8 మందిని కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దింపుతున్నాం: SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్

8 మందిని కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దింపుతున్నాం: SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్

ఎస్ఎల్బీసీ టన్నెల్‎లో 8 మంది చిక్కుకున్నారని, అందులో ఆరుగురు జేపీ అసోసియేట్ కార్మికులు, మరో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారని.. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాద స్థలాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లి.. 8.30 గంటలకు టన్నెల్ బోరింగ్ మిషన్ ఆన్ చేశారని తెలిపారు.

టన్నెల్ బోరింగ్ మిషన్ ఆన్ చేశాకే ప్రమాదం జరిగిందన్నారు. టన్నెల్‎లో ఒకవైపు నుంచి నీరు లీక్ అయ్యి  మట్టి కుంగిందని.. దీంతో అధికారులు ముందే అప్రమత్తమై కొందరు కార్మికులను బయటకు పంపించారని తెలిపారు. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసి గట్టారని చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని.. ఆర్మీతో కూడా మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. 

Also Read :- ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్

ఈ రాత్రి వరకు సంఘటనా స్థలికి భారత సైన్యం రెస్క్యూ టీంలు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. టన్నెల్ ప్రమాద నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇటీవల ఉత్తరఖండ్‎లో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు పాల్గొన్న రెస్క్యూ టీంను ఇక్కడికి రప్పిస్తున్నామని అన్నారు. టన్నెల్ లో చిక్కుకున్నవారిలో జార్ఖండ్, యూపీ వాసులు ఉన్నారని తెలిపారు. టన్నెల్ 14 కిలో మీటర్ల లోపల ఉన్నందున సహయక చర్యలు సవాల్‎గా మారాయని పేర్కొన్నారు.