మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఆర్టీసీ డిపోలోని డిస్పెన్సరీలో పేషెంట్లకు కాలం చెల్లిన మందులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. యాకూబ్‌ఖాన్ అనే డ్రైవర్కొంతకాలంగా బీపీతో బాధపడుతూ ప్రస్తుతం డిపోలో పని చేస్తున్నాడు. ఆర్టీసీ డెస్పెన్సరీలో నెలనెలా మందులు తీసుకొని వాడుతున్నాడు. బుధవారం డిస్పెన్సరీకి వెళ్లగా ఆయనకు ఈ ఏడాది జనవరిలోనే ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ఇచ్చారు. ఇంటికి వెళ్లిన తర్వాత అతడి కొడుకు దీన్ని గమనించాడు.
గురువారం డిస్పెన్సరీలో విషయం చెప్పడంతో వేరే మందులు ఇచ్చి పంపారు. ఎక్స్పైరీ మందులతో అతడికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ఈయూ డిపో సెక్రటరీ గోలి శంకర్ ప్రశ్నించారు. డిస్పెన్సరీలో డాక్టర్ పరంజ్యోతి కార్మికులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఫార్మాసిస్ట్ లేకపోవడంతో ఓ కండక్టర్‌తో మందులు ఇప్పిస్తున్నారని తెలిపారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఎక్స్పైరీ డేట్ చెక్చేయకుండా మందులు ఎలా ఇస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
డాక్టర్ పరంజ్యోతిని వివరణ కోరగా సిబ్బంది పొరపాటున ఎక్స్పైరీ అయిన మందులుఇచ్చారన్నారు. అయితే ఎనిమిది నెలల కిందట కాలం చెల్లిన మందులను ఎందుకు ఉంచారు? ఆ ట్యాబ్లెట్లను ఎంతమందికి ఇచ్చారు అన్నది తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.