దీంతో అధికారులు నిర్లక్ష్యంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు మీటింగ్‌లు పెట్టి చెప్పినా..
సిటీలో రైల్వే, బల్దియా, ఆర్అండ్ బీ అధికారులు మధ్య సమన్వయం లేకపోగా, ఆ శాఖల తీరుపై మంత్రులు కూడా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గత ఫిబ్రవరి12న బుద్ధభవన్ లో మంత్రి కేటీఆర్ పలు డిపార్టుమెంట్ల అధికారులతో మీటింగ్నిర్వహించారు. బల్దియా, రైల్వే శాఖ అధికారులు సిటీలో చేపట్టాల్సిన పనులపై సమగ్రమైన ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. సిటీలోని ప్రతి రైల్వే క్రాసింగ్, ఇరుకుగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ, బల్దియా కలిసి పనిచేస్తే త్వరగా నిర్మాణాలు పూర్తవుతాయని, ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయినా పనుల్లో ఫురోగతి లేదు. అదే నెల 22 న బుద్ధభవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మరోసారి అధికారులతో సమావేశమయ్యారు. అప్పుడు కూడా పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికి కూడా పనులైతే ముందుకు సాగడంలేదు. దీన్ని బట్టి చూస్తే అధికారులు మంత్రుల ఆదేశాలను పట్టించుకోనట్టుగానే కనిపిస్తుంది. ఇలాగైతే రైల్వే అండర్, ఓవర్బ్రిడ్జిల పనులు ఏండ్లైనా పూర్తయ్యేలా లేదు.
ఇంకా మొదలు పెడ్తలే..
ఫతేనగర్ ఫ్లైఓవర్ చిన్నగా ఉంది. ఇప్పుడున్న వాహనాల రద్దీకి అది సరోపోతలేదు. విస్తరిస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ శంకుస్థాపనతోనే సరిపెట్టారు. రెండేండ్లుగా పనులు మొదలుపెట్టలేదు.
- సూర్య, ఫతేనగర్
మార్కెట్‌కు పోవాలంటేనే..
వాటర్ ఫిల్టర్ షాపు ఉంది. సామగ్రి తెచ్చేందుకు మార్కెట్‌కు పోవాలంటేనే రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి వద్ద అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో
మార్కెట్‌కు వెళ్దామంటే ఇబ్బందిగా ఉంది.
- సాయికుమార్, వ్యాపారి