- ఉద్యోగ కల్పనపై రానున్న బడ్జెట్‌లో ఫోకస్ పెట్టాలంటున్న నిపుణులు
- ఇండస్ట్రీ హోదా కావాలంటున్న హాస్పిటాలిటీ సెక్టార్
- ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్ సులభతరం చేయాలి: స్టార్టప్‌లు
న్యూఢిల్లీ: కొత్త ఉద్యోగాలను కల్పించడంపై ఫోకస్ పెట్టాలని, అప్పుడే జీడీపీ ఏడాదికి 7–8 శాతం వృద్ధి సాధించగలుగుతుందని ప్రభుత్వానికి నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఎంఎస్‌ఎంఈ, ఎడ్‌టెక్ సెక్టార్లకు రానున్న బడ్జెట్‌లో భారీగా ప్రోత్సాహకాలు అందివ్వాలని కోరుతున్నారు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఉద్యోగ కల్పనలో హాస్పిటాలిటీ (టూరిజం, హోటల్స్, రిసార్ట్స్ వంటివి) సెక్టార్ కీలకంగా ఉందని నూర్‌మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ‘హాస్పిటాలిటీ సెక్టార్‌కు ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఈ స్టేటస్ వస్తే అప్పులు తీసుకోవడం మరింత ఈజీగా మారుతుంది. అలానే టూరిజాన్ని మెరుగ్గా డెవలప్ చేయొచ్చు’ అని చౌదరి వివరించారు.
2047 నాటికి జీడీపీలో టూరిజం సెక్టార్ వాటా 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి రానున్న బడ్జెట్‌లో పునాది వేయాలని కోరారు. దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడంతో టూరిజం సెక్టార్‌ను మెరుగుపరచొచ్చు. ముఖ్యంగా టైర్ 2, 3 సిటీలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు.
స్టార్టప్‌లతో ఎక్కువ ఉద్యోగాలు
ఉద్యోగాలను భారీగా క్రియేట్ చేయాలంటే స్టార్టప్‌లకు ప్రభుత్వం సపోర్ట్‌గా ఉండడం ముఖ్యం. స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోలకు రానున్న బడ్జెట్‌లో కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ ఫౌండర్ గౌరవ్ గగ్గర్ పేర్కొన్నారు. ఫండింగ్ అందుకోవడంలో స్టార్టప్‌లు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.
‘ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేయడంతో ఇన్వెస్ట్‌మెంట్లు స్టార్టప్‌లలోకి వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని చర్యలను రానున్న బడ్జెట్‌లో తీసుకోవాలి’ అని కోరారు. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్‌ను సులభతరం చేయాలని, అప్పులు పొందడం మరింత ఈజీగా మార్చాలని సలహా ఇచ్చారు.
ALSO READ : ఆ కారం పొడి కొనొద్దు: పతంజలి
రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్‌లోకి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లతో ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయని, ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌పై కూడా ఫోకస్ పెట్టాలని పేర్కొన్నారు.
ఇంకో ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీగా మారాలంటే ఇండియా ఉద్యోగ కల్పనపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈఓ గగన్ అరోరా అన్నారు. అప్పుడే జీడీపీ గ్రోత్ ఏడాదికి 7 శాతం నుంచి 8 శాతం వృద్ధి చెందగలుగుతుందని తెలిపారు.