తెలంగాణ స్పైస్ కిచెన్‎లో భారీ పేలుడు.. బ్లాస్టింగ్‎కు కారణం ఇదేనా..?

హైదరాబాద్‎లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‎ నడిబొడ్డున పేలుడు సంభవించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీశారు. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‎లో జరిగిన పేలుడుకి కిచెన్‎లోని ఫ్రిజ్ కంప్రెషర్ పేలడమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

ఈ ఘటనలో హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రిజ్ కంప్రెషర్ మెయింటెన్స్‎ను కిచెన్ సిబ్బంది పర్యవేక్షించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు సీరియస్‎గా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం తెలంగాణ స్పైసీ కిచెన్‎లో జరిగిన బ్లాస్టింగ్‎కు అసలు కారణం ఏంటన్నది వెల్లడి కానున్నది. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగిందా..? లేదా పేలుడికి మరేదైనా కారణం ఉందా..? అన్నది బయటపడనుంది. 

శనివారం (నవంబర్ 8) అర్ధరాత్రి జరిగిన ఈ పేలుడు ధాటికి తెలంగాణ స్పైసీ కిచెన్ ప్రహరీ గోడలు ధ్వంసం అయ్యాయి. హోటల్ కింది భాగంగాలో ఉన్న దుర్గా భవానీ నగర్ బస్తీ‎లోని ఇండ్లపై రాళ్లు ఎగిరిపడ్డాయి. దీంతో బస్తీలోని నాలుగు ఇండ్లు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. రాళ్లు ఎగిరి దాదాపు 100 మీటర్ల దూరంలో పడటంతో ఓ మహిళ, బాలికకు గాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి బస్తీలోని పలుచోట్ల కరెంట్ స్తంభాలు నేలకూలాయి.

 అర్ధరాత్రి అంతా ప్రశాంతంగా ఉన్న వేళ భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బస్తీ జనం తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. ఏం జరిగిందో అర్థంకాక ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. గాయాలపాలైన వారిని స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ హాని జ‌ర‌గ‌పోవ‌డంతో అంద‌రూ బస్తీ వాసులు, అధికారులు, రెస్టారెంట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.