ఖర్చులు, అప్పులు తగ్గాలి.. ఆదాయం పెరగాలి.. బడ్జెట్​పై కేంద్రానికి ఇండియా రేటింగ్స్‌‌ సూచన

ఖర్చులు, అప్పులు తగ్గాలి.. ఆదాయం పెరగాలి.. బడ్జెట్​పై కేంద్రానికి ఇండియా రేటింగ్స్‌‌  సూచన

న్యూఢిల్లీ:  ఆదాయాన్ని పెంచుకోవడం,  ఖర్చులను తగ్గించుకోవడం (ఫిస్కల్ కన్సాలిడేషన్‌‌‌‌) పై ఫోకస్ పెడుతూనే వినియోగాన్ని , క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌ను   పెంచేలా రానున్న బడ్జెట్ ఉండాలని ఇండియా రేటింగ్స్ కేంద్రానికి సలహా ఇచ్చింది.  

ప్రస్తుత ఆర్థిక  సంవత్సరంలో  ఫిస్కల్ డెఫిసిట్‌‌ (ఖర్చులు మైనస్ ఆదాయం) ను జీడీపీలో   4.5 శాతానికి తగ్గించుకోవాలని కిందటేడాది బడ్జెట్‌‌లో  ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. రానున్న బడ్జెట్‌‌లో కూడా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవడంపై ఫోకస్‌‌ పెట్టాలని ఇండియా రేటింగ్స్ సలహా ఇచ్చింది.  ‘పెట్టుకున్న టార్గెట్‌‌లకు అనుగుణంగా  ఫిస్కల్  క్రెడిబిలిటీని మెరుగుపరుచుకోవాలి. 

దేశ ఆర్థిక పరిస్థితిని చెక్ చేసేటప్పుడు ఇన్వెస్టర్లు దీనిని గమనిస్తారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా  ఇబ్బంది పెడుతున్న ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కంట్రోల్ చేయడానికి ఇది సాయపడుతుంది’ అని  వివరించింది. ఇండియా రేటింగ్స్ ప్రకారం, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో వినియోగం పడిపోవడానికి కారణం ఇన్‌‌ఫ్లేషన్ గరిష్టాల్లో ఉండడమే.   వినియోగం పుంజుకునేంత వరకు ఇన్వెస్ట్ చేయడాన్ని ఆపాలని కంపెనీలు భావిస్తున్నాయి. రానున్న బడ్జెట్‌‌లో ఇన్‌‌కమ్ ట్యాక్స్​  రిలీఫ్స్ ఇస్తే వినియోగాన్ని పెంచొచ్చు. 

రోడ్​మ్యాప్​ను తయారు చేయండి

గత రెండు క్వార్టర్లుగా జీడీపీ గ్రోత్ రేటు నెమ్మదించింది. షార్ట్‌‌, లాంగ్ టెర్మ్‌‌  వృద్ధిని పెంచేలా  కొత్త బడ్జెట్‌‌ ఉండాలని ఇండియా రేటింగ్స్  పేర్కొంది.  ఆదాయం పెంచుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం (ఫిస్కల్ కన్సాలిడేషన్‌‌)  కోసం ఓ రోడ్‌‌మ్యాప్‌‌ను రెడీ చేయాలని, వినియోగాన్ని పెంచాలని, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ పెంచేందుకు, మాన్యుఫాక్చరింగ్‌‌  సెక్టార్‌‌‌‌ ‌‌ కోసం ఖర్చు చేయాలని  వివరించింది. 

ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను పెంచడంపై  2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది.  సప్లయ్ చెయిన్‌‌ను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. 2025–26 బడ్జెట్‌‌లో కూడా ఇదే ట్రెండ్‌‌ను ఫాలో కావాలని ఇండియా రేటింగ్స్ సలహా ఇచ్చింది. 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి మళ్లీ ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్‌‌మ్యాప్‌‌ను మార్చాలని పేర్కొంది. 

ఈ సంస్థ  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియా నామినల్ జీడీపీ  10.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.  ఫిస్కల్ డెఫిసిట్‌‌  జీడీపీలో  4.5 శాతం దిగువకు వస్తుందని నమ్ముతోంది.  కేంద్ర ప్రభుత్వ అప్పులు కూడా  2025–26 లో జీడీపీలో 56.3 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. కిందటేడాది జూన్ బడ్జెట్‌‌లో  కేంద్ర అప్పులు జీడీపీలో 56.8 శాతానికి తగ్గించుకోవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇండియా రేటింగ్స్ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పులు 57.2 శాతంగా ఉంటాయని అంచనా వేస్తోంది. కాగా, కొత్త బడ్జెట్ సైజ్  రూ.326.35 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.