
హైదరాబాద్‌సిటీ, వెలుగు:ఆర్టీసీ ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించడం కోసం తార్నాక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్తరించాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ యూనిట్‌లో 4 బెడ్‌లుండగా.. 12 బెడ్‌లకు విస్తరిస్తున్నారు. ఈ యూనిట్ విస్తరణకు సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులు పంపిన ప్రతిపాదనలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) అంగీకరించింది. కోటి రూపాయలు సాయం చేసేందుకు ముందుకువచ్చింది.
నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఈ యూనిట్‌ను ఐఓసీఎల్ విస్తరించనుంది. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు సీపీఆర్‌పై శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు సహకరించనుంది. హైదరాబాద్ బస్ భవన్‌లో బుధవారం తార్నాక ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్ విస్తరణకు సంబంధించిన ఒప్పందం టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమక్షంలో జరిగింది.
ఐఓసీఎల్, నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. తార్నాక ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌ను విస్తరిస్తున్నామని, అందుకు సహకరిస్తున్న ఐఓసీఎల్ యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలో క్యాథ్‌ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవోసీఎల్ ప్రతినిధులు ఎస్‌సీ మెస్‌రాం, పి.కైలాశ్ కాంత్, వీవీఎస్ చక్రవర్తి, నిర్మాణ్ డాట్ ఓఆర్‌జీ సీవోవో పుల్లా అనురాధతో పాటు తార్నాక ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.