ప్రాజెక్టుల్లో పూడికతీతతో రూ.1,439 కోట్లు!

  • పనుల విలువపై అంచనా వేసిన ఇరిగేషన్​ శాఖ
  • తొలుత కడెం, లోయర్, మిడ్​మానేరులో పూడికతీత టెండర్లకు నోటిఫికేషన్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నదుల పూడికతీతతో వచ్చే రాబడి/ఖర్చుపై ఇరిగేషన్​ శాఖ అంచనాలను రూపొందించింది. పైలెట్​ప్రాజెక్టుగా కడెం, లోయర్​మానేరు, మిడ్​మానేరు డ్యామ్​లలో పూడికను తీయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు ప్రాజెక్టుల్లో పూడికతీత పనుల విలువ రూ.1,439.55 కోట్లు అని అంచనా వేసింది. ఆ పనుల కోసం ఈ టెండర్లను పిలుస్తూ కరీంనగర్​ ఎస్​ఈ  నోటిఫికేషన్​ జారీ చేశారు. ఈ నెల 4న టెండర్లను ప్రారంభించగా.. టెండర్లు దాఖలు చేసేందుకు 21వరకు గడువిచ్చారు. 

ఈ నెల 20 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్​ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 20 ఏండ్ల టైం బాండ్​తో ఆయా నదుల్లో పూడికతీత పనులను చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా మూడు ప్రాజెక్టుల్లోనూ 4.26 కోట్ల టన్నుల పూడికను తీయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. పనుల విలువకు అంచనా కట్టిన సొమ్మును ప్రభుత్వానికి సదరు సంస్థలు జమ చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ 20 ఏండ్ల కాలంలో పూడికను తీయడం ద్వారా సదరు సంస్థలు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అంటున్నారు. 

కడెంలోనే ఎక్కువ పూడిక..

మూడింట్లో కడెం ప్రాజెక్టులోనే భారీగా పూడికపేరుకుపోయినట్టు అధికారులు చెప్తున్నారు. దాదాపు 70 శాతం మేర ప్రాజెక్టులో పూడిక ఉందంటున్నారు. ఈ పూడికతోనే ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతున్నదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పూడికను తీస్తే ఆ ప్రాజెక్టు కింద ఉన్న 68 వేల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూడిక సమస్యతో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇటీవల వచ్చిన వరదలకు గేటు కొట్టుకుపోవడంతో రూ.10 కోట్లతో కాంగ్రెస్​ సర్కారు రిపేర్లు చేయించింది. 

దీంతో ఈ యాసంగికి ప్రాజెక్టు కింద ఉన్న 42 డిస్ట్రిబ్యూటరీల ద్వారా 16 వేల ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. లోయర్​ మానేరు, మిడ్​ మానేరు డ్యామ్​లలోనూ పూడిక ఉన్నా.. తీవ్రత మాత్రం అంతగా లేదని చెప్తున్నారు. పైలెట్​ ప్రాజెక్టుగానే వాటిని తీసుకున్నామని, వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర ప్రాజెక్టుల్లోనూ పూడికతీతను చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.