కడెం ప్రాజెక్టుకు కొత్త గేట్లు పెట్టాలె: నిపుణులు

కడెం ప్రాజెక్టుకు కొత్త గేట్లు పెట్టాలె: నిపుణులు
  • అదనంగా స్పిల్​వే నిర్మించాలె  
  • గోదావరి వరద ముంపు గ్రామాలను తరలించాలె 
  • ఇరిగేషన్​ హైలెవల్​మీటింగ్​లో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టును రక్షించాలంటే దానికి కొత్త గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇంకో 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా అదనపు స్పిల్​వే నిర్మించాలని నిపుణులు సూచించారు. ‘గోదావరిలో వరదలు, కడెం ప్రాజెక్టు పరిస్థితి’పై  మంగళవారం జలసౌధలో ఇరిగేషన్​స్పెషల్​సీఎస్​రజత్​కుమార్​అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కడెం ప్రాజెక్టుపై వాసర్​ల్యాబ్స్​కన్సల్టెంట్​డాక్టర్​రామరాజు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లు ఓపెన్​ చేయడానికి కనీసం 2 గంటల సమయం పడుతుండగా ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల వరద చేరడానికి కేవలం గంట వ్యవధి మాత్రమే ఉందన్నారు. ప్రాజెక్టుకు ఎగువన 70 శాతం వర్షపాతం నమోదవుతుండటమే ఇందుకు కారణమన్నారు. ప్రాజెక్టు గేట్లు 65 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటిని ఓపెన్​చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని మార్చాలని సూచించారు. 

స్పిల్​వే డిశ్చార్జి కెపాసిటీ 3 లక్షల క్యూసెక్కులే కావడంతో 1.5 లక్షల క్యూసెక్కుల నుంచి 2 లక్షల క్యూసెక్కులు వదిలేలా అదనపు స్పిల్​వే ఏర్పాటు చేయాలని చెప్పారు. వరద ప్రభావాన్ని 12 గంటల ముందే అంచనా వేయడానికి డెసిషన్​సపోర్ట్​సిస్టం, ప్రాజెక్టుకు ఎగువన అధునాతన రివర్​గేజ్​లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశాల ఆధారంగా ప్రాజెక్టు రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఇంజనీర్లను రజత్​కుమార్​ఆదేశించారు. గోదావరిలో భారీ వరద పోటెత్తితే భద్రాచలం సమీప ప్రాంతాల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైనా మీటింగ్ లో సమీక్షించారు. 2022 సెప్టెంబర్​లో ఏర్పాటు చేసిన ఎక్స్​పర్ట్​కమిటీ నివేదికపై నివేదికపై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేసి నెల రోజుల్లోగా తుది నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, అనిల్​కుమార్, నాగేందర్​రావు, హరిరామ్, తదితరులు పాల్గొన్నారు.