
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో పేలుడు సంభవించింది. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి పేలుడు జరగడంతో గోడౌన్‌లో పని చేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందడంతో హుటాహుటీన ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని అనంతపురం పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ నిపుణులు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, ఆధారాలను సేకరించారని చెప్పారు. స్క్రాప్ మెటీరియల్‌ను మెషీన్‌తో తుక్కుకింద మారుస్తుండగా ఈ పేలుడు జరిగిందని తెలుస్తోందని, మెషీన్ బ్లేడ్లు వర్కర్లకు తగలడంతో ఇద్దరు మహిళలు మరణించారని అనంతపురం డీఎస్పీ వీర రాఘవ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉందని చెప్పారు. కాగా, ఈ ఘటన గురించి తెలిసి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.