నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
హసన్ పర్తి, వెలుగు: వరంగల్ నగర శివారు ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు బైక్‌లతో పాటు రూ.27 వేల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీబీ కె.పుష్ప వివరాలు వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం, ఎండీ ఇమ్రాన్, ఎండీ యాకుబ్ పాషా, ఎండీ అభిద్ పాషాలు ఓ వెల్డింగ్ షాప్ లో పనిచేసేవారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 11న రాత్రి సమయంలో వీరు బైకులపై వెళ్లి ఆరేపల్లి నుంచి వంగపహడ్ గ్రామానికి వెళ్లే రోడ్డులో అగి ఉన్న ఆటోను గమనించారు. అందులో ఉన్న ఇద్దరిపై దాడి చేసి ఆటో డిక్కీలోని రూ.27 వేలు, ఒక సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీసీపీ పుష్ప పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీ ఇన్ స్పెక్టర్ బాబురావు, హసన్‌పర్తి సీఐ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుల కదలికలను గుర్తించారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం పైడిపల్లి నుంచి శాయిపేట వెళ్లే మార్గంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగలు ఉపయోగించిన బైక్‌లు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన ఏసీబీ బాబురావు, సీసీఎస్ హసన్ పర్తి సీఐ శ్రీధర్ రావు, ఎస్సై రవీందర్, పోలీస్ సిబ్బందిని వరంగల్ సీపీ అభినందించారు.