బెస్ట్ టూరిస్ట్ స్పాట్..ప్రకృతి అందాల పాపికొండలు..

 భద్రాచలం, వెలుగు : జలజలా పారే గోదావరి పరవళ్లు.. చుట్టూ పచ్చని అడవులు. అతిథులకు స్వాగతం పలికే ఆదివాసీలను చూస్తూ గోదావరిలో బోటుపై ప్రయాణిస్తూ పాపికొండల అందాలను ఆస్వాదిస్తుంటే ఆ అనుభూతే వేరు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులతో పాపికొండలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఆంధ్రాలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన కొండలే పాపికొండలు.

ఈ కొండల మధ్య గోదావరి వయ్యారంగా ప్రవహిస్తోంది. ఈ రెండు జిల్లా భూభాగాల్లో పాపిడిలా ప్రవహించే వీటికి పాపిడికొండలు అని పేరు వచ్చింది. కాలక్రమంలో వీటిని పాపికొండలు అని పిలుస్తున్నారు. శీతాకాలంలో మొదలైన పాపికొండల విహారయాత్ర మే నెల వరకు కొనసాగుతుంది. తెలంగాణలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి ఆంధ్రాలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి టూరిస్టులు బోట్లలో పాపికొండల విహార యాత్రకు వస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు దినాల్లో టూరిస్టులతో కళకళలాడుతోంది.

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దర్శనం తర్వాత 72 కి.మీల దూరంలో పోచవరం దగ్గర బోటింగ్​ పాయింట్​కి ఉదయం 7.30గంటలకు టూరిస్టులు బయలుదేరుతారు. ఇక్కడ నుంచి 21 లాంచీలు టూరిస్ట్​లను విహారయాత్రకు తీసుకెళ్తాయి. పోచవరం బోటింగ్​ పాయింట్​ దగ్గర బయలుదేరిన డబుల్​ ఇంజన్ల లాంచీ బయలుదేరి పాపికొండలు దాటాక వచ్చే సిరివాకకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి పోచవరానికి వస్తుంది. గోదావరి, పాపికొండలు, ఆదివాసీల చరిత్రను తెలియజేసే గైడ్స్ ఉంటారు. టూరిస్టులను ఎంటర్​టైన్ చేయడానికి కొందరు ఆదివాసీ యువకులు డ్యాన్స్, పాటల ప్రోగ్రాంలు బోట్​లో నిర్వహిస్తారు. 

ఆధ్యాత్మిక శోభ బాలానందమునివాటం

టూరిస్టులు 9.30 గంటలకు పోచవరం చేరుకుంటారు. పోచవరం నుంచి బయలుదేరిన లాంచీలో టూరిస్టులకు గోదావరికి ఇరువైపులా ఉన్న గడ్డిపూలు, గిరిపల్లెలు, మార్గం మధ్యలో పేరంటాలపల్లి బాలానందమునివాటం ఆశ్రమం కనిపిస్తాయి. ఆశ్రమాన్ని ఆనుకుని చల్లని నీటి జలపాతం ప్రవహిస్తుంది. గోదావరి ఒడ్డున కొండరెడ్ల గిరిజనులు వెదురుతో తయారు చేసిన కళాకృతులు ఆకట్టుకుంటాయి. టూరిస్ట్​లు వాటిని కొనుక్కోవచ్చు.

తిరిగి లాంచీ టూరిస్టులతో బయలుదేరి 10 గంటలకు పాపికొండల మధ్య  ప్రయాణిస్తుంది. ఎత్తైన పాపికొండలను తిలకిస్తూ టూరిస్టులు మురిసిపోతారు. కొల్లూరు దగ్గర పాపికొండలు మొదలై సిరివాకతో ముగుస్తాయి. ఈ కొండల మధ్య ప్రయాణమే టూరిస్టులకు చిరకాలం గుర్తుండిపోతుంది. సాయంత్రం 4.30గంటలకు పోచవరం నుంచి వాహనాలు భద్రాచలంకు బయలుదేరి, రాత్రి 7 గంటలకు చేరుకుంటాయి. రామదర్శనం చేసుకుని టూరిస్టులు భద్రాచలం నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లిపోతారు. 

టికెట్ ధరలు ఇలా..

పోచవరంలో బుకింగ్​ కౌంటర్లు ఉంటాయి. టికెట్ ధర ఒకరికి రూ.1250లు, పిల్లలకు రూ.1050లు. లాంచీలో టిఫిన్​, భోజనం, స్నాక్స్, టీలతో సహా తిరిగి వెళ్లేవరకు అన్నీ నిర్వాహకులే చూసుకుంటారు. సొంత వాహనం ఉంటే మాత్రం పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750లు తీసుకుంటారు. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కోసం టూరిస్ట్​ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. స్కూల్ పిల్లలకు రూ.750లు, కాలేజీ అయితే రూ.850లు టికెట్ ధర ఉంటుంది. ప్రతీ లాంచీలో లైఫ్​ జాకెట్లు ఉంటాయి. బోట్​కు రక్షణగా గజ ఈతగాళ్లతో ఉన్న స్పీడ్​ బోటు వెళ్తుంది. ప్రతీ టూరిస్ట్​కి ఆధార్​కార్డు  ప్రూఫ్​ తప్పనిసరి.