- కాలిపోయిన ఇల్లు.. ఇద్దరికి గాయాలు
మెట్ పల్లి, వెలుగు : ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలి ఇల్లు కాలిపోగా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన ఎర్రం శంకర్, సుభద్ర దంపతులు శనివారం ఉదయం రోజులాగే ఇంటికి తాళం వేసి ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఉదయం శంకర్ ఇంట్లో నుంచి దట్టమైన పొగలు కమ్ముకొని మంటలు ఎగిసిపడ్డాయి. క్రమంగా మంటలు పెరిగి గ్యాస్ సిలిండర్లు పేలాయి.
భారీ శబ్ధం రావడంతోపాటు ఇంటి పైకప్పు, సిలిండర్ ముక్కలు ఎగిరిపడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుడు మొహమ్మద్ సాజిద్ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకొని నీళ్లు చల్లేందుకు ప్రయత్నించగా మరో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి.
అక్కడే ఉన్న జంగ దేవమ్మ (65)కు రేకుల ముక్కలు వచ్చి తగలడంతో తలకు గాయమైంది. తీవ్రంగా గాయపడిన సాజిద్‌ను నిజామాబాద్ హాస్పిటల్ తరలించారు. దేవమ్మను మెట్ పల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.