వలస నేతలకు  స్థానిక పదవులతో ఎర

  • తమకు మెజారిటీ తెచ్చిన వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే అభ్యర్థుల కండిషన్లు
  • స్థానిక సంస్థల పదవులపై వలస నేతల ఆశలు
  • అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇదీ పరిస్థితి

నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వలస వచ్చిన నేతలకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు స్థానిక పదవులను ఎరగా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన లీడర్లకే మళ్లీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి, భారీ మెజారిటీ సాధించే లోకల్​ లీడర్లకే పార్టీలో, పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోరు జరుగుతున్న సెగ్మెంట్లలో స్థానిక సంస్థల పదవులపై ముందస్తు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థల మీద ఎమ్మెల్యేలదే పెత్తనం కావడంతో లోకల్​ లీడర్లు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్​ నుంచి  కాంగ్రెస్ లో చేరిన స్థానిక లీడర్లు ఒక అడుగు ముందంజలో ఉన్నారు. సిట్టింగ్​ ఎమ్మెల్యేలు మళ్లీ గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనతో స్థానిక ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలను సవాల్​గా తీసుకున్నారు. సిట్టింగులను ఓడించేందుకు గ్రామాల్లో ఎన్నికల ప్రణాళిక అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్​గా సిట్టింగులు సైతం కాంగ్రెస్​లో అసమ్మతి వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్​ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, స్థానిక పదవులను మీకే కట్టబెడతామని అసంతృప్తులకు హామీ ఇస్తున్నారు. 

కలిసొచ్చిన రెండు టర్ముల రిజర్వేషన్లు

వలస నేతల్లో ఎక్కువగా మున్సిపల్​ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వారిలో చాలా మంది మరోసారి స్థానిక పదవులపై ఆశపెట్టుకున్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రెండు టర్ముల వరకు ఒకే కేటగిరికి వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం రూలింగ్​ పార్టీ ఎమ్మెల్యేలకు అస్త్రంగా మారింది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్​ ఎన్నికలు జరిగాయి. దీనిలో భాగంగా ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో కొన్ని సవరణలు చేసింది. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్చే పని లేకుండా రెండు టర్ముల వరకు ఒకే రిజర్వేషన్​ ఉండే విధంగా ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే, వచ్చే ఏడాది జూన్​లో జడ్పీ, మండల పరిషత్​ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది. వచ్చే ఏడాది ఆఖరులో మున్సిపల్​ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. బీఆర్ఎస్​ సర్కార్​ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, ఎమ్మెల్యేల మితిమీరిన పెత్తనం వల్ల ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయిన చాలా మంది లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. అప్పట్లో కాంగ్రెస్​ నుంచి బీఆర్ఎస్​లో చేరడంతో ఈ ఐదేళ్లు రాజకీయంగా దెబ్బతిన్న నాయకులు.. బీఆర్ఎస్​ గుర్తుపై గెలిచినా ఎమ్మెల్యేల వేధింపులు భరించలేక కాంగ్రెస్​లో చేరారు. ఇలా పార్టీల్లో చేరుతున్న వలస లీడర్లకు అధికార, ప్రతిపక్షాల అభ్యర్థులు కొత్తగా కొన్ని షరతులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ఎమ్మెల్యేను గెలిపిస్తేనే స్థానిక పదవులు

స్థానిక సంస్థల పదవులు మళ్లీ మీ సొంతం కావాలంటే ముందుగా తమను గెలిపించడంపైనే ఫోకస్​ పెట్టాలని వలస నేతలకు ఎమ్మెల్యేలు షరతులు పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం కష్టపడిన లీడర్లు, ప్రత్యర్థి కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చిన లీడర్లకు స్థానిక పదవుల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎంపీపీ, జడ్పీ చైర్మన్, ము న్సిపల్​ చైర్మన్, కార్పొరేషన్​ చైర్మన్​ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఎమ్మెల్యేలు ఈ కండిషన్లు పెడుతున్నారు. నల్గొండ జడ్పీ చైర్మన్​ పదవి కోసం అప్పుడే ఒప్పందాలు జరిగిపోయాయి. బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన తిప్పర్తి జడ్పీటీసీ పాశం రామిరెడ్డికి కాంగ్రెస్​ నేతలు జడ్పీ చైర్మన్​ పదవి ఆఫర్​ చేయగా, దీనికి కౌంటర్​గా అదే మండలానికి చెందిన కాంగ్రెస్​ మాజీ జడ్పీటీసీ  సైదులు గౌడ్​కు ఎమ్మెల్యే కంచర్ల  భూపాల్​ రెడ్డి కూడా జడ్పీ చైర్మన్​ పదవి ఆఫర్​ చేశారు. దీంతో ప్రస్తుతం తిప్పర్తి మండలంలో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నడుమ పెద్ద యుద్ధమే జరుగుతోంది. మెజారిటీ తెచ్చిన వాళ్లకే చైర్మన్​ పీఠం దక్కే అవకాశం ఉండడంతో ఇరు వర్గాలు పోటాపోటీగా ఎమ్మెల్యేల గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అంతేగాక సొంతంగా ఎన్నికల ఖర్చు భరించేందుకూ వెనుకాడట్లేదు. 

గెలవకపోతే అంతే సంగతి

స్థానిక పదవులు తప్పక వస్తాయన్న ఆశతో పార్టీలు మారిన లీడర్లు తాము అనుకున్న ప్రభుత్వం రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటనే దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరైతే గవర్నమెంట్​ రాకపోయినా పర్వాలేదు కానీ, ఎమ్మెల్యే గెలవడానికి మాత్రం వీల్లేదని కంకణం కట్టుకున్నారు. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేతో పాటు, సర్కారు కూడా వస్తే రాజకీయంగా తమకు ఎదురు ఉండదన్న ధీమాతో ఉన్నారు. అంతిమంగా ఎమ్మెల్యేలనే లక్ష్యంగా చేసుకుని స్థానిక నేతలు గ్రామ స్థాయిలో పావులు కదుపుతున్నారు. పార్టీ మారడం వల్ల తమ సత్తా ఏమిటో రూలింగ్​ పార్టీ ఎమ్మెల్యేలకు తెలిసొచ్చేలా తగిన గుణపాఠం చెబుతామని పలువురు సీనియర్​ నేతలు శపథం చేస్తున్నారు.