సాగునీటికి చతుర్విధ జల ప్రక్రియ అవసరం

సాగునీటికి చతుర్విధ జల ప్రక్రియ అవసరం

ఆనాటి కాకతీయుల కాలం నుంచి ‘జలసిరులు’ తిరుగులేని వైభవానికి ప్రతీకలుగా నేటికీ స్వర్ణయుగాన్ని తలపిస్తున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై,  అటు ప్రజలపైన ఉన్నది.  సమాజానికి, పంటలకు, పశువులు, పక్షులు,  అడవులకు అన్నింటికీ  నీరే జీవనాధారం. మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుందని శాస్త్రీయ అంచనాలు.  దేశంలో,  రాష్ట్రంలో  పర్వతాలు,  నదులు జీవనాధారంగా ఉన్నవి.  వీటితోపాటు వర్షపు  నీటిని  ఎక్కడికి అక్కడ ఆపి, చెరువులుగా మార్చి.. సాగు, తాగునీటికి కొరతలేకుండా ఆనాటి కాకతీయులు మనకు అందించారు.  నేడు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక గ్రావిటీ ఆధారంగా వచ్చే నీటిని వదిలి,  అత్యంత ఖర్చుతో కూడుకున్న లిఫ్ట్​ ఇరిగేషన్ ప్రాజెక్టులు  నిర్మించడం ద్వారా  లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాం.  దీనికి తోడు విద్యుత్,  విద్యుత్​ మోటార్లు,   ప్రాజెక్టు నిర్వహణకు  ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన  పరిస్థితి.  అయినా,  ఖర్చుకు తగ్గ ఫలితాలు సాధించలేక  రాష్ట్రం  అప్పులపాలవుతున్నది.  గత పాలకుల కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రయోగంగా  మన కళ్లకు కనిపిస్తున్నది.    నీటి  లభ్యత  ఆధారంగా  సమగ్ర  పంటల  ప్రణాళికలు ఉండాలని నిపుణులు చెపుతున్నారు. 

కాకతీయులు.. తాగు, సాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చి కరువు బారిన  పడకుండా ప్రజలను రక్షించి అన్నం పెట్టారు.  తెలుగు నేలను అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, దాని వర్షాధారమే జీవనాధారంగా కాకతీయులు  తెలుగు నేలపై  లక్షలాది  చెరువులు నిర్మించి  నీటి పారుదల సౌకర్యం కల్పించారు.  రామప్ప,  లక్నవరం, పాకాల వంటి అనేక మధ్యతరహా  సాగునీటి చెరువులను ప్రకృతి సిద్ధంగా నిర్మించారు. ‘రిడ్జ్ టు రివర్​’ ఆదర్శంతో  గొలుసుకట్టు చెరువులు నిర్మించారు.  వర్షపు నీటిని ఎక్కడికి అక్కడ గొలుసుకట్టి  నిల్వ చేశారు.  ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ చెరువులు నిర్మించారు. కాకతీయుల నీటి నిర్వహణ దేశంలో ఇప్పటికీ ఎక్కడా కనిపించదనడంలో ఆశ్చర్యం లేదు. 

కాకతీయుల రిడ్జ్​ టు రివర్​ విధానం గొప్పది

శిఖరంలో రాక్​ ఫీల్డ్​ డ్యామ్స్,  పాండ్స్ నిర్మించి  భూముల కోత పడకుండా,  ఇసుక రాకుండా,  ప్రణాళికాబద్ధంగా నిర్మించి వరదలను అరికట్టారు. ఆనాటి చెరువులు నేటికీ ఇసుక రాకుండా కట్టలు, తూములు,  మత్తడిలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.  ఇవి కాకతీయుల గొప్ప సామాజిక స్పృహగా చెప్పుకుంటున్నాం. చెరువులకు  అప్రోచ్​ కాలువలు, చెరువుల వెనకాల పంట కాలువలు, అద్భుతంగా నిర్మించారు. ఎక్కువైన నీరు కాలువల ద్వారా వాగులోకి, వాగుల నుంచి నదుల్లోకి వెళ్లేవిధంగా నిర్మించారు. కానీ,  నేడు వర్షపు నీటిని వాగుల ద్వారా నదిలోకి వెళ్లాక లిఫ్టుల ద్వారా పైకి తీసుకొస్తున్నారు. కాకతీయులు సహజసిద్ధంగా  రిడ్జ్​ టు రివర్​ విధానాన్ని  పాటిస్తే  గత పాలకులు రివర్​టు రిడ్జ్​ విధానాన్ని పాటించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. 

చతుర్విధ జల ప్రక్రియ 

పర్యావరణంతో కూడుకున్న అభివృద్ధి కొనసాగిస్తే  అభివృద్ధికి, పర్యావరణానికి ఘర్షణ ఉండదనేది పర్యావరణవేత్తల అభిప్రాయం. ప్రముఖ ఇంజినీర్, కీర్తిశేషుడు హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియను ఆవిష్కరించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లారు.  మన  రాష్ట్రంలో  కూడా రైతులు, సాగునీటి నిపుణుల సమక్షంలో అనేక ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాజస్తాన్​లో  అప్పటి  సీఎం వసుంధర రాజే సింధియా మొదట  రెండు  జిల్లాల్లో  ప్రయోగాత్మకంగా  చేపట్టారు. ఆ తర్వాత 13 జిల్లాలకు  విస్తరించారు.  అనంతరం 50 జిల్లాల్లో చతుర్విధ జల ప్రక్రియను కొనసాగించి రాజస్తాన్​ నీటికొరతను అధిగమించింది.

తెలంగాణలో చతుర్విధ జల ప్రక్రియ సాధ్యమే

జహీరాబాద్​లోని గొట్టిగార్​పల్లి గ్రామం వద్ద ఈ చతుర్విధ జల ప్రక్రియను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైంది. లిఫ్ట్​ఇరిగేషన్​లు  అధిక ఖర్చుతో కూడుకున్నవి.  ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో, ప్రజల భాగస్వామ్యంతో చతుర్విధ జల ప్రక్రియను ఆయా ప్రాంతాలలో ప్రణాళికాబద్దంగా చేపట్టడం మంచిది. రైతులకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి హామీ పథకాన్ని  అనుసంధానించి చతుర్విధ జలప్రక్రియను ముందుకు తీసుకెళితే మంచి ఫలితాలు ఉంటాయి. మన తెలంగాణ సమతల భూమి కాదు. కావున కాకతీయుల రిడ్జ్​ టు రివర్​ విధానం, హన్మంతరావు రిడ్జి టు వ్యాలి, చతుర్విధ జల ప్రక్రియ లాంటివి చేపట్టాలి. ఈ విధానాల ద్వార ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. పంటల అవసరాన్ని బట్టి నీటి లభ్యతను సమకూర్చాలి. మొత్తం మీద  తెలంగాణలో ఆయా ప్రాంతాల నైసర్గిక పరిస్థితులను బట్టి చతుర్విధ జల ప్రక్రియ సాధ్యమే. కాళేశ్వరం లాంటి భారీ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుతో ఒక చేదు అనుభవం తెలంగాణకు ఇప్ప
టికే ఉంది. కాబట్టి, హనుమంతరావు సూచించిన చతుర్విధ జల ప్రక్రియకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సులభ ప్రయోగాలు

రిడ్జ్ టు వ్యాలీ (శిఖరం నుంచి లోయ) విధానంతో,   ప్రజల భాగస్వామ్యంతో  ఎలాంటి  సిమెంట్  కాంక్రీట్​ లేకుండా  ఒక వాటర్​ షెడ్​ ఏరియాను సృష్టించడం, ప్రజలే దానిని నిర్వహించుకునే విధంగా ప్రణాళిక రూపొందించడం ఇందులోని  ప్రధానాంశం.  చతుర్విధ  జల ప్రక్రియలో నాలుగు అంశాలు ప్రధానమైనవి. అవి 1. వాననీటిని నిలువరించడం. 2. భూగర్భంలోకి నీటిని పంపడం. 3. లోయ ఉపరితలంలో నీటిని నిల్వ చేయడం. 4. భూమిలో తేమను కాపాడటం.  

- నరహరి వేణుగోపాల్​రెడ్డి,
రాష్ట్ర బీజేపీ సీనియర్​ నాయకుడు