ఈసారి ఎంత కొడతారో.. ఇవాళ ( మార్చి 27 ) ఉప్పల్‌‌‌‌లో లక్నోతో సన్‌‌‌‌ రైజర్స్ మ్యాచ్‌‌‌‌

ఈసారి ఎంత కొడతారో.. ఇవాళ ( మార్చి 27 ) ఉప్పల్‌‌‌‌లో లక్నోతో సన్‌‌‌‌ రైజర్స్ మ్యాచ్‌‌‌‌
  • రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్‌‌‌‌18వ సీజన్‌‌‌‌ను పరుగుల మోతతో ఆరంభించిన సన్‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్ ఫోర్లు, సిక్సర్ల వర్షంతో  భాగ్యనగర అభిమానులను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే తమ రెండో మ్యాచ్‌‌‌‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌తో తొలి పోరులో దుమ్మురేపిన రైజర్స్ బ్యాటర్లు.. ఇప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఎల్‌‌‌‌ఎస్జీ బౌలింగ్‌‌‌‌ను ఉతికేయాలని చూస్తున్నారు. కొత్తగా టీమ్‌‌‌‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్ సెంచరీతో కదం తొక్కడంతో లీగ్‌‌‌‌లో రెండో అత్యధిక స్కోరు (286/6) చేసిన సన్ రైజర్స్‌‌‌‌ 44 రన్స్ తేడాతో ఆ టీమ్‌‌‌‌ను చిత్తు చేసింది. 

అదే జోరును కొనసాగించి వరుసగా రెండో విక్టరీ సాధించాలని కమిన్స్‌‌‌‌సేన కృత నిశ్చయంతో ఉంది. తొలి పోరులో ఇషాన్‌‌‌‌, ట్రావిస్ హెడ్ మెరుపులతో భారీ స్కోరు చేసిన రైజర్స్‌‌‌‌ ఈసారి అభిషేక్‌‌‌‌ శర్మ, క్లాసెన్‌‌‌‌, నితీశ్ రెడ్డి కూడా దంచికొడితే లీగ్‌‌‌‌లో తమ పేరిటే ఉన్న హయ్యెస్ట్ స్కోరు రికార్డును బద్దలు కొట్టొచ్చు. అయితే గత పోరులో సన్ రైజర్స్ బౌలర్లు కూడా ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నారు. లక్నో జట్టులోనూ భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ మెరుగవాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడిన కొత్త కెప్టెన్ రిషబ్‌ పంత్ నేతృత్వంలోని లక్నో  తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. 

ఆ మ్యాచ్‌‌‌‌లో లక్నో మిడిల్ ఓవర్లలో ఒత్తిడికి గురైంది. 66  రన్స్‌‌‌‌ తేడాతో ఆరు వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు చేయలేకపోయింది. బౌలింగ్‌‌‌‌ వైఫల్యంతో 210 టార్గెట్‌‌‌‌ను కాపాడుకోలేకపోయింది.  ఇప్పుడు రైజర్స్‌‌‌‌ టీమ్‌‌‌‌లో లీగ్‌‌‌‌లోనే  అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ యూనిట్ ఉంది కాబట్టి  లక్నో బౌలర్లు మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌ చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌, బౌలర్లు శార్దూల్‌ ఠాకూర్‌‌, సిద్ధార్థ్, దిగ్వేశ్ రాథి కీలకం కానున్నారు. ఢిల్లీపై రాణించిన పూరన్, మిచెల్ మార్ష్ పై భారీ అంచనాలున్నాయి. లక్నో కెప్టెన్‌‌‌‌గా  తన తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో డకౌటై నిరాశపరిచిన పంత్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

ఆటకు ముందు తమన్‌‌ పాట

ఈ మ్యాచ్‌‌కు గంట  ముందు ఉప్పల్ స్టేడియంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌‌ మ్యూజిక్ కన్సర్ట్‌‌ అభిమానులను అలరించనుంది. ఐపీఎల్‌‌కు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాల్లో  ఆరంభ వేడుకల్లో భాగంగా ఈ ఈవెంట్‌‌ జరగనుంది.