ఇయ్యాల కాళేశ్వరం బ్యారేజీ వద్దకు నిపుణుల టీమ్

ఇయ్యాల  కాళేశ్వరం బ్యారేజీ వద్దకు నిపుణుల టీమ్
  • తొలుత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సీడబ్ల్యూపీఆర్​ఎస్ బృందం స్టడీ 
  • ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ  వద్ద పరీక్షలు
  • రెండు రోజుల తర్వాత ఎన్​జీఆర్ఐ, సీఎస్ఎంఆర్ఎస్​ నిపుణులు కూడా
  • మేడిగడ్డ ఎగువన జియోట్యూబ్స్​ ఏర్పాటుకు నిర్ణయం
  • 15 రోజుల్లో పనులు పూర్తి చేసేలా రాష్ట్ర సర్కారు కసరత్తు 

హైదరాబాద్, వెలుగు:  పుణె నుంచి వస్తున్న సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ సెంటర్​(సీడబ్ల్యూపీఆర్ఎస్)కు చెందిన నిపుణులు కాళేశ్వరం బ్యారేజీలను బుధవారం పరిశీలించనున్నారు. సీడబ్ల్యూపీఆర్ఎస్​కు చెందిన ముగ్గురు టెక్నికల్​ నిపుణులు బ్యారేజీలను పరిశీలిస్తారని అధికారులు చెప్పారు. అక్కడ ఎన్డీటీ (నాన్​ డిస్ట్రక్టివ్​ టెస్ట్స్​)తో పాటు జియోఫిజికల్​, జియో టెక్నికల్​ టెస్టులు చేస్తారని వెల్లడించారు. ఫ్లడ్​కు తగ్గట్టు ఇప్పుడున్న సిమెంట్​ బ్లాకులు, బ్యారేజీలోని నిర్మాణాలు తట్టుకుంటాయా? లేదా? అని పరీక్షిస్తారని చెప్పారు. తొలుత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద టెస్ట్​లు చేస్తారని అధికారులు చెప్తున్నారు. మరోవైపు నేషనల్​ జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (ఎన్​జీఆర్ఐ), ఢిల్లీకి చెందిన సెంట్రల్​ సాయిల్ అండ్​ మెటీరియల్ ​రీసెర్చ్​ స్టేషన్​ (సీఎస్ఎంఆర్ఎస్​)ల నిపుణులు రెండు రోజుల తర్వాత బ్యారేజీల వద్ద టెస్టులు చేస్తారని, దానికి సంబంధించిన ప్రజెంటేషన్​ ఇస్తారని పేర్కొంటున్నారు. కాగా, మూడు బ్యారేజీల వద్ద రిపేర్ల పనులు, ఖర్చులను నిర్మాణ సంస్థలే భరించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. 

మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన జియోట్యూబ్స్​

మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన వరదకు అడ్డుకట్టగా, పంప్​హౌస్​లకు నీటిని ఎత్తిపోసేలా జియోట్యూబ్స్​తో ఓ తాత్కాలిక గోడను నిర్మించనున్నట్టు అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 17 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్ హౌస్​ల హెడ్​రెగ్యులేటర్​ దగ్గర ఈ జియోట్యూబ్​లను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. 500 మీటర్ల పొడవున రెండున్నర మీటర్ల ఎత్తుతో వీటిని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఆ ఎత్తు నుంచి నీళ్లను పంప్​చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా పంప్​హౌస్​ల నుంచి నీళ్లు ఎత్తిపోసుకునేలా అన్నారం వద్ద 11 మీటర్లు, సుందిళ్ల వద్ద 9 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ జియోట్యూబ్​లు అల్ట్రావయొలెట్​ కిరణాలను కూడా తట్టుకుంటాయని తెలిపారు. దాదాపు 30 నుంచి 40 ఏండ్లపాటు మన్నుతాయని, ఓసారి వాడాక తిరిగి వాడుకోవడానికీ వీలుంటుందని స్పష్టం చేస్తున్నారు. అసోంలో బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చినప్పుడు ఈ జియోట్యూబ్​లను వాడినట్టు అధికారులు చెప్తున్నారు. వాటిని ఈఎన్​సీ (ఓ అండ్​ ఎం) నాగేందర్​ రావు నేతృత్వంలోని ఇరిగేషన్​ అధికారులు పరిశీలించారని  తెలిపారు. దీంతో ఈ జియోట్యూబ్​లనే మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఏర్పాటు చేయనున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి సంస్థ రెండు రోజుల్లో ప్రజెంటేషన్​ ఇవ్వనుందని వెల్లడించారు. 

15 రోజుల్లో పూర్తయ్యేలా 

కాళేశ్వరంలోని బ్యారేజీల వద్ద రిపేర్లు, టెస్టులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 15 రోజుల్లో పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంపై తుఫాన్​ ఎఫెక్ట్​ ఉంటుందని అంచనా వేసినా.. ఇప్పుడు ఆ ముప్పు తప్పిపోవడంతో ఆ టైంలోపు పనులను పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు. వరదలతో పాడైపోయిన కన్నెపల్లి పంప్​హౌస్​లోని మోటర్లు, అన్నారంలోని రెండు మోటర్లనూ రిపేర్​ చేసి సిద్ధం చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) నిపుణుల కమిటీ సూచించిన చర్యలను చేపట్టడం, ఆ పనులను పర్యవేక్షించడం కోసం ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈఎన్​సీ (జనరల్​) అనిల్​ కుమార్​ చైర్మన్​గా కమిటీ వేశారు. ఈఎన్​సీ (ఓ అండ్​ఎం) నాగేందర్​ రావు, సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ (సీడీవో), రామగుండం సీఈలు సభ్యులుగా ఉండనున్నారు. ఈఎన్​సీ (జనరల్​) అవసరమనుకుంటే మరో ఇద్దరు టెక్నికల్​ నిపుణులనూ కమిటీలో చేర్చుకునేందుకు అవకాశం ఇచ్చారు.