దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ సాగుతోంది. కరోనా కల్లోల పరిస్థితుల్లో అసలే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ఫీజుల దోపిడీతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. తమ పిల్లల భవిష్యత్ బాగుండాలన్న తపనతో ఆర్థికంగా కష్టాలు పడుతున్నా తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలోనే పిల్లలను చదివిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మేనేజ్మెంట్లు విద్యా వ్యాపారాన్ని యధేచ్చగా సాగిస్తున్నాయి. ఫిజికల్‌గా క్లాసులు లేకపోయినా, ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తున్నా ఫీజులను మాత్రం పూర్తి స్థాయిలోనే వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ అసమర్థత, అవినీతి అధికారుల అండదండలతో విద్యా వ్యాపారానికి దేశంలోనే తెలంగాణ అనుకూలమైనదిగా మారిందనే భావన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు జారీ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తమ ఆధిపత్యానికి ఎలాంటి సమస్య లేకుండా పాలకులను, అధికారులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మేనేజ్మెంట్లు సక్సెస్ అవుతున్నాయి. తల్లిదండ్రులు మాత్రం ఎప్పటిలాగే కార్పొరేట్ విద్యా సంస్థల మోసపూరిత ప్రకటనలతో తమ తాహతుకు మించి ఫీజులు చెల్లిస్తూ అప్పుల పాలవుతున్నారు.
కార్పొరేట్ సంస్థల ధనదాహం
రాష్ట్రంలో ఇంటర్ విద్య అంటే నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు మాత్రమే అనే స్థాయిలో ఆ సంస్థలు చేస్తున్న ప్రకటనలతో తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. వీటికి మరికొన్ని ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు జత కలిసి ఇంటర్ అంటే ఎంపీసీ, బైపీసీ మాత్రమే అనే స్థాయికి పరిస్థితిని తెచ్చాయంటే ఈ కార్పొరేట్ మేనేజ్మెంట్లు ఎంతగా వేళ్లూనుకుపోయాయో అర్థమవుతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకే పేరుతో వందల కాలేజీలు నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది తప్ప.. ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించి అపార్ట్మెంట్లలో కోచింగ్ సెంటర్ల పేరుతో ఇంటర్ క్లాసులు నడిపిస్తున్న కాలేజీలు హైదరాబాద్‌లో ఎన్నో ఉన్నాయి. అయినా వీటిపై ప్రభుత్వం, అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్రవ్యాప్తంగా పీఆర్వో వ్యవస్థ ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రులను మభ్య పెడుతూ టెన్త్ పూర్తి కాకముందే లేని పోటీని సృష్టిస్తున్నాయి. ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా ముందస్తుగా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్స్ మొత్తం నిర్వహించే స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహం కొనసాగుతోంది.
కరోనా కాలంలోనూ ఫీజు వత్తిళ్లు
కరోనా మహమ్మారి విజృంభణ, ఆ తర్వాత విధించిన లాక్డౌన్ తదితర పరిణామాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది సామాన్యుల జీవితాలపై ప్రభావం పడింది. వారు బతకడమే కష్టంగా మారింది. ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డునపడ్డ ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా సాధారణ పరిస్థితుల్లో మాదిరిగానే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యా వ్యాపారం చేస్తూ, తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి చేస్తూ ఆన్లైన్ క్లాసుల పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమే. ఒకవైపు తల్లిదండ్రులను బెదిరించి, వేధించి అధిక ఫీజులు వసూలు చేస్తూ.. మరోవైపు ఆన్లైన్ క్లాసుల కోసం 30% మంది ఫాకల్టీనే కొనసాగిస్తూ మిగిలిన వారందరినీ తొలగించాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రైవేటు టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయి.
అందరికీ ఒకేరకమైన ఫీజును నిర్ణయించాలె
విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించడం స్వాగతించాల్సిన అంశమే. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్వహణ ప్రణాళిక రూపొందించిందన్నదే సమాధానం లేని ప్రశ్న. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ క్లాసులు సగానికి పైగా స్టూడెంట్లకు అందలేదని పలు సర్వేలు వెల్లడించాయి. అయినా ప్రభుత్వం అదే తరహాలో నిర్లక్ష్యంతో ముందుకెళ్లడం విచారకరం. ప్రపంచం ముందెన్నడు ఇలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనలేదు. ఇటువంటి సమయంలో విద్యార్థుల భవిష్యత్ కు మొదటి ప్రాధాన్యతనిస్తూ విద్యావేత్తలు, మేధావులు, విద్యారంగంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న వారితో కూడిన కమిటీ ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలతో ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రకటనలతో విద్యార్థులకు నష్టం చేకూరుస్తోంది. ఇకనైనా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి. అందరికి ఒకే రకమైన ఫీజు నిర్ణయించి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నట్లుగా నిర్ణిత ఫీజు నిర్ణయించి సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి, అన్ని రకాల వసతులతో ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దాలి. అప్పుడే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య అందుతుంది. ఈ దిశగా అడుగులు వేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకుంటలేదు
గత ఏడాది ఏప్రిల్ లో కరోనా నేపథ్యంలో ఫీజులు పెంచొద్దని, ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని, అది కూడా నెలవారీగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రకటించారు. అయినా వాటిని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. సీఎం మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప ఎక్కడా అమలుకు నోచుకోలేదు. జీవో 46 జారీ చేసినా అసలు ట్యూషన్ ఫీజు నిర్వచనం చెప్పకుండా ఏ మేరకు ఫీజు తీసుకోవాలనేది నిర్ణయించకుండా ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈ ఏడాది మార్చిలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంస్థలు ముసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ విద్యా సంస్థలకే అన్నట్లుగా కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు రూల్స్ పాటించలేదు. తమ క్లాసులను యథావిధిగా కొనసాగించాయి. కరోనా తీవ్రత మరింత పెరిగినా ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి మరోసారి ముందస్తు అడ్మిషన్స్ చేపట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేసే తతంగానికి తెరలేపి ఇప్పటికే 50% ఫీజు వసూలు చేశారు. సమాజ సేవే లక్ష్యంగా, లాభాపేక్ష లేకుండా విద్యను అందించాల్సి ఉండగా.. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు, కార్పొరేట్ మేనేజ్మెంట్లు అబద్ధపు ప్రచారాలతో తల్లిదండ్రులను మోసం చేస్తూ వివిధ ఫీజుల పేరుతో లక్షల రూపాయలను దోచుకుంటున్నాయి. నిబంధలను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా ఫీజు వసూళ్లు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించకపోవడం దారుణం.