మనిషి అనారోగ్యం పాలైతే బాగు చేయడంలో డాక్టర్లు, మందులు, హాస్పిటల్స్, ల్యాబ్‌లు విలువైన పాత్ర పోషిస్తాయి. ధనార్జనే వీటి ధ్యేయమైతే, పరిస్థితి ఏమిటి? పేద, బడుగు బలహీన వర్గాలు ఆరోగ్యం కోసం డబ్బులు ఎక్కడి నుంచి తేగలరు? పేదోడి అనారోగ్య పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు, హాస్పిటళ్లను నియంత్రించే వ్యవస్థ కొరవడుతున్నది. ప్రభుత్వాల పర్యవేక్షణ లేమి మూలంగా పేద ప్రజల సొమ్ము హాస్పిటళ్ల పాలవుతోంది. నిబంధనలు పాటించని ల్యాబ్ లు, గాడి తప్పిన వైద్యం, నకిలీ డాక్టర్లు, మందుల కల్తీతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ మధ్య జరిగిన తనిఖీల్లో తేలింది. ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని రాసుకున్న భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఆ మధ్య గాంబియాలో 60 మందికి పైగా పిల్లల మరణాలకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న దగ్గు మందులే కారణమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, నకిలీ ఔషధాల వ్యాపారంతో అంతర్జాతీయంగా మన దేశం అప్రతిష్ట మూట కట్టుకుంది. అలాగే మన దేశంలో అల్లోపతి డాక్టర్లలో 57 శాతం వైద్య పరమైన అర్హతలు లేని వారేనని గణాంకాలు చాటుతున్నాయి.
ఇలా ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానాల్లో దోపిడీ, నకిలీ డాక్టర్లు, మందులు, అనుమతులు లేని రోగనిర్ధారణ కేంద్రా(ల్యాబు)లు పెరిగి ప్రజలకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. పేద ప్రజలు తాము చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బులతోపాటు అప్పు చేసి మరీ హాస్పిటల్స్, మందులు, ల్యాబుల ఫీజులు కడుతున్నారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ వైద్యానికి ఖర్చు అధికంగా అవుతున్నది. ఒకసారి అనారోగ్యం బారిన పడితే దవాఖానాల ఖర్చు తడిసి మోపెడౌతున్నది. తాజాగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం 2021’ కూడా ఇవే అంశాలను వెల్లడించింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయి వైద్య ఖర్చుల వివరాలు పేర్కొంది. ఆ రిపోర్టు ప్రకారం మన తెలంగాణలో సగటున 77.7 శాతం ప్రజలు దాచుకున్న డబ్బులు వైద్య ఖర్చులకే పెట్టాల్సి వస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఆరోగ్య బీమా వర్తించకుండా 29 శాతం మంది దాకా ఉన్నారని, పట్టణాల్లో 50.3 శాతం మంది ఉన్నారని జాతీయ ఆరోగ్య ముఖచిత్ర గణాంకాల్లో తేలింది. ఆ మేరకు వైద్య చికిత్సల కోసం దవాఖానాల్లో చేరితే ఒకరికి సగటున ఏడాదికి అదనపు ఖర్చు తప్పడం లేదు. తెలంగాణలోని ప్రభుత్వ వైద్యంలో రూ.6,864 కాగా, ప్రైవేట్‌లో రూ.26,461 అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యంలో రూ.4,408 కాగా, ప్రైవేట్ వైద్యంలో రూ. 22,031 అదనపు ఖర్చు అవుతున్నదని తేలింది.
తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నకిలీ డాక్టర్లు, కల్తీ మందులు, నిబంధనలు పాటించని హాస్పిటళ్లు, ల్యాబ్ లపై తనిఖీలు పెంచి కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. వెను వెంటనే ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం వైద్య వ్యవస్థల్లోని అన్ని రంగాల్లో దోపిడీని నియంత్రించడం ప్రభుత్వాలు తక్షణ బాధ్యతగా భావించాలి. మన రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానాల్లో నిబంధనల ఉల్లంఘన, అనుమతులు లేకున్నా చికిత్సలు చేస్తున్న తీరుపై ప్రజల ఫిర్యాదుకు స్పందించిన మన రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖతో చేయించిన తనిఖీల్లో ప్రైవేటు దవాఖానాల్లో 37శాతం నిబంధనల ఉల్లంఘన, అనుమతులు లేని చికిత్సలు చేస్తున్నట్లు తేలింది. వీటిలో హైదరాబాదులో అత్యధిక కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానాల్లో కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాది కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్యాధికారుల లోపాయికారి సహకారం వీరికి కొనసాగుతున్నట్లు తేలింది. అంతే కాకుండా ముడుపులు ఇస్తే తనిఖీల తర్వాత అంతా యదాతథ స్థితి కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే రోగనిర్ధారణ కేంద్రాలు, ల్యాబులు నిర్వహిస్తున్నట్లు తేలింది. డాక్టర్ల సూచనల మేరకు ల్యాబుల్లో రక్త, మూత్ర తదితర పరీక్షలు చేయించుకోవాలి. కానీ వాస్తవంగా అలా జరగడం లేదు. డయాగ్నిస్టిక్ సెంటర్లు కనీస జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండానే నమూనాలు సేకరిస్తున్నాయి. అధిక శాతం ల్యాబుల్లో పరీక్షించేది సాంకేతిక సహాయకులే. నిపుణులు మాత్రమే పరీక్షించి తుది ఫలితాలు ఇవ్వాల్సి ఉన్నా, సహాయకులే అంతా చేస్తున్నారు.
సర్కారు వైద్యాన్ని బలోపేతం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల నుంచి డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో హాస్పిటళ్లు, ల్యాబ్‌లు నిబంధనలన్నీ తుంగలో తొక్కేశాయని వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో బయటపడింది. ల్యాబ్‌లలో వ్యాధి నిర్ధారణ అంత ఆషామాషి అంశం కాదు. మల, మూత్ర, రక్త తదితర పరీక్షలను నిర్వహించడంలో ప్రధానంగా స్పెషలిస్ట్ వైద్య నిపుణులు సేవలు అందించాల్సి ఉంటుంది. పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ ప్రావీణ్యం ఉన్న వారు మాత్రమే మెరుగైన ఫలితాలు ఇవ్వగలరు. వీరి పని సహాయకులే చేయడం వల్ల కొన్ని సార్లు తప్పుడు పరీక్షల ఫలితాలతో డాక్టర్లు కూడా తప్పుడు మందులు సూచించే ప్రమాదం ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షకు ఎంత డబ్బు తీసుకోవాలో పెద్ద అక్షరాలతో అందరికి కనబడేలా బోర్డు పెట్టాలి. కానీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. కొందరు డాక్టర్లు, సిబ్బంది సర్కారీ జీతం తీసుకుంటూ సర్కారీ వైద్యం అందించడం నిర్లక్ష్యం చేస్తూ వారి ధ్యాసంతా ప్రైవేట్ ప్రాక్టీస్ పైనే కొనసాగిస్తున్నారు. వైద్య రంగాన్ని గాడిన పెట్టాలంటే తనిఖీలు తీవ్రతరం చేసి, నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. కల్తీ మందులను అరికట్టాలి. నిబంధనలు పాటించని దవాఖానాలను, ల్యాబులను నియంత్రించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా మహానగరాల్లో, పట్టణ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్‌కాలేజీలను ఏర్పాటు చేయడం అభినందనీయమే. అదే స్థాయిలో గ్రామీణ, మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలి. సకల సౌకర్యాలతో మెరుగుపరుస్తూ, ప్రైవేటు రంగంలోని దోపిడీని అరికట్టాలి.
- మేకిరి దామోదర్,
సోషల్ ఎనలిస్ట్