తరుగు పేరుతో దోపిడీ..! 10 నుంచి 12 కేజీల కోత పెడుతున్న మిల్లర్లు

  •     తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొర్రీలు 
  •     మిల్లుల్లో పాత ధాన్యం నిల్వ ఉండడమే కారణం
  •     న్యాయం చేయాలంటూ రైతుల ఆందోళనలు

ఖమ్మం, వెలుగు: పంట సీజన్లు మారుతున్నా రైతుల పరిస్థితి మాత్రం మారడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల చేతిలో అన్నదాతల దోపిడీ ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో, తరుగు కింద క్వింటాలుకు10 కేజీల నుంచి12 కేజీల వరకు కట్ చేస్తున్నారు. గత నెలలో రెండుసార్లు వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో  పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం కారణంగా సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో అధిక శాతం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకే రైతులు అగ్గువకు అమ్ముకున్నారు. జిల్లాలో 230 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు, రెండు వారాలైనా ఇప్పటి వరకు అందులో నాలుగో వంతు మాత్రమే ప్రారంభించారు. అందులో కూడా కొన్ని కేంద్రాల్లో మాత్రమే కాంటాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 8500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.

 4లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం

యాసంగి సీజన్ లో అధికారులు నాలుగు లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత రెండు సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలు ఇంకా మిల్లుల్లో ఉండడం, సీఎంఆర్ ను తీసుకునేందుకు ఎఫ్ సీఐ కూడా గోడౌన్లు ఖాళీ లేవంటూ ఆలస్యం చేస్తుండడం మిల్లర్లకు ఇబ్బందికరంగా మారింది. తాము ధాన్యం కొనుగోలు చేసి ఎక్కడ స్టాక్ పెట్టాలంటూ జిల్లా అధికారులకు చెప్పుకున్నా ఫలితం లేక తేమ శాతంపై పట్టుబడుతున్నారు. 

తూర్పారబట్టిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తెస్తేనే తీసుకుంటామంటూ కొర్రీలు పెడుతున్నారు. సొసైటీలు కొనుగోలు చేసిన ధాన్యం లోడ్ లను కూడా క్వింటాలుకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తేనే అన్ లోడ్ చేసుకుంటామంటున్నాయి. రెండురోజుల క్రితం సత్తుపల్లి సమీపంలోని కాకర్లపల్లి సొసైటీ నుంచి సమీపంలోనే ఉన్న మిల్లుకు ధాన్యాన్ని అలాట్ చేశారు. తరుగు, తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సతాయించడంతోపాటు లారీలోని ధాన్యాన్ని దింపకుండా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 7 కేజీల తరుగు ఒప్పుకోవడంతో అన్ లోడ్ చేసుకున్నారు. ఎర్రుపాలెం మండలంలోని పెద్దగోపవరం సొసైటీ లోనూ రైతుల వద్ద పన్నెండు కేజీల వరకు తరుగు తీస్తున్నారు. తూర్పారబట్టకపోవడం కారణంగానే తరుగు తీయాల్సి వస్తుందని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు.

మిల్లుల దగ్గర రైతుల ధర్నా...

మిల్లర్లు రైతులు తెచ్చిన ధాన్యాన్ని దింపుకోవడంలేదని తల్లాడ మండలం గొల్లగూడెం, పినపాక, అన్నారుగూడెం తదితర గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తల్లాడలో కొత్తగూడెం రోడ్డులో ఉన్న మిల్లుల దగ్గర ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కాంటాలు వేసి, ట్రక్ షీట్లు రాయించుకొని అధికారులు అలాట్ మెంట్ చేసిన మిల్లులకు ధాన్యం తెచ్చిన తర్వాత, మిల్లర్లు దింపుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

క్వింటాలుకు 6 నుంచి 7 కేజీల తరుగు ఒప్పుకుంటే అన్​లోడ్​ చేసుకుంటామని, మిల్లర్లు చెబుతున్నారని రైతుల ఆరోపించారు. తక్షణమే ఆఫీసర్లు స్పందించి మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. స్పందించిన తహసీల్దార్ గంటా శ్రీలత, ఎస్సై సురేశ్​రైతుల వద్దకు చేరుకొని మిల్లర్లతో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.